ఎంత కాలం బ‌తుకుతానో..? ఐనా టారిఫ్ ల‌పై నాతో గేమ్స్ వ‌ద్దు: ట్రంప్

తెంప‌రి చేష్ట‌లే కాదు.. తుంట‌రి మాట‌ల‌తో ప్ర‌పంచాన్ని చికాకు ప‌రుస్తుంటారు అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్..! ఎప్పుడు ఏ నిర్ణ‌యం తీసుకుంటారో ఎవ‌రికీ తెలియ‌దు.;

Update: 2026-02-24 06:15 GMT

తెంప‌రి చేష్ట‌లే కాదు.. తుంట‌రి మాట‌ల‌తో ప్ర‌పంచాన్ని చికాకు ప‌రుస్తుంటారు అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్..! ఎప్పుడు ఏ నిర్ణ‌యం తీసుకుంటారో ఎవ‌రికీ తెలియ‌దు. ఎందుకు ఎవ‌రిని నిందిస్తారో కూడా చెప్ప‌లేం..! ఆల‌య‌న అస‌లు అమెరికా అధ్య‌క్షుడి స్థాయిలో ప్ర‌వ‌ర్తించ‌డం లేదు అనేది చాలామంది విశ్లేష‌కుల మాట‌. స‌హ‌జంగా అగ్ర‌రాజ్య అధినేత‌లు చాలా గుంభ‌నంగా ఉంటారు. ఇంకా చెప్పాలంటే హుందాగా ప్ర‌వ‌ర్తిస్తారు. ప‌నితీరు లోపంతో గ‌త ట‌ర్మ్ లో అధ్య‌క్షుడిగా తీవ్ర అవ‌హేళ‌న‌లు ఎదుర్కొన్న జో బైడెన్ కూడా ఇప్ప‌డు ట్రంప్ అంత‌గా విమ‌ర్శ‌ల పాల‌వ‌లేదు. ప్ర‌పంచ దేశాల‌పై టారిఫ్ లు, యుద్ధాలు, దాడుల‌కు స‌న్నాహాలు, వెనెజువెలా అధ్య‌క్షుడు మ‌దురో కిడ్నాప్ ఇలా ఎన్నో విష‌యాల్లో ట్రంప్ పేరు చ‌ర్చ‌నీయం అయింది. ఇలాంటి స‌మ‌యంలోనే గ‌త శ‌నివారం ఆయ‌న‌కు చెందిన ఫ్లోరిడా బంగ్లాలోకి ఓ ఆగంత‌కుడు ప్ర‌వేశించాల‌ని చూడ‌డం.. అత‌డి చేతిలో తుపాకీ ఆయుధంతో పాటు గ్యాస్ (ఇంధ‌నం) క్యాన్ ఉండ‌డం క‌ల‌క‌లం రేపింది. లొంగిపోవాల‌ని ఎంత కోరినా అత‌డు విన‌క‌పోవ‌డంతో చివ‌ర‌కు సాయుధ ద‌ళాలు కాల్చి చంపాయి. ఈ నేప‌థ్యంలోనే ట్రంప్ స్పందించారు.

అప్ప‌ట్లో రెండుసార్లు..

2024లో ఎన్నిక‌ల ప్రచారం సంద‌ర్భంగా ట్రంప్ పై రెండుసార్లు హ‌త్యాయ‌త్నాలు జ‌రిగాయి. జూలైలో పెన్సిల్వేనియా ర్యాలీలో మాట్లాడుతుండ‌గా.. ట్రంప్ 20 ఏళ్ల థామ‌స్ క్రూక్స్ అనే యువ‌కుడు కాల్పులు జ‌ర‌ప‌గా.. తూటా ట్రంప్ కుడిచెవిని తాకుతూ వెళ్లింది. దీంతో ర‌క్తం కారింది. ఆ ఫొటోతోనే ట్రంప్ మ‌రింత ప్ర‌చారం పొందారు. క్రూక్స్ ను భ‌ద్ర‌తా ద‌ళాలు కాల్చి చంపాయి. అదే ఏడాది సెప్టెంబ‌రులో ఫ్లోరిడాలోని వెస్ట్ పామ్ బీచ్ గోల్ఫ్ ఆడుతున్న ట్రంప్ పై మ‌ళ్లీ హ‌త్యాయ‌త్నం ప్ర‌య‌త్నం జ‌రిగింది. దుండ‌గుడిని పోలీసులు ముందుగానే అదుపులోకి తీసుకున్నారు. వీట‌న్నిటి రీత్యా.. తాజాగా ట్రంప్ మాట్లాడుతూ తాను ఎంత‌కాలం ఉంటానో (బ‌తుకుతానో) తెలియ‌ద‌ని నిర్వేదం వ్య‌క్తం చేశారు. త‌న హ‌త్య‌కు చాలా మంది ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ని అన్నారు. అంతేగాక, వీరంతా అసాధార‌ణ విజ‌యాలు సాధించే అధ్య‌క్షుల జోలికే వెళ్తార‌ని... అబ్ర‌హం లింక‌న్, జాన్ ఎఫ్ కెన్న‌డీల‌ను ఉదాహ‌ర‌ణ‌గా పేర్కొన్నారు.

ఏం చేసినా.. వెన‌క్కు త‌గ్గ‌ను...

త‌న‌పై ఎన్ని కుట్ర‌లు జ‌రిగినా తాను వెన‌క్కు త‌గ్గేది లేదని ట్రంప్ కుండ‌బ‌ద్ద‌లు కొట్టారు. త‌న నిర్ణ‌యాల‌ను ఏమాత్రం ప్ర‌భావితం చేయ‌బోర‌ని స్ప‌ష్టం చేశారు. అంతేకాదు.. టారిఫ్ ల విష‌యంలో త‌న‌తో గేమ్స్ వ‌ద్దంటూ ప్ర‌పంచ దేశాల‌ను హెచ్చ‌రించారు. అమెరికా సుప్రీం కోర్టు తీర్పును అలుసుగా తీసుకుని ఏ దేశం కూడా తోక జాడించ‌వ‌ద్దంటూ అల్టిమేటం జారీ చేశారు. త‌మ దేశాన్ని ద‌శాబ్దాలుగా పీడించిన దేశాల‌పై గ‌తంలో కంటే ఎక్కువ టారిఫ్ లు వేస్తామ‌ని హెచ్చ‌రించారు. జాగ్ర‌త్త అంటూ బెదిరించారు.

Tags:    

Similar News