పాకిస్థాన్, ఉక్రెయిన్, అమెరికా... మధ్యలో ట్రంప్ కి నోబెల్!

అవును... నోబెల్‌ శాంతి బహుమతి పొందాలన్న ట్రంప్‌ ఆకాంక్ష రోజురోజుకు తీవ్రమవుతోన్నట్లు అనిపిస్తోంది.;

Update: 2025-06-25 10:39 GMT

నిజంగా పాకిస్థానే ప్రతిపాదించిందో.. లేక, ట్రంప్ అటువైపు నుంచి పని మొదలుపెట్టారో తెలియదు కానీ... 2026 నోబెల్ శాంతి బహుమతికి ట్రంప్ పేరు ప్రతిపాదన అంశం తెరపైకి వచ్చినప్పటినుంచీ.. ఆ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు చాలా సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. అమెరికాలో తాజాగా జరిగిన ఓ పరిణామం ఈ విషయానికి బలం చేకూరుస్తోంది.

అవును... నోబెల్‌ శాంతి బహుమతి పొందాలన్న ట్రంప్‌ ఆకాంక్ష రోజురోజుకు తీవ్రమవుతోన్నట్లు అనిపిస్తోంది. అసలు ఉన్నపలంగా ఆయన మస్తిష్కంలో ఆ ఆలోచన ఎందుకు పురుడుపోసుకుందో తెలియకుంది అని అంటున్నారు. ఈ క్రమంలో పాక్ నుంచో, ఉక్రెయిన్ నుంచో కాకుండా ఈ సారి నేరుగా ఆయన పేరును అమెరికా నుంచే అధికారికంగా నామినేట్‌ చేశారు.

ఇందులో భాగంగా.. అమెరికా ప్రతినిధుల సభ సభ్యుడు బడ్డీ కార్టర్‌ ఈ మేరకు నార్వేలోని నోబెల్‌ కమిటీకి ఓ లేఖను పంపించారు. ఈ లేఖలో... అసాధ్యమనుకొన్న సంక్షోభాల్లో కూడా వేగంగా ఒప్పందాలు చేయించడంలో ట్రంప్‌ కీలక పాత్ర పోషించారని.. ఇజ్రాయెల్ - ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదర్చడంలోనూ తాజాగా చరిత్రాత్మక పాత్ర పోషించారని ఆయన పెర్కొన్నారు.

ఇదే సమయంలో... వీటితో పాటు ప్రపంచంలోనే ఉగ్రవాదులను పోషించే అతిపెద్ద దేశానికి అత్యంత వినాశకర ఆయుధం అందకుండా చేశారని.. ఆయన నాయకత్వాన్ని నోబెల్‌ ప్రైజ్‌ తో గుర్తించాలని కోరారు. దీంతో... నోబెల్ శాంతి బహుమతి విషయంలో డొనాల్డ్ ట్రంప్ ఎంత సీరియస్ గా ఉన్నారో అర్ధమవుతుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

వాస్తవానికి ట్రంప్‌ పేరును నోబెల్ కు ప్రతిపాదించడం ఇదే ఫస్ట్ టైం కాదు. పాకిస్థాన్ కంటే ముందు ఉక్రెయిన్‌ కు చెందిన చట్టసభ సభ్యుడు ఒలెక్సాండర్‌ మెరెఝాకో.. ట్రంప్ పేరు నోబెల్‌ కు ప్రతిపాదించారు. కానీ, రష్యా - ఉక్రెయిన్‌ యుద్ధాన్ని ఆపడంలో విఫలం కావడంతో తాజాగా ఆ నామినేషన్‌ ను ఉపసంహరించుకొంటున్నట్లు ప్రకటించారు.

మరోవైపు ఇటీవల ట్రంప్‌ పేరును పాకిస్థాన్‌ ప్రభుత్వం నోబెల్‌ ప్రైజ్‌ కు నామినేట్‌ చేసింది. ఆ మర్నాడే ఆయన ఇరాన్‌ పై బంకర్‌ బస్టర్‌ బాంబులతో దాడులు చేయించడం గమనార్హం. ఈ పరిణామాలతో ఒక్కసారిగా పాక్‌ షాక్‌ కు గురైంది. మరోవైపు పాక్‌ ప్రతిపక్షాలు ఆ ప్రభుత్వాన్ని తప్పుపట్టాయి. ఆ ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశాయి.

ఈ పరిణామాల నేపథ్యంలో... అమెరికా ప్రతినిధుల సభ సభ్యుడు బడ్డీ కార్టర్‌ ఈ మేరకు నేరుగా నార్వేలోని నోబెల్‌ కమిటీకి లేఖను పంపించారు. ట్రంప్ ను నోబెల్ తో సత్కరించాలని కోరారు. దీంతో... నోబెల్ ప్రైజ్ విషయంలో ట్రంప్ ఎంత సీరియస్ గా ఉన్నారో తెలుస్తోందని అంటున్నారు నెటిజన్లు!

Tags:    

Similar News