కడప–రేణిగుంట గ్రీన్‌ ఎక్స్‌ ప్రెస్‌ హైవేకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ !

Update: 2020-10-26 06:30 GMT
రాయలసీమ వాసులకి కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. హైదరాబాద్ నుండి తిరుపతి , చెన్నై వెళ్లే కడప–రేణిగుంట మధ్య నాలుగు వరుసల హైవేను నిర్మించాలని కీలక నిర్ణయం తీసుకున్నారు. రాయలసీమ జిల్లాలకు ముఖ్య రహదారి అయిన ఈ రోడ్డు ప్రస్తుతం రెండు వరుసలుగా ఉంది. అయితే , తాజాగా ఈ హైవేను నాలుగు లేన్లుగా మార్చేందుకు నేషనల్‌ హైవేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా పనులు వేగవంతం చేసింది. ఈ హైవే ను ఇటీవలే గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ వేగా గుర్తించింది. త్వరలోనే దీనికి సంబంధించి  టెండర్లకు కూడా సిద్ధమవుతున్నారు.

ఒక్క కడప జిల్లాలోనే సుమారు 100 కి.మీ. మేర రహదారి నిర్మించనున్నారు. దీనిని రెండు ప్యాకేజీలుగా విభజించి 1,068 ఎకరాలు సేకరించనున్నారు.  రెండో ప్యాకేజీ కింద కడప జిల్లా సిద్ధవటం మండలం మొదలుకుని రైల్వేకోడూరు మండలం వరకు నిర్మించేందుకు అధికారులు నిర్ణయించారు. ఈ మార్గంలో 3 వంతెనలు, 2 రైల్వే ఓవర్‌ బ్రిడ్జిలు నిర్మించనున్నారు. భూ సేకరణ పనులు వేగవంతంగా సాగుతున్నాయి. గతేడాది అక్టోబర్‌ లో ఈ హైవేకు ఎన్‌ హెచ్‌–716 కేటాయించారు. ఎంపీ వైఎస్‌ అవినాశ్‌రెడ్డి చొరవతో ఎన్‌ హెచ్ ‌ఏఐ అలైన్‌ మెంట్‌ ను ఖరారు చేసింది. కడప వద్ద వైఎస్సార్‌ టోల్ ‌ప్లాజా నుంచి రేణిగుంట వరకు 4 లేన్ల నిర్మాణం జరగనుంది. రూ.3 వేల కోట్లతో 133 కి.మీ. మేర నిర్మించనున్న ఈ హైవే కి కేంద్రం అనుమతి లభించడంతో  జిల్లా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు వేగవంతంగా చేస్తోంది.

మొదటి ప్యాకేజిలో  వైఎస్సార్‌ జిల్లా బద్వేలు నుంచి నెల్లూరు జిల్లా కృష్ణపట్నం పోర్టు వరకు 4 లేన్ల రహదారి నిర్మాణానికి డీపీఆర్‌ సిద్ధమైంది. మొత్తం 138 కి.మీ. మేర రోడ్డు నిర్మాణాన్ని ఎన్‌ హెచ్‌ ఏఐ చేపట్టనుంది. నాలుగు వరుసల ఈ హైవే టెండర్లను త్వరలోనే పూర్తిచేస్తాం. ఈ ప్రాజెక్టును నాలుగేళ్లలో నిర్మిస్తాం. ఇప్పటికే భూసేకరణ పనులు ప్రారంభించాం. జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తోందని చీఫ్‌ ఇంజనీర్ చెప్పారు.
Tags:    

Similar News