ఏ దేశాన్ని చూసినా అధినేతలుగా మనోళ్లు.. కొత్త సీన్!
వివిధ రంగాల్లో ఇప్పటికే భారతీయులు.. భారత మూలాలు ఉన్న వారు తమ సత్తాను చాటటం.. కీలక భూమిక పోషించటం తెలిసిందే.
విశ్వ గురుగా పేరున్న భారత్.. ఆ పేరును సార్థకత చేసుకుంటోంది. వివిధ రంగాల్లో ఇప్పటికే భారతీయులు.. భారత మూలాలు ఉన్న వారు తమ సత్తాను చాటటం.. కీలక భూమిక పోషించటం తెలిసిందే. మిగిలిన రంగాల సంగతి ఎలా ఉన్నా.. కష్టమైన.. క్లిష్టమైన రాజకీయ రంగంలోనూ భారత మూలాలు ఉన్న నేతలు.. తాము ప్రాతినిధ్యం వహించే దేశాల్లో సత్తా చాటటమేకాదు.. దేశాధ్యక్షులుగా తమ ముద్రను వేస్తున్న వైనం అంతకంతకూ విస్తరిస్తోంది. తాజాగా సింగపూర్ అధ్యక్షుడిగా ఎన్నికైన థర్మన్ షణ్ముగరత్నం.. భారత మూలాలు ఉన్న వారెంతటి ప్రభావాన్ని చూపుతారన్నది మరోసారి నిరూపించారని చెప్పాలి.
66ఏళ్ల షణ్ముగం తాజాగా జరిగిన ఎన్నికల్లో 70.4 శాతం ఓట్లతో సింగపూర్ అధ్యక్షుడిగా ఎన్నిక కావటం విశేషంగా చెప్పక తప్పదు.అంతటి భారీ అధిక్యతతో అధ్యక్ష స్థానాన్ని సొంతం చేసుకోవటం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఆసక్తికరమైన విషయం ఏమంటే 2020 నుంచి సింగపూర్ ప్రతిపక్ష నేతగా వ్యవహరిస్తున్న ప్రీతమ్ సింగ్ సైతం భారత మూలాలున్న వ్యక్తే కావటం గమనార్హం. ఆయన న్యాయవాది.. రచయిత కూడా.
భారత్ మూలాలున్న వారు ప్రపంచానికి పెద్దన్న అమెరికా మొదలు కొని పలు దేశాల రాజకీయాల్లో కీలక భూమిక పోషిస్తున్నారు. తాజాగా అమెరికా అధ్యక్ష పీఠం కోసం ఎన్నికల రేసులోకి వచ్చిన వివేక్ రామస్వామి సైతం భారత మూలాలున్న వ్యక్తే. ఇక.. ప్రస్తుతం అమెరికాఉపాధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్న కమలా హారిస్ సైతం భారత మూలాలున్న వ్యక్తే అన్న విషయాన్ని మర్చిపోకూడదు. వివేక్ తల్లిదండ్రులు కేరళ నుంచి వెళ్లి అమెరికాలో స్థిరపడగా.. కమలా తల్లిదండ్రులది తమిళనాడు కావటం తెలిసిందే.
ఆసక్తికరమైన మరో అంశం ఏమంటే.. ఇప్పుడు వివేక్ రామస్వామికి పోటీగా ఉన్న నిక్కీ హేలీ సైతం భారత సంతతికి చెందిన నేతే కావటం చూస్తే.. అమెరికా రాజకీయాల్లో మనోళ్లు ఎంతటి కీలక పాత్ర పోషిస్తున్నారో అర్థమవుతుంది. 2021లో తయారు చేసిన ఒక పత్రం ప్రకారం చూస్తే.. ప్రపంచ వ్యాప్తంగా 15 దేశాల్లో భారత సంతతి నేతలు..200 మందికి పైగా నేతలు ఉన్నతపదవుల్లో ఉన్నారు.వీరిలో 60కు పైగా కేబినెట్ మంత్రులుగా వ్యవహరిస్తున్నారు.
