కాంగ్రెస్ జెన్-జడ్ జపం.. భారత్ లో ఆ స్కోప్ ఉందా?
నేపాల్ లో ప్రభుత్వాన్ని గద్దె దింపిన జెన్-జడ్ ఉద్యమం తరహాలోనే మన దేశంలోనూ యువత ఆందోళనలకు సిద్ధమవ్వాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పిలుపునివ్వడం చర్చనీయాంశమవుతోంది.;
నేపాల్ లో ప్రభుత్వాన్ని గద్దె దింపిన జెన్-జడ్ ఉద్యమం తరహాలోనే మన దేశంలోనూ యువత ఆందోళనలకు సిద్ధమవ్వాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పిలుపునివ్వడం చర్చనీయాంశమవుతోంది. 2000 సంవత్సరం దరిదాపుల్లో పుట్టిన యువతను జనరేషన్ జెడ్ (జెన్ - జడ్)గా పరిగణిస్తున్న విషయం తెలిసిందే. దేశంలో ఓట్ల చోరీని జెన్ - జడ్ యువతే అడ్డుకోవాలని శుక్రవారం తన ఎక్స్ ఖాతాలో రాహుల్ పోస్టు చేశారు. ఈ దేశ యువత, ఈ దేశ విద్యార్థులు, ఈ దేశ జెన్ - జీ రాజ్యాంగాన్ని కాపాడుకుంటారు. నేను ఎప్పుడు వారికి అండగా నిలుస్తానంటూ రాహుల్ పోస్టు చేశారు.
దీంతో కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యూహంపై చర్చ జరుగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా జెన్ జీ యువత ఉద్యమిస్తున్న తీరు గమనిస్తే.. అలాంటి పరిస్థితి మన దేశంలో ఉందా? అనే ప్రశ్న తలెత్తుతోంది. నేపాల్ లో సోషల్ మీడియాను నిషేధించారన్న కారణంతో జెన్ - జడ్ యువత తీవ్రంగా స్పందించింది. ప్రభుత్వాన్నే కూలదోసింది. ఇదే తీరున మన పక్క దేశాలైన బంగ్లదేశ్, శ్రీలంకల్లో అంతర్గత సమస్యలతో ప్రభుత్వాలను ప్రజలు దించేశారు. కానీ, నేపాల్ లో ఉద్యమించిన వారిలో ఎక్కువ మంది 1997 నుంచి 2012 సంవత్సరాల మధ్య జన్మించిన వారే.. నేపాల్లో అవినీతి, ఆర్థిక అసమానతలు, యువతలో నిరుద్యోగం. ఈ సమస్యలపై ప్రజల ఆగ్రహం చాలా కాలంగా పేరుకుపోయింది. ఈ ఆగ్రహానికి, ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన సోషల్ మీడియా నిషేధం అగ్నికి ఆజ్యం పోసింది. అందుకే అక్కడ జెన్ జడ్ యువత తీవ్రస్థాయిలో ఉద్యమించింది.
ఇక మన దేశంలో ఓట్ల చోరీపై అదే తరహా ఉద్యమం జరగాలని కాంగ్రెస్ కోరుకోవడం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. విదేశాలతో మన దేశ పరిస్థితులు వేరని, అలాంటి ఉద్యమాలకు మన దేశంలో అవకాశం ఎక్కడ ఉందని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు. అయితే ప్రజల అభిమానాన్ని చూరగొనడంలో విఫలమైన కాంగ్రెస్ యువతను రెచ్చగొట్టి అధికారంలోకి రావాలని చూస్తోందని బీజేపీ విమర్శలు గుప్పిస్తోంది. దేశంలో అంతర్యుద్దాన్ని రెచ్చగొడుతున్నారని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఆరోపించారు. ప్రపంచంలోనే మనది అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం, రాహుల్ ను ప్రజలు ఎన్నుకోకపోతే మా తప్పా? అంటూ కేంద్ర మంత్రి ప్రశ్నించారు.
అయితే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ జెన్ - జడ్ యువతను ఓట్ల చోరీపై ఉద్యమించాలని పిలుపునివ్వడం రాజకీయ వ్యూహమే అంటున్నారు. బిహార్ ఎన్నికలకు ముందు ఆ రాష్రంలో ఓట్ల చోరీపై రాహుల్ పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. ఓటర్ అధికార్ యాత్ర పేరుతో 16 రోజుల పాటు యాత్ర చేసిన రాహుల్ ఆ రాష్ట్రంలోని ససారామ్ నుంచి పట్నా వరకు పర్యటించారు. దాదాపు 20 జిల్లాల్లో 1,300 కిలోమీటర్ల మేర పర్యటించి ప్రజలతో మమేకమయ్యారు. అదే సమయంలో నేపాల్ లో జెన్-జడ్ ఉద్యమం జరగడం, నేపాల్ తో బిహార్ సరిహద్దు పంచుకోవడం వల్ల ఓటు చోరీపై యువతలో అవగాహన పెంచడానికే రాహుల్ ఆ పోస్టు చేశారని అంటున్నారు. బిహార్‌కు నేపాల్‌తో దాదాపు 729 కిలోమీటర్ల సరిహద్దు ఉండటం వల్ల ఇక్కడి యువతను తట్టిలేపాలనే ఆలోచనతో రాహుల్ వ్యూహం రచించారని అంటున్నారు.