ఓడిన పవన్ పై మరో బాంబు..

Update: 2019-06-11 07:21 GMT
అసెంబ్లీ ఎన్నికల్లో ఓడి ఇప్పటికే కృంగిపోయిన పవన్ కళ్యాణ్ పై మరో బాంబు పడింది. ఆయన పార్టీలో పనిచేసి ఇప్పుడు ఎన్నికల తర్వాత బీజేపీలో చేరిన మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు.. తిరుపతిలో మోడీ సమక్షంలో బీజేపీలో చేరిన రావెల  తాజాగా గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ పవన్ కళ్యాన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.  జనసేన అధినేత పవన్ కళ్యాన్ తనను పార్టీలో గుర్తించలేదని.. కనీసం గౌరవించలేదని ఆరోపించారు. పవన్ కళ్యాణ్ ఏనాడు రాజకీయాలపై తనతో చర్చించిన దాఖలాలు లేవని మండిపడ్డారు.

జనసేన కీలక నేతలలో తాను ఒకడినని జరిగిన ప్రచారంలో వాస్తవం లేదని.. పవన్ ఎప్పుడూ తనకు అంత ప్రాధాన్యం ఇవ్వలేదని రావెల ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం తనకు పవన్ అపాయింట్ మెంట్ కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెట్టేవాడని రావెల వాపోయారు. తన సలహాలు - సూచనలను ఎప్పుడూ తీసుకోలేదని పేర్కొన్నారు.

పైకి ఎంతో సన్నిహితంగా అగుపిస్తారని.. కానీ అంత సన్నిహితంగా మెలిగే వ్యక్తి పవన్ కాదని రావెల మండిపడ్డారు. పవన్ ఆశయాలు - ఆదర్శాలు చాలా మంచివని.. సమాజంలో మార్పు తీసుకురావాలనుకునే తపన అభినందనీయమేనన్నారు. అయితే అధికారాన్ని సాధించాలని కానీ అధికారాన్ని సాధించే దిశలో పవన్ విజయవంతం కాలేదన్నారు. అందువల్లే ఘోరంగా ఓడిపోయామని చెప్పుకొచ్చారు.

టీడీపీ - జనసేన పార్టీల మధ్య సంబంధాలు ఉన్నాయన్న ప్రచారమే పవన్ కొంప ముంచిందని అన్నారు. టీడీపీ - జనసేన రెండు ఒకటేనన్న భావన గ్రామీణ స్థాయి వరకు  వెళ్లిందని.. దీన్నే నమ్మి ప్రజలు జనసేనకు ఓటేస్తే టీడీపీకి వేసినట్టు అవుతుందనే భావించి జనసేనను చిత్తుగా ఓడించారని రావెల వ్యాఖ్యానించారు. టీడీపీకి సహకరిస్తుందన్న భావనతోనే జనసేనను ఓడించారని రావెల తెలిపారు.

రావెల ముందు నుంచి వివాదాస్పదుడే.. టీడీపీలో ఉండగా ఇలానే టీడీపీ నేతలతో గొడవపడి పదవులు పోగొట్టుకొని బయటకు వచ్చాడు. ఆ తర్వాత జనసేనలో చేరిన రావెల ఇప్పుడు పవన్ పై సంచలన ఆరోపణలు చేశారు. ఇప్పుడు జనసేనను వీడి బీజేపీలో చేరారు. ఇలా పార్టీల్లో నిలకడగా ఉండని రావెలకు జనసేన ఎలాంటి కౌంటర్ ఇస్తుందో చూడాలి మరి.
Tags:    

Similar News