చిత్తూరు కోర్టు సంచలన తీర్పు.. ఒకే కేసులో ఐదుగురికి ఉరి
చిత్తూరు మేయర్ దంపతుల హత్య కేసులో జిల్లా సెషన్స్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది.;
చిత్తూరు మేయర్ దంపతుల హత్య కేసులో జిల్లా సెషన్స్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. సరిగ్గా పదేళ్ల క్రితం జరిగిన జంట హత్యల కేసుపై శుక్రవారం తీర్పునిచ్చింది. 2015 నవంబరు 17న చిత్తూరు మేయర్ కఠారి అనురాధ, ఆమె భర్త మోహన్ హత్యకు గురయ్యారు. ఈ కేసులో మొత్తం 23 మందిని నిందితులుగా గుర్తించారు. విచారణ సమయంలో ఒకరు మరణించగా, మరొకరికి నేరంతో సంబంధం లేదని కోర్టు గతంలోనే కేసు నుంచి తప్పించింది. ఇక మిగిలిన 21 మంది నిందితుల్లో ఏ1 నుంచి ఏ5 వరకు మొత్తం ఐదుగురికి నేరంతో సంబంధం ఉందని భావించిన న్యాయస్థానం, ముద్దాయిలకు ఉరి శిక్ష విధిస్తూ తీర్పు నిచ్చింది. మిగిలిన 16 మందిని నిర్దోషులుగా విడుదల చేసింది.
మేయర్ దంపతుల హత్య కేసుపై చిత్తూరు ఆరో అదనపు జిల్లా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి ఎన్.శ్రీనివాసరావు సంచలన తీర్పునిచ్చారు. మేయర్ అనురాధ, ఆమె భర్త మోహన్ హత్యకు కారణంగా నిర్ధారిస్తూ ఏ1 శ్రీరామ్ చంద్రశేఖర్ అలియాస్ చింటుతోపాటు ముద్దాయిలు గోవిందస్వామి శ్రీనివాసయ్య వెంకటాచలపతి అలియాస్ వెంకటేశ్ (ఏ2), జయప్రకాష్ రెడ్డి అలియాస్ జయారెడ్డి (ఏ3), మంజునాథ్ అలియాస్ మంజు (ఏ4), మునిరత్నం వెంకటేష్ (ఏ5) తదితరులకు ఉరిశిక్ష ఖరారు చేశారు. వీరిలో ఏ1 చింటు హతులకు స్వయాన మేనల్లుడు కావడం గమనార్హం. మేనమామ మోహన్ తో రాజకీయ, ఆర్థిక, వ్యక్తిగత వివాదాలు ఉండటంతో మేనమామతోపాటు అత్తను అడ్డు తొలగించుకోవాలని భావించిన ముద్దాయి చింటు, తన స్నేహితులతో కలిసి వారిని అంతమొందించాలని పథకం వేశాడు.
టీడీపీ తరఫున చిత్తూరు మేయర్ గా ఎన్నికైన అనురాథను ఆమె కార్యాలయంలోనే మట్టు బెట్టాలని ప్లాన్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. బురఖాలు ధరించి తుపాకులు, కత్తులతో మేయర్ కార్యాలయానికి వచ్చిన ముద్దాయిలు ముందుగా తుపాకులతో మేయర్ అనురాధను హత్య చేశారు. అనంతరం మోహన్ పై కత్తులతో విరుచుకుపడ్డారు. వీరి దాడిలో తొలుత తీవ్రంగా గాయపడిన మోహన్ వేలూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అదే రోజు మరణించారు. దీంతో కేసు నమోదుచేసిన పోలీసులు చింటూతోపాటు ముద్దాయిలు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వీరికి ఆయుధాలు అందజేయడంతోపాటు నగదు సహాయం, ఆశ్రయం కల్పించిన మరో 21 మందిని గుర్తించి నిందితులుగా చేర్చారు. అయితే కేసు విచారణలో వారికి వ్యతిరేకంగా సరైన సాక్ష్యాధారాలు లభించకపోవడంతో కోర్టు వారిని నిర్దోషులుగా ప్రకటించింది.
ఇక మేయర్ దంపతుల హత్యకు తెగబడిన రోజున అక్కడే ఉణ్న వేలూరి సతీష్ కుమార్ నాయుడుని చంపేందుకు నిందితుడు మంజునాథ (ఏ4) ప్రయత్నించడంతో పోలీసులు హత్యాయత్నం కేసు కూడా నమోదుచేశారు. ఈ కేసులోనూ నేరం రుజువు కావడంతో శిక్ష విధించారు. సుమారు పదేళ్లుగా సాగిన కేసు విచారణలో సుమారు 352 వాయిదాలు పడ్డాయి. 130 మంది సాక్ష్యులను విచారించారు. ఏ3, ఏ4గా ఉన్న నిందితులు జయప్రకాష్ రెడ్డి, మంజునాథ పదేళ్లుగా జైలులోనే ఉన్నారు. శిక్ష ఖరారు కావడంతో దోషులకు వైద్య పరీక్షలు నిర్వహించి కడప జైలుకు తరలించనున్నారు.