అరిజోనా అందాలకు ఎసరు.. అమెరికాలో మన పరువు తీసేస్తున్నారు..

అమెరికా వెళ్లేది ఎందుకు? కొందరు చదువుకోవడానికి అంటారు.. మరికొందరు డాలర్లు సంపాదించి లైఫ్ సెటిల్ చేసుకోవడానికి అంటారు.

Update: 2026-05-24 06:16 GMT

అమెరికా వెళ్లేది ఎందుకు? కొందరు చదువుకోవడానికి అంటారు.. మరికొందరు డాలర్లు సంపాదించి లైఫ్ సెటిల్ చేసుకోవడానికి అంటారు. కానీ మనోళ్లలో కొందరికి మాత్రం విదేశాలకు వెళ్లేది ఒక గ్లోబల్ మిషన్ మీద.. అదేంటో తెలుసా? "ప్రపంచంలో ఏ మారుమూల అందమైన ప్రదేశం ఉన్నా.. అక్కడ మా సంతకం ఉండాల్సిందే" అనే వింత రోగం. తాజాగా అమెరికాలోని అరిజోనా రాష్ట్రంలో ఉన్న ప్రఖ్యాత 'సెడోనా' పర్యాటక ప్రాంతంలో మన దేశపు కొందరు ‘రాతగాళ్లు’ చేసిన ఘనకార్యం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

ప్రకృతి అందాల ప్రదేశాల్లో.. ముఖ్యంగా చారిత్రక కట్టడాల మీద కొండల మీద ‘చింటూ లవ్స్ పింకూ’ అనో లేక తమ పేర్ల ప్రథమాక్షరాలో రాసి అమరత్వం సంపాదించుకోవడం మన భారతీయులకు చిన్నప్పటి నుంచీ ఉన్న అలవాటే. దురదృష్టవశాత్తూ ఈ ‘కళా హృదయాన్ని’ అమెరికా తీసుకెళ్లి అక్కడ కూడా ప్రదర్శించారు కొందరు ప్రవాస భారతీయ రత్నాలు.

కేథడ్రల్ రాక్‌పై 'గ్రాఫిటీ' ఘనకార్యం!

అరిజోనాలోని సెడోనా ప్రాంతం ఎర్రటి రాతి కొండలు, ప్రకృతి సిద్ధమైన నిర్మాణాలకు ప్రపంచవ్యాప్తంగా ఫేమస్. అందులోనూ 'కేథడ్రల్ రాక్' అంటే అమెరికా ఫారెస్ట్ సర్వీస్ వారు కంటికి రెప్పలా కాపాడుకునే అత్యంత రక్షిత ప్రాంతం. లక్షల ఏళ్ల నాటి ఆ ప్రకృతి అద్భుతాన్ని చూసి ప్రపంచమంతా మురిసిపోతుంటే.. మన దేశానికి చెందిన కొందరు యువకులకు మాత్రం అందులో ఏదో ‘వెలితి’ కనిపించినట్టుంది!

"ఇంత పెద్ద రాయి ఖాళీగా ఉందేంటి? దీనిపై మన మార్క్ లేకపోతే ఎలా?" అనుకున్నారో ఏమో.. చక్కగా పెయింట్లు, మార్కర్లు పట్టుకుని ఆ రాతిపై పేర్లు, గుర్తులు చెక్కడం మొదలుపెట్టారు. ఈ ‘సృజనాత్మక’ పనిని ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో అది కాస్తా వైరల్ అయ్యింది. అంతే.. స్థానిక అమెరికన్లకు ఎక్కడలేని కోపం వచ్చేసింది.

అమెరికన్ల ఆగ్రహం.. నెటిజన్ల ఆవేదన

"ఈ రాతలు రాయడానికా వీరికి వీసాలు ఇచ్చి మా దేశంలోకి రానిచ్చింది?" "కనీసం ప్రకృతిని గౌరవించే సంస్కారం కూడా లేదా?" అంటూ అమెరికన్లు సోషల్ మీడియాలో ఏకిపారేస్తున్నారు. నిజమే మరి ఇంట్లో వాషింగ్ మెషిన్ వాడడం తెలియకపోయినా ఐటీ కంపెనీల్లో కోట్లు సంపాదిస్తున్నారనే మంచి పేరున్న భారతీయుల పరువును.. ఇలాంటి కొద్దిమంది నిర్లక్ష్యపు చేష్టలు నడిబజార్లో పడేస్తున్నాయి.

సాంకేతికత, వైద్యం, వ్యాపార రంగాల్లో గూగుల్, మైక్రోసాఫ్ట్ సీఈఓల నుంచి నాసా శాస్త్రవేత్తల వరకు భారతీయులు దేశ ప్రతిష్ఠను హిమాలయాలంత ఎత్తుకు తీసుకెళ్తుంటే.. ఇలాంటి ‘సింగితం’ బ్యాచ్ మాత్రం కొండలెక్కి మరీ ఆ ప్రతిష్ఠను పాతాళానికి తొక్కేస్తున్నారు. "కొద్దిమంది చేసే పనుల వల్ల మొత్తం ఇండియన్స్ తలదించుకోవాల్సి వస్తోంది" అంటూ అక్కడి ఎన్నారైలు సైతం నెత్తీ నోరూ బాదుకుంటున్నారు.

ఇకనైనా మారదాం బాస్!

ప్రకృతి సంపదను, పర్యావరణాన్ని కాపాడడం అనేది కనీస బాధ్యత. విదేశాలకు వెళ్ళినప్పుడు అక్కడి చట్టాలను, సంస్కృతిని గౌరవించడం చదువుకున్న ఎవరికైనా ఉండాల్సిన కనీస జ్ఞానం. మీ పేరు చరిత్రలో నిలిచిపోవాలంటే సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలి కానీ ఇలా అమెరికా కొండల మీద బొమ్మలు గీస్తే వచ్చేది గుర్తింపు కాదు.. పోలీస్ కేసులు, జరిమానాలు మాత్రమే!

ప్రస్తుతం ఈ వ్యవహారంపై అమెరికా అధికార యంత్రాంగం దర్యాప్తు చేపట్టే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మనోళ్లు రాసిన రాతల ఆధారంగా వారిని పట్టుకోవడం పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు. ఏదేమైనా "ఇక్కడ ఉమ్మి వేయరాదు", "గోడలపై రాయరాదు" అనే బోర్డులు మన దేశంలోనే కాదు.. ఇకపై అమెరికా కొండల దగ్గర కూడా తెలుగు, హిందీ భాషల్లో పెట్టించకముందే మనవాళ్లు బుద్ధి తెచ్చుకుంటే దేశానికి, మన పరువుకి చాలా మంచిది..



Tags:    

Similar News