తల్లిదండ్రులను పట్టించుకోకుంటే జరిగేది ఇదే.. సుప్రీం సీరియస్..

తమను తమ కుమారుడు పట్టించుకోవడం లేదని మహారాష్ట్రకు చెందిన 80 ఏళ్ల వృద్ధ జంట కోర్టును ఆశ్రయించింది.;

Update: 2025-09-25 20:30 GMT

వట్టిపోయిందని ఆవును.. వృద్ధాప్యం వచ్చిందని తల్లిదండ్రులను పట్టించుకోకుంటే పుట్టగతులు ఉండవు కదా.. వృద్ధాప్యంలో తల్లిదండ్రులను చూసుకోవడం, సంరక్షించడం సంతానానికి మౌలిక కర్తవ్యం. కానీ సమాజంలో కొందరు సంతానం వృద్ధాప్యానికి వచ్చారని, వారితో ఎలాంటి ప్రయోజనం లేదని చిన్నచూపు చూస్తుంటారు. తల్లిదండ్రులను పట్టించుకోకుండా.. వారిని భారంగా భావించే పిల్లల ప్రవర్తన ప్రస్తుతం కనిపిస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులు తమ హక్కులను రక్షించుకునేందుకు 2007లో అమల్లోకి వచ్చిన తల్లిదండ్రుల, వృద్ధుల సంరక్షణ, పోషణ చట్టం ఒక ముఖ్యమైన ఆయుధంగా మారుతోంది. తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు దీనికి మరోసారి బలాన్ని చేకూర్చింది.

ట్రైబ్యునల్ నిర్ణయమే సరైనదన్న సుప్రీం కోర్టు..

తమను తమ కుమారుడు పట్టించుకోవడం లేదని మహారాష్ట్రకు చెందిన 80 ఏళ్ల వృద్ధ జంట కోర్టును ఆశ్రయించింది. అయితే, ట్రైబ్యునల్‌ నెలకు రూ. 3000 భృతి చెల్లించాలని, ముంబయిలోని తల్లిదండ్రులు ఉంటున్న ఇల్లు ఖాళీ చేయాలని ఆదేశించింది. ట్రైబ్యునల్ నిర్ణయాన్ని హైకోర్టు తోసిపుచ్చింది. కుమారుడు సీనియర్ సిటిజన్ కావడంతో ట్రైబ్యునల్ పరిధిలోకి రాదని పేర్కొంది. ఈ కేసులో సుప్రీంకోర్టు హై కోర్టు వాదనను తోసిపుచ్చి ట్రైబ్యునల్ తీర్పును సమర్థించింది. నవంబర్ 30లోగా కుమారుడు ఇంటిని ఖాళీ చేయాలని స్పష్టమైన గడువు విధించింది.

సుప్రీం తీర్పు ప్రతి వృద్ధ దంపతులకు భరోసా..

సుప్రీం కోర్టు తీర్పు కేవలం ఒక కుటుంబానికి మాత్రమే సంబంధించింది కాదు. ఇది సమాజంలోని ప్రతి వృద్ధుడికి భరోసా కల్పిస్తుంది. తల్లిదండ్రులను పట్టించుకోకపోతే పిల్లలకు వారి ఆస్తిపై హక్కు లేదని గతంలోనూ సుప్రీం కోర్టు స్పష్టంగా తెలిపింది. మధ్యప్రదేశ్‌లో జరిగిన మరో కేసులో కూడా సుప్రీంకోర్టు ఇదే స్పష్టం చేసింది. అయితే ఈ కేసులో తల్లిదండ్రులు తమ కొడుకుకు ఆస్తిని గిఫ్ట్ డీడ్ చేశారు. సుప్రీం ఆ గిఫ్ట్ డీడ్ ను రద్దు చేసి ఆస్తి హక్కులను తిరిగి వృద్ధులకే అప్పగించింది.

పిల్లలు కర్తవ్యాన్ని నిర్వర్తించాలి

ఇక్కడ ప్రధాన సందేశం స్పష్టంగా కనిపిస్తుంది. ఆస్తి అనేది కేవలం ఆర్థిక సంపద కాదు.. అది తల్లిదండ్రులు జీవిత కాలం కష్టపడి సంపాదంచింది. ఆ సంపదను పొందాలంటే పిల్లలు ముందుగా తమ కర్తవ్యాన్ని నిర్వర్తించాలి. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులకు తోడుగా నిలవడం ఒక నైతిక బాధ్యత మాత్రమే కాదు, చట్టబద్ధమైన కర్తవ్యం అని ఈ తీర్పు మళ్లీ గుర్తు చేసింది.

ఆస్తి కోసమే నటన..

మన సమాజంలో వృద్ధుల సమస్యలు పెరుగుతున్నాయి. వారిని ఒంటరిగా వదిలేయడం, ఆస్తి కోసం మాత్రమే వారిని చేరదీసినట్లు నటించడం, స్వార్థపూరిత ధోరణులు మానవత్వానికే మచ్చను తెచ్చిపెడుతున్నాయి. ఇలాంటి సందర్భాల్లో ట్రైబ్యునళ్లు వేగంగా తీర్పులు ఇవ్వడం, సుప్రీంకోర్టు ఆ తీర్పులను బలపరచడం తల్లిదండ్రుల గౌరవాన్ని కాపాడే దిశలో ఒక కీలక పరిణామం.

తల్లిదండ్రులే నిజమైన సంపద..

పిల్లలకు ఈ తీర్పు ఒక హెచ్చరిక. జన్మనిచ్చిన తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే కేవలం నైతిక పరాజయమే కాదు.. చట్టపరమైన నష్టాలు కూడా ఉంటాయని హెచ్చరిస్తోంది. తల్లిదండ్రుల సంతోషం, సంరక్షణే సంతానానికి నిజమైన సంపద అని ఈ తీర్పు ప్రతీ ఒక్కరికి గుర్తు చేస్తోంది.

Tags:    

Similar News