డేంజర్ జోన్ లోకి ట్రంప్ తీరు.. నోబెల్ ఇవ్వలేదు కాబట్టి శాంతి వద్దా?
పురస్కారాలు.. సన్మానాలు అన్నవి అడుక్కొని తెచ్చుకునేవి కావు. వాటంతట అవే రావాలి.;
పురస్కారాలు.. సన్మానాలు అన్నవి అడుక్కొని తెచ్చుకునేవి కావు. వాటంతట అవే రావాలి. ఈ తీరుకు పూర్తి భిన్నంగా వ్యవహరిస్తూ ప్రపంచాన్ని ఆగమాగం చేస్తున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. నోబెల్ శాంతి పురస్కారం మీద ఆయనకున్న మోజు అంతా ఇంతా కాదు. అమెరికా అధ్యక్ష స్థానంలో ఉండి.. ఎవరేం అనుకుంటారన్న అంశాన్ని పట్టించుకోకుండా నోబెల్ శాంతి పురస్కారం తనకు దక్కాలంటూ ఆయన ఓపెన్ గానే చెప్పేసుకున్నారు. తాను ఎనిమిదికి పైగా యుద్ధాల్ని ఆపానని.. అలాంటప్పుడు తనకు మించి నోబెల్ శాంతి బహుమతికి అర్హులు ఎవరుంటారు? అంటూ అతను వినిపించే వాదన వింటే.. విస్మయానికి గురి కావాల్సిందే.
ప్రపంచంలో మరే దేశాధ్యక్షుడు.. అందునా అమెరికా అధ్యక్షస్థానంలో ఉన్న ప్రముఖుడు.. ఇలా నోబెల్ శాంతి పురస్కారం కోసం ఇంతలా వెంపర్లాడటం కనిపించదు. ఇదిలా ఉంటే.. తాజాగా ఆయనకు సంబంధించిన మరో సంచలన అంశం వెలుగు చూసింది. గ్రీన్ లాండ్ మీద కన్నేసిన ట్రంప్.. ఆ దేశాన్ని ఎలాగైనా అమెరికాలో కలిపేసుకోవాలనన ఆలోచనలో ఉన్న సంగతి తెలిసిందే.
దీనికి సంబంధించి గడిచిన కొద్ది రోజులుగా చోటు చేసుకుంటున్న పరిణామాలెన్నో. ఈ నేపథ్యంలో యూరోపియన్ యూనియన్ లో కొత్త ఉద్రిక్తలకు తెర తీసినట్లైంది. ఇలాంటి వేళ.. నార్వే ప్రధానమంత్రి జొనాస్ గహ్ర్ స్టోర్ ఒక సంచలన అంశాన్ని బయటపెట్టారు. నోబెల్ శాంతి పురస్కారాన్ని.. గ్రీన్ లాండ్ తో ముడిపెడుతూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తనకు పంపిన సందేశాన్ని ఆయన బయటపెట్టారు.
దాని సారాంశం.. ‘నోబెల్ బహుమతి నాకు లభించలేదు కాబట్టి.. శాంతి గురించి మాత్రం మాట్లాడాల్సిన బాధ్యత ఎంతమాత్రం నాకు లేదు. ఎనిమిదికి పైగా యుద్దాలను ఆపినందుకు నాకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వకూడదని మీ దేశం నిర్ణయించింది. అందుకే ఇకపై శాంతి గురించి మాత్రమే ఆలోచించాల్సిన బాధ్యత నాకు ఉందని అనుకోవటం లేదు. శాంతికి ఎప్పుడూ ప్రాధాన్యత ఉంటుంది. ఇప్పుడు అమెరికాకు ఏది మంచిది.. ఏది సరైనది అనే దానిపైనే నేనిప్పుడు ఆలోచిస్తా. గ్రీన్ లాండ్ పై మాకు పూర్తి సమగ్ర నియంత్రణ ఉంటే తప్పించి ఈ ప్రపంచం సురక్షితంగా ఉండదు’ అంటూ ఆయనకు పెట్టిన సందేశం ఇప్పుడు సంచలనంగా మారింది.
నోబెల్ శాంతి బహుమతి ఎంపిక బాధ్యత నార్వే ప్రభుత్వం చేతిలో ఉండదని.. నోబెల్ కమిటీ ఒక స్వతంత్ర విభాగమన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ కమిటీలోని ఐదుగురు సభ్యులను నార్వే పార్లమెంట్ నియమిస్తుందే తప్పించి.. ఇంకే విషయంలోనూ తమ జోక్యం ఉండదని స్పష్టం చేశారు. ట్రంప్ చెప్పినట్లుగా.. నోబెల్ శాంతి పురస్కారం రాలేదు కాబట్టి బాధ్యత లేదన్న ఆయన.. ఒకవేళ వచ్చి ఉంటే.. అప్పుడు అమెరికా ప్రయోజనాలు పట్టవా? అన్నది ప్రశ్న. ఒక అంశంపై ఆసక్తి.. మోజు ఉండటం తప్పు కాదు. కానీ.. ఆ పేరుతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే మొదటికే మోసం వస్తుందన్న విషయాన్ని ట్రంప్ మిస్ అయినట్లుగా కనిపిస్తోంది. ఈ తరహా పోకడలు అత్యంత ప్రమాదకరంగా చెప్పక తప్పదు. ఇలాంటి తీరుపై అమెరికన్లు తమ స్పందనను ప్రపంచానికి తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.