10 ఏళ్ల బాలుడు..పట్టపగలు 10లక్షలు చోరీ!
పదేళ్లకే ఇన్ని విద్యలు నేర్చుకుంటే ఇక పాతికేళ్లకు ఇంకెంత కిలాడీ అవుతాడో వీడు తెలియదు కానీ.. పట్టపగలు.. మిట్ట మధ్యాహ్నం.. బ్యాంకులో రద్దీగా ఉన్న వేళ ఏకంగా క్యాషియర్ క్యాబిన్ లోకి వెళ్లి మరీ 10లక్షలు కొట్టేశాడు. ఎవ్వరూ పట్టుకోలేకపోయారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని నీమూచ్ జిల్లాలో చోటుచేసుకుంది.
మధ్యప్రదేశ్ లోని నీమూచ్ లో గల కోఆపరేటివ్ బ్యాంకులో రద్దీగా ఉన్న సమయం అదీ. మెల్లిగా ప్రవేశించిన 10 ఏళ్ల బాలుడు కేవలం 30 సెకండ్లలో చిరుతలా 10 లక్షలు చోరీ చేసి అందరికీ షాకిచ్చాడు.
అందరూ లావాదేవీల్లో బీజీగా ఉన్న వేళ.. మెల్లిగా క్యాషియర్ క్యాబిన్ లోకి ప్రవేశించిన 10 ఏళ్ల బాలుడు కేవలం 30 సెకండ్లలో అక్కడున్న నోట్ల కట్టలను తన బ్యాగులో వేసుకొని బ్యాంకు నుంచి బయటపడ్డాడు. బాలుడు పరిగెత్తడం చూసి అనుమానం వచ్చిన సెక్యూరిటీ గార్డ్ అతడి వెంటబడ్డాడు. కానీ.. ప్చ్.. ఆ కిలాడీ బాలుడు తప్పించుకున్నాడు. పదేళ్ల బాలుడు ఏకంగా అంతమందిని బోల్తా కొట్టించి పది లక్షలు కొట్టేయడం సంచలనమైంది.