మేధావుల మాట: రాహుల్ ఇలా కాదు.. అలా చేస్తే బెటర్
దేశవ్యాప్తంగా `స్వతంత్ర క్రాంతి` పేరుతో కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ ఉద్యమించేందుకు రెడీ అయ్యారు.;
దేశవ్యాప్తంగా `స్వతంత్ర క్రాంతి` పేరుతో కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ ఉద్యమించేందుకు రెడీ అయ్యారు. ఎన్నికల సంఘం-బీజేపీతో కుమ్మక్కయిందని, ఓట్లను తారుమారుచేసి బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తోందని ఆయన ఆరోపిస్తున్నారు. అంతేకాదు.. మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక సహా పలురాష్ట్రాల్లో ఓట్ల తారుమార్లు, ఇతర అవకతవకలపై ఉద్యమిస్తామని కూడా ప్రకటించారు. దీనికి సంబంధించి గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేస్తున్నట్టు చెబుతున్నారు.
ఇక, కేంద్ర ఎన్నికల సంఘంపై ఇప్పటికే అనుమానాలు ఉన్న.. కొన్ని పార్టీలు కూడా కాంగ్రెస్‌కుదన్నుగా నిలిచాయి. మరీ ముఖ్యంగా తమిళనాడు సీఎం స్టాలిన్ , పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వంటివా రు రాహుల్‌కు ఈ విషయంలో దోహదపడేందుకు రెడీ అయ్యారు. ఉద్యమానికి సహకరిస్తామంటూ.. మౌఖి కంగా ప్రకటించారు. వచ్చే ఏడాది తమ తమ రాష్ట్రాల్లోనూ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆయా పార్టీలు ముందుగానే అప్రమత్తమైనట్టు తెలుస్తోంది.
సో.. మొత్తంగా ఎన్నికల విధానం, ఓటర్ల జాబితా రూపకల్పన, నకిలీ ఓటర్లు, ఒకే పేరుతో వేలాది ఓట్లు.. ఇలా కొన్ని ప్రతిపాదనలతో రాహుల్ ఉద్యమిస్తున్నారు. ప్రధానంగా బూత్‌లలో రికార్డు చేసిన సీసీ టీవీ ఫుటేజీని ధ్వంసం చేయడం, ఓటర్ల జాబితాను డిజిటల్ రూపంలో ఇవ్వకపోవడం.. వంటి వాటిని ఆయన ప్రశ్నిస్తున్నారు. ఈ అంశాలపైనే దేశవ్యాప్తంగా ఉద్యమించేందుకు రాహుల్ ముందుకు వచ్చారు. అయితే.. ఈ విషయంలో కాంగ్రెస్‌లోని మేధావివర్గం మరో సూచన చేస్తోంది. ఈ అంశాలు కరెక్టేనని.. కానీ, ఇంతకు మించి మరో అంశం కూడా చూడాలని సూచిస్తున్నారు.
``మేం ఉద్యమం చేయడం బాగానే ఉంటుంది. కానీ, ఇది చేస్తూ.. మరోవైపు ప్రజలను ఈవీఎంలకు దూరంగా ప్రేరేపించాలి. అంటే.. బ్యాలెట్ విధానంలో ఎన్నికలు నిర్వహిస్తే.. తాము ఓటు వేసేందుకు వచ్చేది లేదని ప్రజలను కార్యోన్ముఖులను చేయాలి. ఇది కీలకం. ఈ దిశగా రాహుల్ ప్రయత్నించాలి. అప్పుటు అవకతవకలకు అవకాశం తగ్గుతుంది.`` అని సీనియర్ నేత జైరాం రామేష్ వ్యాఖ్యానించారు. ఇదే అభిప్రాయాన్ని మహారాష్ట్ర మాజీ సీఎం శరద్ పవార్ కూడా చెప్పుకొచ్చారు. మరి రాహుల్ ఈ దిశగా అడుగులు వేస్తారో.. లేదో చూడాలి.