సీజేపీ తరహాలో ఉద్యమానికి వైసీపీ రెడీ ?
దేశమంతా సీఈసీ కి వ్యతిరేకంగా ఉద్యమిస్తోంది. ఈ నేపథ్యంలో మొదట్లో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మద్దతుగా ఒక ట్వీట్ చేశారు.
దేశమంతా సీఈసీ కి వ్యతిరేకంగా ఉద్యమిస్తోంది. ఈ నేపథ్యంలో మొదట్లో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మద్దతుగా ఒక ట్వీట్ చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం పనితీరు పారదర్శకంగా ఉండాలని ఆయన ఆ లేఖలో కోరారు. అదే సమయంలో కేంద్ర ఎన్నికల సంఘం చట్టం 2023ని పునఃసమీక్షించాలని కూడా కోరారు. అయితే దీని మీద ఇండియా కూటమి నుంచి పెద్దగా సానుకూల స్పందన అయితే రాలేదని అంటున్నారు. పైగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఒకరు వైసీపీ స్టాండ్ ని కూడా ప్రశ్నించారు. ఎన్డీయే బిల్లులకు ఒక వైపు మద్దతు ఇస్తూ మరో వైపు ఇలా అంటే ఎలా అని ప్రశ్నించారు. ముందు ఎన్డీయేకి పరోక్ష మద్దతు మానుకోవాలని సూచించారు. దాంతో పాటు ఇండియా కూటమి పార్టీల నుంచి కూడా పెద్దగా రెస్పాన్స్ రాకపోవడంతో వైసీపీ ఆలోచనల్లో పడింది అని అంటున్నారు.
ఏపీ మీదనే ఫోకస్ :
అయితే 2024 ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని వైసీపీ మొదటి నుంచి ఆరోపిస్తూ వస్తోంది. అర్ధ రాత్రి మూడు వేల పోలింగ్ బూతులలో అత్యధికంగా ఓటింగ్ జరిగింది అని కూడా పేర్కొంటోంది. పన్నెండు లక్షలకు పైగా ఓట్లు ఆ సమయంలో పోల్ అయ్యాయని విమర్శిస్తోంది. ఇక పోలింగ్ అయిన ఓట్లకు కౌంటింగ్ అయిన ఓట్లకు మధ్య భారీ తేడా ఉంటోందని కూడా వైసీపీ చెబుతోంది. అందువల్ల ఏపీలో జరిగిన ఎన్నిక్లలో అక్రమాల మీద కూడా జాతీయ పార్టీలు మాట్లాడాలని వైసీపీ నేతలు అంటున్నారు. వారు స్పందించకపోతే తామే సొంతంగా ఉద్యమిస్తామని ఏపీకే పరిమితం అయ్యేలా తమ ఉద్యమ కార్యాచరణ ఉంటుందని చెబుతున్నారు.
ముహూర్తం ఎపుడు :
ప్రస్తుతం చూస్తే దేశ రాజకీయాల్లో ఓట్ల చోరీ సీఈసీ రాజీనామా సర్ ప్రక్రియలో అవకతవకలు అన్నది అతి పెద్ద రాజకీయ అజెండాగా ఉంది. ఏపీలో కూడా ఇదే సరైన సమయం అని వైసీపీ భావిస్తోంది. అయితే ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ త్వరలో విడుదల కాబోతోంది. దాంతో వైసీపీ ఎపుడు ఈ అంశం మీద ఉద్యమిస్తుంది అన్నది అయితే ఇప్పటికి అయితే ఏమీ తేలలేదని అంటున్నారు. ఈ విషయంలో ఏదో ఒకటి చేసి ఏపీలో జరిగిన అక్రమాలు పోలింగ్ లో చోటు చేసుకున్న అనేక అంశాల మీద ఉద్యమిస్తామని వైసీపీ నేతలు అంటున్నారని చెబుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల తరువాత ఈ ఉద్యమం ఉండొచ్చు అని అంటున్నారు.
ఆకర్హ్సించాలనేనా :
దేశవ్యాప్తంగా జరుగుతున్న విపక్ష ఉద్యమాన్ని నేతలను ఆకర్షించాలని వైసీపీ చూస్తోంది అని అంటున్నారు. ప్రత్యేకించి జెన్ జీల మీద సీజేపీ మీద కూడా ఫోకస్ పెట్టి తమ ఉద్యమాలని కొనసాగించాలని వైసీపీ చూస్తోంది అని అంటున్నారు. ఇక చూస్తే సినీ నటుడు ప్రకాష్ రాజ్ తొందరలోనే ఏపీలో 2024 ఎన్నికల్లో జరిగిన అక్రమాల మీద కూడా మీడియా సమావేశం పెట్టి మొత్తం వివరాలను బయటపెడతాను అని ప్రకటించారు. ఆ వివరాలు వచ్చిన తరువాత వైసీపీ యాక్షన్ ప్లాన్ ఉంటుందని అంటున్నారు. సీజేపీతో ప్రకాష్ రాజ్ టచ్ లో ఉండడంతో ఏపీ మీద సీజేపీ ఫోకస్ పెంచేలా ఏపీలోనూ భారీ ఉద్యమం నిర్మించేలా వైసీపీ చూస్తుంది అని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.