8గం.ల ప‌నిపై రాధిక ఆప్టే ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు

ఇదిలా ఉంటే, ఇప్పుడు రాధిక ఆప్టే కూడా త‌ల్ల‌యిన త‌ర్వాత త‌నకు ఎదురైన అనుభ‌వాల‌ను ముచ్చ‌టించింది.;

Update: 2025-06-02 04:21 GMT
8గం.ల ప‌నిపై రాధిక ఆప్టే ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు

రోజుకు 6 గంట‌లు మాత్ర‌మే ప‌ని చేయ‌గ‌ల‌న‌ని కండీష‌న్ పెట్టిన దీపిక ప‌దుకొనే ప్ర‌భాస్ `స్పిరిట్` నుంచి వైదొల‌గాల్సి వ‌చ్చింది. దర్శ‌కుడు సందీప్ వంగా దీనికి అంగీక‌రించ‌లేద‌ని క‌థ‌నాలొచ్చాయి. ఆరు గంట‌ల ప‌ని దినాలు, 20 కోట్ల పారితోషికం, లాభాల్లో వాటాలు, సిబ్బందికి పోష‌ణ వ‌గైరా డిమాండ్లు దీపిక వైపు నుంచి ఉన్నాయి.

కార‌ణం ఏదైనా కానీ దీపిక‌ను తొల‌గించి, `యానిమ‌ల్` ఫేం ట్రిప్తి దిమ్రీని వెంట‌నే ఈ పాత్ర కోసం ఎంపిక చేసుకున్నాడు సందీప్ వంగా. ఈ వార్త మీడియాలో సెన్సేష‌న్ గా మారింది. కొత్త‌గా త‌ల్ల‌యిన న‌టీమ‌ణుల‌కు ప‌ని గంట‌లు త‌గ్గించే వెసులుబాటు లేదా? బిడ్డ‌కోసం వెళ్లాలి క‌దా? అని చాలా మంది ముచ్చ‌టించుకున్నారు. ఇటీవ‌ల కాజోల్ న‌టించిన `మా` ఈవెంట్లో అజ‌య్ దేవ‌గ‌న్- కాజోల్ జంట కూడా దీపిక ను స‌మ‌ర్థించారు. ఎనిమిది గంట‌లు సాధార‌ణ ప‌నిదినం అంద‌రు న‌టీన‌టుల‌కు వ‌ర్తిస్తోంద‌ని, దీనిని మార్చాల్సి ఉంద‌ని అజ‌య్ దేవ‌గ‌న్ అన‌డం షాకిచ్చింది. తానైతే కొత్త త‌ల్లిగా చాలా త‌క్కువ ప‌ని చేస్తాన‌ని కాజోల్ అంది.

ఇదిలా ఉంటే, ఇప్పుడు రాధిక ఆప్టే కూడా త‌ల్ల‌యిన త‌ర్వాత త‌నకు ఎదురైన అనుభ‌వాల‌ను ముచ్చ‌టించింది. ఓ వైపు బిడ్డ‌కు పాలిస్తూనే, సినిమా చ‌ర్చ‌ల కోసం కాన్ఫ‌రెన్స్ లో పాల్గొన్న ఫోటోను కూడా ఇంత‌కుముందు ఆప్టే షేర్ చేసింది. నిజంగా పాలిచ్చే త‌ల్లుల‌కు 8గంట‌ల పనిదినాలు ఇబ్బందిక‌ర‌మే. కానీ ప‌రిశ్ర‌మ‌లో త‌ప్ప‌దు అని కూడా రాధిక అభిప్రాయ‌ప‌డింది.

రాధికా ఆప్టే ప్రసవించిన వారం తర్వాత తిరిగి పనిలోకి చేరింది. కానీ భారతీయ చిత్ర పరిశ్రమ తనలాంటి మహిళలకు మద్దతు ఇవ్వడానికి రెడీగా లేదని ఆప్టే అంగీకరించింది. లండన్ నుండి తన ఆరు నెలల కుమార్తెను చూసుకుంటూ, ముంబై ప‌రిశ్ర‌మ‌లో త‌న పోరాటం గురించి రాధిక ఓపెనైంది. ప‌రిశ్ర‌మ‌లో ఆడాళ్ల‌కు ఉండే స‌వాళ్ల గురించి ఆప్టే ప్ర‌స్థావించింది. ఒక కొత్త త‌ల్లి సినీప‌రిశ్ర‌మ‌లో ఎలా ప‌ని చేయాలో కనుగొనే ప్ర‌య‌త్నం చేస్తున్నాన‌ని రాధిక ఆప్టే అన్నారు. మన సినీ పరిశ్రమలో పనిచేయడం నిజంగా కష్టం.. ఎందుకంటే మనం ఎన్ని గంటలు సెట్లో ఉంటామో, ఏ తీరుగా సినిమా చేస్తామో తెలీదు. ఎంత సమయం తర్వాత బిడ్డను చూడగలం? అనేది గుర్తించ‌డం క‌ష్టం. నేను దీనిని గుర్తించేందుకు ప్ర‌య‌త్నిస్తాన‌ని ఆప్టే అన్నారు.

రాధికకు ప్ర‌స‌వానికి వారం ముందు స్క్రిప్టు అందింది. ప్రసవించిన వారంలోనే జూమ్ కాల్స్‌లో వర్చువల్ సమావేశాల కోసం తిరిగి జాబ్ లో చేరింది. త‌న బిడ్డ‌కు పాలు ఇస్తున్నప్పుడు వ‌ర్చువ‌ల్ స‌మావేశానికి హాజరైంది. దీనికి సంబంధించి గత డిసెంబర్‌లో షేర్ చేసిన ఫోటో నిజంగా ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే రాధిక ఆప్టే న‌టించిన తాజా చిత్రం `సిస్టర్ మిడ్‌నైట్` మే 30న ఇండియాలో థియేటర్లలోకి రానుంది. మొదట 2023 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించిన‌ ఈ చిత్రంలో రాధిక న‌ట‌న‌కు ప్ర‌శంస‌లు కురిసాయి. ప్ర‌శంస‌లు పొందిన ఈ చిత్రం మే 16న అమెరికాలో విడుదలైంది. జూన్ 11న ఫ్రెంచ్‌లో విడుదల కానుంది.

Tags:    

Similar News