అమెరికా పార్లమెంటులో భారత మూలాలున్న నేతలకు కొదవ లేదు. రాజా క్రిష్ణమూర్తి.. రోఖన్నా.. ప్రమీలా జయపాల్.. అమీ బెరా.. తానేదార్ లు ఇటీవల జరిగిన మధ్యంతర ఎన్నికల్లో అమెరికా ప్రతినిధుల సభకు ఎన్నికయ్యారు. ఒకప్పుడు రవి ఆస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యమైన నేటి బ్రిటన్ కు ప్రధానిగా వ్యవహరిస్తున్నదిభారత మూలాలున్న రిషి సునాక్. వందల ఏళ్ల పాటు భారత్ ను బానిస బతుకుల్లో ముంచేసి.. మన సంపద మొత్తాన్నిబ్రిటన్ కు ఎత్తుకెళ్లిపోయిన బ్రిటీష్ ప్రభుత్వానికి అధినేతగా భారత మూలాలున్న వ్యక్తే కావటం ఆసక్తికర అంశంగా చెప్పాలి.
రిషి కేబినెట్ లో మంత్రులుగా చేస్తున్న బ్రవర్మన్.. క్లైరీ కౌటిన్హో లు సైతం భారత మూలాలు ఉన్నవారే. రిషి సునాక్ పేరు కారణంగా ఆయన భారత మూలాలున్న వ్యక్తిగా గుర్తిస్తారు కానీ.. మిగిలిన ఇద్దరు సభ్యుల పేర్లు భారతీయతకు భిన్నంగా ఉండటంతో వారిని భారత మూలాలున్న నేతలుగా పెద్దగా గుర్తింపు లభించలేదు. ఇక.. ప్రపంచానికి పెద్దగా తెలీకుండా భారత మూలాలున్న ఇద్దరు నేతలు రెండు దేశాలకు ప్రధానలుగా వ్యవహరిస్తున్నారు.
వారిలో ఒకరు ఐర్లాండ్ ప్రధాని లియో ఎరిక్ వరాద్కర్. మరొకరు పోర్చుగల్ ప్రధాని ఆంటోనియా కోస్టా. వరాద్కర్ తండ్రి ముంబయిలో పుట్టి.. అనంతరం బ్రిటన్ కు వెళ్లిపోయారు. అక్కడే స్థిరపడ్డారు. 2015 నుంచి పోర్చుగల్ ప్రధానిగా కొనసాగున్న ఆంటోనియో కోస్టా కూడా భారత్ మూలాలున్న నేతే. కరేబియన్ దీవుల్లో ట్రినిడాడ్ అండ్ టొబాగో అధ్యక్షుడిగా ఉన్న ఎలెక్ట్ క్రిస్టిన్ కార్లా కంగాలు కూడా ఇండోట్రినినాడ్ కుటుంబ మూలాల నుంచి వచ్చిన వారే.
2017 నుంచి మారిషస్ ప్రధానిగా వ్యవహరిస్తున్నప్రవింద్ జగన్నాథ్ కూడా భారత మూలాలున్న వ్యక్తే. ఆయన తాత ముత్తాతలు ఉత్తరప్రదేశ్ నుంచి ఆ దేశానికి వలస వెళ్లారు. సురినామ్ అధ్యక్షుడు చంద్రిక ప్రసాద్ సంతోఖి.. గయానా అధ్యక్షుడు మహమ్మద్ ఇర్ఫాన్ అలీ.. సీషెల్స్ అధ్యక్షుడు వావెల్ రామకల్వాన్.. మరిషస్ అధ్యక్షుడు ప్రథ్వీరాజ్ సింగ్ రూపన్ లు భారత సంతతికి చెందిన వారు. వీరే కాక.. కెనడా , ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లో అనేమంది భారత మూలాలున్న వారు మంత్రులుగా వ్యవహరిస్తున్నారు.