భారత్ 10 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థ కల..ఇప్పుడెక్కడున్నాం..?

Update: 2019-08-20 14:30 GMT
భారతదేశాన్ని 2022 నాటికి 10 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారుస్తామని మోదీ ప్రభుత్వం చెబుతోంది. అంటే ప్రస్తుత ఆర్థిక సామర్థ్యంతో పోలిస్తే దాదాపు మూడు రెట్లుకు పైగా పెరగాలి. ప్రపంచబ్యాంకు గణాంకాలు-2017 ప్రకారం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మొత్తం 80 లక్షల కోట్ల డాలర్లు. అందులో భారత్ వాటా కేవలం 3.3 శాతం. అంటే... 2.62 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థ మనది.

ఇవన్నీ 2017 నాటి లెక్కలు. దాని ప్రకారం ప్రపంచ ఆర్థిక చిత్రపటంలో దాదాపు నాలుగో వంతును అమెరికా ఆర్థిక వ్యవస్థే ఆక్రమించింది. 80 లక్షల కోట్ల డాటర్ల ప్రపంచ ఆర్థికంలో 19.4 లక్షల కోట్ల డాలర్లు(24.4 శాతం)తో అమెరికా అగ్రస్థానంలో ఉంది. ఆ తరువాత స్థానం చైనాది. 12.2 లక్షల కోట్ల డాలర్లు(15.4 శాతం వాటా) ఆర్థిక వ్యవస్థ చైనాది. మూడో స్థానంలో జపాన్ 4.87 లక్షల కోట్ల(6.1 శాతం)తో ఉండగా... జర్మనీ - బ్రిటన్‌ లు ఆ తరువాత స్థానాల్లో ఉన్నాయి. భారత్ ఆరో స్థానంలో ఉంది.

2017 నాటికి భారత్ ఆరో స్థానంలో ఉన్నప్పటికీ అయిదో స్థానంలో ఉన్న బ్రిటన్‌ కూ మనకు పెద్ద వ్యత్యాసం లేదు. కేవలం 200 కోట్ల డాలర్ల వ్యత్యాసం మాత్రమే ఉంది. ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉన్నప్పటికీ దీన్నుంచి బయటపడడానికి కేంద్రం చేస్తున్న ప్రయత్నాలతో భారత్ త్వరలోనే కోలుకుంటుందని భావిస్తున్నారు.

వరుస సంస్కరణల కారణంగానే భారత ఆర్థిక వ్యవస్థలో మందగమనం ఏర్పడిందని... సంస్కరణలు ఫలితమివ్వడం ప్రారంభిస్తే ఆర్థిక వృద్ధి మొదలై ఆర్థిక వ్యవస్థ పుంజుకొంటుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు... వచ్చే 12 ఏళ్లలో 10 లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థగా అవతరించాలనుకుంటున్న భారత్ ఆ దిశగా ప్రయాణం సాగించేందుకు తక్షణ లక్ష్యంగా 5 లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించే ప్రయత్నాలను ముమ్మరం చేస్తోంది.


Tags:    

Similar News