కోతుల మంత్రిత్వ శాఖ...ఎంపీ గారు చెప్పింది కరెక్టే !
దేశంలో ఎన్నో మంత్రిత్వ శాఖలు ఉన్నాయి. అవసరం అనుకుంటే కొత్తగా మరిన్ని శాఖలను సృష్టించడానికి కూడా పాలకులు సుముఖంగా ఉన్నారు.;
దేశంలో ఎన్నో మంత్రిత్వ శాఖలు ఉన్నాయి. అవసరం అనుకుంటే కొత్తగా మరిన్ని శాఖలను సృష్టించడానికి కూడా పాలకులు సుముఖంగా ఉన్నారు. ఇవన్నీ కూడా పాలన సజావుగా సాగడానికి ఆయా శాఖల ద్వారా సంబంధిత వర్గాలకు న్యాయం చేయడానికి ఉద్దేశించబడినవి. అయితే అధికార బీజేపీకి చెందిన ఒక ఎంపీ తెలంగాణాకు చెందిన నాయకుడికి ఒక డౌటనుమానం అయితే వచ్చింది. కోతులు ఏ మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తాయి అని. ఆయన సందేహం నివృత్తి చేయాల్సిందే. ఎందుకంటే కోతి బాధలు కోతివి మాత్రమే కావు, మనుషులవి కూడా. అందుకే అత్యున్నత చట్టసభ అయిన లోక్ సభలో తెలంగాణాకు చెందిన బీజేపీ ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి ఈ ప్రశ్నను సంధించారు.
రైతులకు అపార నష్టం :
తెలంగాణా రాష్ట్రంలో కోతుల సమస్య అధికంగా ఉందని విశ్వేశ్వర్ రెడ్డి లోక్ సభ దృష్టికి తెచ్చారు. వాటి బెడదతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు అని ఆయన సభలో ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఇంత పెద్ద సమస్య ఉంటే తమ శాఖ పరిధిలోకి రాదని అంతా అంటున్నారు అని ఆయన సభలో ప్రస్తావించడం విశేషం. నిజానికి కోతుల సమస్య ఏంటి అని చిన్న విషయంగా తీసుకుంటారు, సరదాగా నవ్వుతారు కానీ కోతుల సమస్య అన్నది దేశంలోని అన్ని రాష్ట్రాలలో ఉన్న అతి పెద్ద సమస్య అని ఎంపీ కేంద్రం దృష్టిలో పెట్టారు.
ఎన్నికల అజెండాగా :
ఇక కోతుల సమస్య కేవలం బాధ కాదు, ఎన్నికల అజెండాగా ఒక కీలకమైన హామీగా కూడా మారిందని విశ్వేశ్వర్ రెడ్డి సభలో ప్రస్తావించారు. కోతుల సమస్యను పరిష్కరిస్తేనే సర్పంచ్ ఎన్నికల్లో గెలిపిస్తామని ప్రజలు చెప్పేంతవరకూ ఈ సమస్య వెళ్ళిందని ఆయన అన్నారు. ఇంతకీ కోతులు ఏ శాఖ పరిధిలోకి వస్తాయో వివరించాలని ఎంపీ కేంద్రాన్ని ఈ సందర్భంగా కోరడం గమనార్హం.
కోతి నుంచే కదా :
ఇక ఒక్కసారి మానవ పరిణామ క్రమం గురించి చర్చించుకుంటే కోతి నుంచే కదా మానవుడు పుట్టాడు అని చెప్పుకోవచ్చు. ఆ విధంగా చూస్తే కోతుల సమస్య కూడా అతి కీలకంగా మానవ సమస్యలను పరిష్కరించిన తరహాలోనే ఫోకస్ పెట్టి పరిష్కరించాల్సి ఉందని అంటున్నారు. అంతే కాదు వ్యవసాయ శాఖ కూడా తమ పరిధిలోకి తీసుకున్నా తప్పు లేదని అంటున్నారు. అయితే పంటలకు కేవలం కోతుల నుంచే బెడద లేదు అన్ని రకాల కీటకాలు జంతువుల నుంచి ఉంది కాబట్టి ఆ శాఖ కాదు అనుకునంటే పశు సంవర్ధక శాఖనో లేక జంతు సంరక్షక శాఖనో ఈ ఇష్యూని చూడాల్సి ఉంది. లేదా కోతి మనిషికి పూర్వ రూపం అనుకుంటే కనుక దానికి విశేష ప్రాధాన్యత ఇచ్చి ప్రత్యేకంగా కోతుల మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసినా చేయవచ్చు అన్న సూచనలూ వినిపిస్తున్నాయి. సో ఎంపీ గారు లేవనెత్తిన ఇష్యూ మాత్రం చాలా సీరియస్ గానే చూడాలని అంటున్నారు. ఇంతకీ కేంద్ర పెద్దలు దీని మీద ఎలా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది.