టీఎంసీలో తిరుగుబాటు.. మమతకు షాక్ ఇచ్చిన ఎమ్మెల్యేలు!

పశ్చిమబెంగాల్ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందిన మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి

Update: 2026-06-03 15:06 GMT

పశ్చిమబెంగాల్ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందిన మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఎన్నికల్లో స్వయంగా ఓడిపోయిన మమత చేతి నుంచి పార్టీ జారిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. దీనికి తాజాగా 59 మంది ఎమ్మెల్యేలు తీసుకున్న నిర్ణయమే ఉదాహరణగా చెబుతున్నారు. పార్టీ శాసనసభాపక్ష నేతగా మమత సూచించిన నేతను కాదని ఎమ్మెల్యేలు వేరొకరిని ఎన్నుకున్నారు.

టీఎంసీకి మొత్తం 80 మంది ఎమ్మెల్యేలు ఉండగా, సుమారు 59 మంది వేరుకుంపటి పెట్టుకునే పరిస్థితి కనిపిస్తోందని అంటున్నారు. అయితే ప్రస్తుతానికి ధిక్కారస్వరం వినిపిస్తున్న ఎమ్మెల్యేలు తమ నాయకురాలిగా మమతా బెనర్జీనే ఉంటారని చెబుతుండటం గమనార్హం. కానీ, మమత సూచించిన వ్యక్తిని శాసనసభా పక్ష నేతగా ఎన్నుకునేందుకు వారంతా ససేమిరా అంటున్నారు. కీలకమైన ప్రతిపక్ష నేత పదవికి మమత సూచించిన శోభన్ దేవ్ ఛటోపాధ్యాయ్ బదులుగా రితబ్రత బెనర్జీని ఎన్నుకున్నారు. ఎమ్మెల్యేలు తీసుకున్న ఈ నిర్ణయం బెంగాల్ లో తీవ్ర రాజకీయ సంచలనంగా మారిందని అంటున్నారు.

అసెంబ్లీ ఎన్నికల తర్వాత పశ్చిమబెంగాల్ లో ప్రతిపక్ష టీఎంసీ రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయని అంటున్నారు. ఎన్నికల అనంతరం చెలరేగిన హింసపై నిరసన కార్యక్రమాలు చేపట్టాలని టీఎంసీ అధినేత్రి మమత స్వయంగా పిలుపునిచ్చినా, 50 మంది ఎమ్మెల్యేలు డుమ్మాకొట్టడంతోనే పార్టీలో ఏదో జరుగుతోందన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీనికి కొనసాగింపుగా ఇప్పుడు మమత తీసుకున్ననిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ 59 మంది ఎమ్మెల్యేలు శాసనసభపక్ష నేతను ఎన్నుకోవడం సంచలనంగా మారింది.

అయితే బెంగాల్ లో చోటుచేసుకుంటున్న ఈ పరిణామాల వెనుక అదృశ్య శక్తుల హస్తం ఉందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆ అదృశ్య శక్తులు ఢిల్లీ పెద్దలేనా? అనే అనుమానాలను కూడా వ్యక్తం చేస్తున్నారు. బెంగాల్ కన్నా ముందు మహారాష్ట్రలో బలమైన పార్టీలుగా ఉన్న శివసేన, ఎన్సీపీ నిట్టనిలువునా చీలిపోయాయి. బీజేపీతో స్నేహం కోసం ఆ పార్టీలో వర్గాలను ప్రోత్సహించడంతో ఆ రెండు పార్టీల అధినేతలు కోలుకోలేని దెబ్బ తిన్నారని పరిశీలకులు గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు అదే వ్యూహాన్ని బెంగాల్ లో అమలు చేస్తున్నట్లు ఉందని అంటున్నారు. మొత్తానికి మునుముందు ఇంకా నాటకీయ పరిణామాలు చోటుచేసుకునే అవకాశాలు ఉన్నాయని వ్యాఖ్యానిస్తున్నారు.

Tags:    

Similar News