2024 ఎన్నికల నినాదం డిసైడ్ చేసిన జగన్

Update: 2021-11-23 12:30 GMT
ప్రభుత్వం చెబుతున్నట్లుగా మూడు రాజధానుల కోసం ప్రభుత్వం తీసుకురాబోతున్న కొత్త బిల్లుకు కనీసం ఏడాది పడుతుందని న్యాయనిపుణుడు పొనక జనార్ధనరెడ్డి అభిప్రాయపడ్డారు. ప్రస్తుత బిల్లులో ఉన్న కొన్ని సాంకేతిక లోపాలను సరిచేయాలని ప్రభుత్వం అనుకోవటంతోనే మూడు రాజధానుల బిల్లును ఉపసంహరించుకున్నట్లు చెప్పారు.

కొత్తగా తీసుకురాబోతున్న బిల్లులో ఎలాంటి న్యాయ వివాదాలకు చోటు లేకుండా, లొసుగులు లేకుండా, ఎవరు కూడా సాంకేతికంగా తప్పు పట్టడానికి లేకుండా సమగ్రమైన, స్పష్టమైన బిల్లు తీసుకురావాలని జగన్మోహన్ రెడ్డి డిసైడ్ అయినట్లు న్యాయ నిపుణులు అభిప్రాయపడ్డారు.

ఇపుడు ఉపసంహరించుకున్న బిల్లులో కొన్ని సాంకేతిక లోపాలున్నట్లు స్వయంగా జగన్మోహన్ రెడ్డే అంగీకరించిన విషయాన్ని న్యాయనిపుణులు గుర్తుచేశారు.

లోపాలను సవరించటంతో పాటు అందరి అనుమానాలను తొలగించేందుకు కొత్తగా రూపొందించే బిల్లులో తగిన సమాధానాలు ఉండాలని జగన్ భావిస్తున్నట్లు చెప్పారు. ఢిల్లీ పెద్దల ఒత్తిడి కారణంగానే మూడు రాజధానుల బిల్లును జగన్ ఉపసంహరించుకున్నారనే ప్రచారాన్ని సదరు న్యాయనిపుణుడు కొట్టిపారేశారు.
Read more!

మూడు రాజధానుల బిల్లు ఉపసంహరణకు, ఢిల్లీ పెద్దల నుండి ఫోన్ రావటానికి సంబంధమే లేదన్నారు. బిల్లును ఉపసంహరించే విషయంతో పాటు కొత్త బిల్లును తీసుకొచ్చే విషయమై జగన్ న్యాయనిపుణులతో కొద్ది రోజులుగా చర్చిస్తున్నట్లు సదరు న్యాయనిపుణుడు స్పష్టంచేశారు. ప్రభుత్వం కొత్తగా తీసుకురాబోతున్న బిల్లుకు కనీసం ఏడాది కాలం పట్టే అవకాశాలున్నట్లు కూడా అభిప్రాయపడ్డారు.

బిల్లును రూపొందించటంలో ఈసారి అన్నీ కోణాల నుండి చాలా జాగ్రత్తలు తీసుకోవాలని జగన్ గట్టిగా డిసైడ్ అయినట్లు తెలిపారు. సదరు న్యాయనిపుణుడు చెప్పిన ప్రకారం చూస్తే ఏడాదిలోగా మూడు రాజధానుల కొత్త బిల్లు వచ్చే అవకాశం లేదని తేలిపోతోంది.

ఇందుకోసం ప్రభుత్వం ఇప్పటికే సీనియర్ న్యాయనిపుణులతో చర్చలు కూడా మొదలుపెట్టిందని అర్ధమవుతోంది. సో, జరుగుతున్నదంతా చూస్తుంటే వచ్చే ఎన్నికలకు మూడు రాజధానుల అంశమే కీలకమైన పాయింట్ అయ్యేట్లుంది.


Tags:    

Similar News