ఐపీఎస్‌లు ఐఏఎస్‌లు ఎలా అయ్యారు?.. తెలంగాణ హైకోర్టు విస్మయం
''వారేమో ఐపీఎస్‌లు. మీరేమో (ప్రభుత్వం) వారిని ఐఏఎస్ కేడర్‌లో చేర్చారు. ఇదెలా సాధ్యం? అసలు ఎందుకిలా చేశారు.? ఎవరు చెప్పారు? ఎందుకు చేశారు? దీని వెనుక ఏం జరిగింది?'' అంటూ సీఎం రేవంత్ రెడ్డి సర్కారును తెలంగాణ హైకోర్టు ప్రశ్నించింది.;
''వారేమో ఐపీఎస్‌లు. మీరేమో (ప్రభుత్వం) వారిని ఐఏఎస్ కేడర్‌లో చేర్చారు. ఇదెలా సాధ్యం? అసలు ఎందుకిలా చేశారు.? ఎవరు చెప్పారు? ఎందుకు చేశారు? దీని వెనుక ఏం జరిగింది?'' అంటూ సీఎం రేవంత్ రెడ్డి సర్కారును తెలంగాణ హైకోర్టు ప్రశ్నించింది. అంతేకాదు.. అసలు ఒక ఐపీఎస్ ఉద్యోగానికి ఎంపికైన వ్యక్తి.. పోటీ పడి చదవి తిరిగి ఐఏఎస్‌కు ఎంపిక కావొచ్చని.. కానీ.. ప్రభుత్వమే నేరుగా వారిని ఐఏఎస్‌లుగా ఎలా ఎంపిక చేస్తుందని విస్మయం వ్యక్తం చేసింది. ఇలా అయితే.. దేశంలో ఐపీఎస్‌లు ఎవరూ ఉండరని.. అందరూ ఐఏఎస్‌లుగానే మిగులుతారని వ్యాఖ్యానించింది.
ఏం జరిగింది?
తెలంగాణలో ముగ్గురు ఐపీఎస్ అధికారులు.. సీవీ ఆనంద్, శిఖా గోయెల్, స్టీఫెన్ రవీంద్రలను ఈ ఏడాది సెప్టెంబరులో రాష్ట్ర ప్రభుత్వం `ఐఏఎస్` కేడర్‌లోకి చేర్చింది. దీంతో వారికి ఐఏఎస్‌లకు వస్తున్న వేతనాలు.. భత్యాలు, గౌరవ మర్యాదలు, ఇతర అధికారాలు, ప్రొటోకాల్ వర్తింప చేస్తారు. దీనికి సంబంధించి ప్రభుత్వం 1342 నెంబరుతో జీవోను కూడా జారీ చేసింది. అయితే.. దీనిపై అప్పటి నుంచి ఐఏఎస్ సంఘాలు అంతర్గతంగా చర్చ చేస్తున్నాయి. ఇలా చేయడాన్ని కొందరు సోషల్ మీడియా వేదికగా కూడా తప్పుబట్టారు. అయితే.. ఎవరూ బహిరంగ వ్యాఖ్యలు మాత్రం చేయలేదు.
ఈ క్రమంలో తాజాగా సామాజిక కార్యకర్త వడ్ల శ్రీకాంత్ హైకోర్టును ఆశ్రయించారు. ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఐపీ ఎస్‌లు ఎంపికైన వారి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇలా ఐఏఎస్ కేటగిరీకి ఎంపిక చేయడం రాజ్యాంగ విరుద్ధమని.. పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చట్టం ప్రకారం వ్యవహరించకుండా.. కొందరిని బుజ్జగించే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకుందని పిటిషన్‌లో పేర్కొ న్నారు. దీనిపై సోమవారం విచారణ జరిపిన హైకోర్టు.. సదరు ముగ్గురు ఐపీఎస్‌లను ఐఏఎస్‌లుగా ఎలా మార్పు చేస్తారంటూ.. నిలదీసింది.అసలు ఇలా చేయడం సాధ్యమేనా? అనేది తమకు వివరించాలని కోరింది. ఇలా ఎందుకు చేయాల్సి వచ్చిందని నిలదీసింది. దీనిపై ఈ నెల 10వ తేదీ లోగా తమకు వివరణ ఇవ్వాలని కోరుతూ.. రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.