నాహత్యకు కుట్ర.. త్వరలో ఆధారాలు: ఈటల సంచలనం

Update: 2021-07-20 16:17 GMT
హుజూరాబాద్ లో రాజకీయ వేడి రగులుకుంటోంది. బీజేపీ నేత, మాజీ మంత్రి పాదయాత్రలో సంచలన వ్యాఖ్యలతో సెంటిమెంట్ పండిస్తున్నాడు. 'తనపై ఓ మంత్రి హంతక ముఠాతో చేతులు కలిపి చంపాలని చూస్తున్నాడని' ఈటల చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని రేపాయి. తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి.

ఇక తనను చంపడానికి ఓ టీఆర్ఎస్ మంత్రి కుట్ర చేశారని బీజేపీ నేత ఈటల రాజేందర్ ఆరోపణలపై కూడా మంత్రి గంగుల స్పందించారు. 'ఈటల ప్రాణాలను కాపాడడానికి నా ప్రాణాలు ఫణంగా పెడుతానని ' చెప్పుకొచ్చారు. రాజకీయాల్లో హత్యలుండవని.. ఆత్మహత్యలే ఉంటాయని ఈటలకు గంగుల కౌంటర్ ఇచ్చారు. ఈటల తన జీవితాన్ని తానే నాశనం చేసుకుంటున్నారన్నారు.

ఒకవేళ నిజంగా నేను ఆ పనులు చేసి ఉంటే మీ కేంద్రమంత్రి అమిత్ షాకు ఫిర్యాదు చేసి సీబీఐ ఎంక్వైరీ వేసి తనపై విచారణ చేసుకోవచ్చని మంత్రి గంగుల కమలాకర్ సవాల్ చేశారు. ఈటల ఆరోపణలు అన్ని అవాస్తవాలని అన్నారు. నాకు ఈటలతో ఎలాంటి వ్యక్తిగత వైరం  లేదని.. పెద్దమ్మతల్లిపై ప్రమాణం చేస్తానని గంగుల అన్నారు. ఈటల కూడా ప్రమాణం చేయాలని.. అబద్దమాడితే పెద్దమ్మతల్లియే ఆయనను శపిస్తుందని గంగుల ఆక్షేపించారు.

ఇక గంగుల మాట్లాడిన మాటలపై మరోసారి ఈటల రాజేందర్ స్పందించారు. పాదయాత్రలో కీలక వ్యాఖ్యలు చేశారు. 'ఓ మంత్రి హంతకముఠాతో చేతులు కలిపి నా హత్యకు కుట్ర చేస్తున్నారనేది ఆరోపణకు కట్టుబడి ఉన్నాను. త్వరలోనే ఫోటోలతో ఆధారాలు విడుదల చేస్తాను' అని స్పష్టం చేశారు. ఓడిపోతామన్న అహసనంతోనే ఇలాంటి చిల్లర పనులకు పాల్పడుతున్నారని ఈటల అన్నారు. దళితులకు మూడు ఎకరాలు.. సబ్ ప్లాన్ నిధులు అందడం లేదన్నారు. ఎన్నికల కోసమే హుజూరాబాద్ లో వరాలు కురిపిస్తున్నారన్నారు.

ఇక హుజూరాబాద్ ఎన్నికల్లో ఓటుకు రూ.10వేల రూపాయలు ఇస్తారట.. అవి తీసుకోండని.. కానీ కమలం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను ఈటల కోరారు. డబుల్ బెడ్ రూం ఇళ్లు సొంతంగా నిర్మించుకునే అవకాశం కల్పించాలని ఈటల ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఇలా ఈటల రాజేందర్-కమలాకర్ మధ్య వాద ప్రతివాదనలతో ఇప్పుడు హుజూరాబాద్ ఉప ఎన్నిక వేడెక్కింది. ఇద్దరూ మాటకు మాటగా సమాధానాలు చెబుతుండడంతో ఈ ఆరోపణలు చర్చనీయాంశమవుతున్నాయి.
Tags:    

Similar News