విజయవాడలో మావోయిస్టులు.. ఎలా దొరికిపోయారంటే..

మంగళవారం ఉదయాన్నే భారీగా పోలీసులు కానూరు తరలిరావడంతో స్థానికులు టెన్షన్ పడ్డారు.;

Update: 2025-11-18 10:21 GMT

విజయవాడ నగరంలో మావోయిస్టులు ఉన్నారన్న సమాచారం కలకలం రేపింది. నగరం నడిబొడ్డున కానూరు కొత్త ఆటోనగర్ లో ఓ భవనంలో సుమారు 27 మంది మావోయిస్టులు ఉన్నారనే సమాచారం అందగానే కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆధ్వర్యంలోని పోలీసులు అక్టోబస్, గ్రే హౌండ్స్ బలగాలు చుట్టుముట్టాయి. వీరంతా ఓ మహిళ నేతృత్వంలో కానూరులో తలదాచుకున్నట్లు చెబుతున్నారు. మారేడుమిల్లి ఎన్‌కౌంటర్‌లో లభ్యమైన డెయిరీలో ఉన్న సమాచారంతో పోలీసులు వెనువెంటనే అప్రమత్తమై కానూరులో భవనాన్ని గుర్తించారు.

మంగళవారం ఉదయాన్నే భారీగా పోలీసులు కానూరు తరలిరావడంతో స్థానికులు టెన్షన్ పడ్డారు. ఎప్పుడూ లేనట్లు వందల మంది పోలీసులు తనిఖీలకు రావడంతో ఏం జరుగుతుందో తెలియక ఆందోళన చెందారు. ఈ క్రమంలోనే ఒక భవనంలో అనుమానాస్పదంగా ఉన్న 27 మందిని గుర్తించారు. వీరిలో 21 మంది మహిళలే కాగా, 6 పురుషులు ఉన్నారు. వీరంతా చత్తీస్ ఘడ్ నుంచి షెల్టర్ కోసం విజయవాడ వచ్చినట్లు భావిస్తున్నారు.

ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్ర ప్రభుత్వం తీవ్ర నిర్బంధాన్ని కొనసాగిస్తుండటంతో మావోయిస్టులు అడవులను వదిలేసి షెల్టర్ల జోన్లలో తలదాచుకుంటున్నారు. అయితే ఇలా వచ్చిన వారు విజయవాడను ఎంచుకోవడంపైనే ఆందోళన వ్యక్తమవుతోంది. రాజధాని అమరావతి పక్కనే ఉన్న విజయవాడలో వీవీఐపీ మూమెంట్ ఎక్కువగా ఉంటుంది. నిత్యం పోలీసు నిఘా కొనసాగుతుంది. అలాంటి చోట మావోయిస్టులు తలదాచుకోవడమే చర్చనీయాంశంగా మారింది.

మారేడుమిల్లి ఎన్ కౌంటరుతో మావోయిస్టులు ఏపీలోకి ప్రవేశించినట్లు పోలీసులు గుర్తించారు. గత కొన్నేళ్లుగా రాష్ట్రంలో మావోయిస్టుల జాడ లేదు. పోలీసులు కూడా మావోయిస్టులు అలికిడి ఉన్నట్లు ఎప్పుడూ చెప్పలేదు. కానీ, దండకారణ్యంలో నిర్బంధం పెరిగిపోవడంతో మావోయిస్టులు ఏపీకి రావడం ఆందోళనకు గురిచేస్తోంది. మారేడుమిల్లిలో అగ్రనేత మద్వి హిడ్మా మరణించగా, ఎదురుకాల్పుల జరగిన చోట లభ్యమైన సమాచారంతో విజయవాడలో షెల్టర్ లో ఉన్న వారి సమాచారం లభ్యమైంది. దీంతో రాష్ట్రంలో మావోయిస్టులు ఇంకెక్కడైనా తలదాచుకున్నారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News