పనబాకకు హామీ వచ్చినట్లేనా ?

Update: 2020-11-26 10:50 GMT
అసలు ఎందుకు ఇన్ని రోజులు బెట్టు చేశారు పనబాక లక్ష్మి ? ఈ విషయమై ఎవరికీ అర్ధం కావటం లేదు. బుధవారం సాయంత్రం చంద్రబాబునాయుడుతో పనబాక దంపతులు భేటీ అయ్యారు. తొందరలో జరగబోయే లోక్ సభ ఉపఎన్నికలో టీడీపీ తరపున పనబాక లక్ష్మి పోటీచేస్తారంటూ చంద్రబాబునాయుడు ప్రకటించిన విషయం తెలిసిందే. మామూలుగా అయితే ఇన్ని నెలల ముందుగా అభ్యర్ధిని ప్రకటించటం అన్నది చంద్రబాబు మనస్తత్వానికి పూర్తిగా విరుద్ధం. టికెట్ ఖాయమని తెలిసినా బీఫారం చేతికొచ్చేటప్పటికి అభ్యర్ధి బీపీతో పిచ్చెక్కిపోవాల్సిందే అన్నట్లుంటుంది చంద్రబాబు వ్యవహారం.

అలాంటిది ఉపఎన్నిక నోటీఫికేషన్ తో సంబంధం లేకుండానే పనబాకను అభ్యర్ధిగా ప్రకటించేశారు. సరే చంద్రబాబు పని చంద్రబాబు చేసేశారు. కానీ అటువైపు నుండే అంటే పనబాక నుండి ఎటువంటి స్పందనా కనబడలేదు. దాంతో ఆమెకు పోటీ చేసే ఉద్దేశ్యం లేదని ప్రచారం పెరిగిపోయింది. పోటీ చేస్తానని కానీ చేయనని కానీ ఒక్క ముక్క కూడా మాజీ ఎంపి చెప్పకపోవటంతో ప్రచారం నిజమే అన్నట్లుగా ముద్రపడిపోయింది.

ఈ నేపధ్యంలో మాజీ ఎంపి మనోగతాన్ని తెలుసుకునేందుకు చంద్రబాబు సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని రాయబారానికి  పంపారు. మొత్తానికి సోమిరెడ్డి రాయబారం ఫలించినట్లే ఉంది. అందుకనే బుధవారం సాయంత్రం తన భర్తతో కలిసి పనబాక టీడీపీ జాతీయ అధ్యక్షుడు ఇంటికి వెళ్ళి భేటీ అయ్యారు. అంటే సోమిరెడ్డి సమక్షంలోనే భేటి జరిగింది లేండి.

పోటీ చేసేందుకు అవసరమైన ఆర్ధిక విషయాలపై దంపతులు చంద్రబాబు నుండి స్పష్టమైన హామీనీ తీసుకున్నారట. కేవలం ఆర్ధిక విషయంపై హామీ అంటే ఎందుకో ఎవరు నమ్మలేకపోతున్నారు. ఎందుకంటే ఉపఎన్నికల్లో పోటీ చేయాలంటే ఖర్చు మొత్తం టీడీపీనే పెట్టుకుంటుందన్న విషయం అందరికీ తెలిసిందే. పైగా పోటీ చేయాలనే పనబాక ఇష్టంకన్నా పోటీ చేయించాలన్న చంద్రబాబు ఆలోచన స్పష్టంగా కనిపిస్తోంది. తనంతట తానుగా ఓ నేతను అభ్యర్ధిగా ప్రకటించారంటే ఖర్చు మొత్తం పార్టీనే పెట్టుకోవాలన్న చిన్న విషయం చంద్రబాబుకు తెలీకుండానే ఉంటుందా ?

అంటే ఇంతకు మించిన హామీ ఏదో పనబాక దంపతులు చంద్రబాబు నుండి ఆశించారనేది సమాచారం. అదేమిటో తెలిసేవరకు సస్పెన్సు తప్పదు. ఓ నాలుగు రోజులు ఓపిక పడితే పనబాక దంపతుల ద్వారానో లేకపోతే మధ్యలో ఉన్న సోమిరెడ్డి ద్వారానో పార్టీ నేతలకు  ఉప్పందకుండానే ఉంటుందా ? అప్పుడు బయటకు రాకుండానే ఉంటుందా.  చూద్దాం ఎప్పుడో ఓ సమయంలో బయట పడకుండా ఉంటుందా.
Tags:    

Similar News