నచ్చని డాక్టర్ ను పీకేసేందుకు రూ.99కోట్ల ఖర్చు

Update: 2015-10-05 20:28 GMT
వినటానికి విచిత్రంగా ఉన్నా ఒక డాక్టర్ నచ్చలేదని.. అతగాడ్ని ఉద్యోగంలో నుంచి తీసేయటానికి ఓ ట్రస్ట్ ఇప్పటివరకూ ఖర్చు చేసిన మొత్తం ఎంతో తెలుసా? అక్షరాల రూ.99కోట్లు. ఇంత భారీ మొత్తంతో తీసేయాలని భావిస్తున్న సదరు డాక్టర్ కారణంగా మరీ అంత ఇబ్బందా? అంటే అది కాస్తా సందేహమే. ఇంతకీ డాక్టర్ తో సదరు ట్రస్ట్ కి ఎందుకు చెడిందన్న విషయంలోకి వెళితే.. విషయాలు కాస్త విచిత్రంగా కనిపిస్తాయి.

ఇంగ్లండ్ లోని స్టాఫర్డ్ షోర్ లో నేషనల్ హెల్త్ సర్వీస్ ఫౌండేషన్ ట్రస్ట్ లో భారత సంతతికి చెందిన దిత్యా అగర్వాల్ అనే వైద్యుడు పని చేస్తున్నాడు. లివర్ సర్జన్ గా పని చేస్తున్న అతగాడు.. ఆసుపత్రిలోని సౌకర్యాల గురించి మాట్లాడిన మాటలు ట్రస్ట్ కు వ్యతిరేకంగా ఉన్నాయట. అంతే.. అతని ఉద్యోగం పీకేసింది సదరు ట్రస్ట్. రోగుల భద్రత.. సౌకర్యాల గురించి ట్రస్ట్ కు వ్యతిరేకంగా మాట్లాడారన్నది ఆరోపణ.

2011లో జరిగిన ఈ ఘటనపై సదరు డాక్టర్ గుర్రుగా ఉండి కోర్టుకెక్కాడు. దీంతో మరింతగా మండిపోయిన సదరు సంస్థ.. ఆ డాక్టర్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆసుపత్రిలోకి అడుగు పెట్టకుండా చేయాలన్న కంకణం కట్టుకుంది. ఇప్పటివరకూ జరిపిన న్యాయపోరాటం కోసం సదరు సంస్థ రూ.99కోట్లు ఖర్చు చేసింది. అసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఇంత భారీగా ఖర్చు చేసినా అంతిమ తీర్పు మాత్రం ఇంకా రాలేదు. ఇంత ఖర్చు పెట్టి మరీ.. రేపొద్దున కోర్టు కానీ.. సదరు ఉద్యోగిని అన్యాయంగా ఉద్యోగంలో నుంచి పీకేశారని చెబితే..? ప్రస్తుతం విచారణలో ఉన్న ఈ కేసు తీర్పు ఎప్పటికి వస్తుందో..? అప్పటికి సదరు ట్రస్ట్ ఇంకెంత ఖర్చు చేస్తుందో..? ఇంతే మొత్తాన్ని రోగుల సౌకర్యాలకు ఖర్చు చేసి ఉండే ఎంత బాగుండేదో కదూ.
Tags:    

Similar News