పుతిన్ భారత టూర్.. అమెరికాకు కుళ్లు.. ప్రపంచమంతా కళ్లు
ఎన్నో విషాదాలు.. మరెన్నో వివాదాలతో సాగిన 2025 సంవత్సరం చివరి నెలలో మరింత సంచలనం...!;
ఎన్నో విషాదాలు.. మరెన్నో వివాదాలతో సాగిన 2025 సంవత్సరం చివరి నెలలో మరింత సంచలనం...! ఉక్రెయిన్ పై యుద్ధం మొదలుపెట్టిన 2022 ఫిబ్రవరి తర్వాత చైనా, మంగోలియా, ఒకప్పటి సోవియట్ యూనియన్ తప్ప మరే బయట దేశంలోనూ అడుగుపెట్టని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇప్పుడు ఏకంగా భారత్ లో పర్యటిస్తున్నారు. రెండు రోజులు.. గురు, శుక్రవారాల్లో పుతిన్ భారత రాష్ట్రపతి ముర్ము ఇచ్చే విందును స్వీకరించి, ప్రధాని మోదీతో శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారు. పుతిన్ స్థాయి నాయకుడు భారత్ లో పర్యటించడం పశ్చిమ దేశాలకు ఓ విధంగా కడుపు మంటే. మరీ ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నకు. ప్రస్తుతం అంతర్జాతీయంగా అత్యంత ప్రాధాన్య అంశం పుతిన్ భారత పర్యటనే అనడంలో ఎలాంటి సందేహమూ లేదు. దీనిపై ప్రపంచ మీడియా ప్రత్యేకంగా ఫోకస్ పెడుతుందని చెప్పవచ్చు. మరోవైపు దాదాపు ఐదేళ్ల తర్వాత పుతిన్ భారత్ కు వస్తున్నారు. 2021లో ఆయన చివరగా పర్యటించారు. అప్పటికి ఉక్రెయిన్ పై యుద్ధం మొదలుపెట్టలేదు. భారత్-రష్యాలది దశాబ్దాలుగా పెనవేసుకున్న బంధం. చరిత్రలో ఈ రెండు దేశాలు ఒకదానికొకటి పలు సందర్భాల్లో సాయం చేసుకున్నాయి.
ట్రంప్ పెట్టిన చమురు మంట...
రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలుపై నిప్పులు పోసుకున్న ట్రంప్.. ఆంక్షలు విధించి ఎలాగోలా నిలిపివేసేలా చూశారు. ఈ నేపథ్యంలో పుతిన్ పర్యటనలో ఇంధన రంగంలో సహకారంపై చర్చలు జరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా రక్షణపరంగా ఎస్-400 సిస్టమ్స్, సుఖోయ్-57 యుద్ధ విమానాల రక్షణ ఒప్పందాలపై చర్చలను ముందుకు తీసుకెళ్లే చాన్సుంది. అణుశక్తి సాంకేతికత, వ్యాపారంలో భారత్-రష్యా ద్వైపాక్షిక సంబంధాలను సమీక్షించుకునే అవకాశం ఉంది.
రష్యా ఆకాంక్షలు భారీగానే..
భారత్ ను నమ్మకమైన మిత్రదేశంగా భావించే రష్యా.. పుతిన్ పర్యటన దిగ్విజయం అవుతుందని ఆశిస్తోంది. అంతర్జాతీయ సమస్యలపై లోతైన చర్చలు జరగాల్సి ఉందని అంటోంది. పుతిన్ భారత టూర్.. ఇచ్చే మరో ముఖ్యమైన సందేశం ఏమంటే.. ఉక్రెయిన్ విషయంలో రష్యాను ఒంటరి చేయాలనుకున్న నాటో దేశాల ప్రయత్నం ఫలించలేదని చాటుతుంది. ఉక్రెయిన్-రష్యా యుద్ధంలో తమది ఏ పక్షమూ కాదని, శాంతి పక్షం అని మోదీ పదేపదే స్పష్టంచేసిన సంగతి తెలిసిందే.
ఆ పాత స్నేహ్నం..
చరిత్రలో గత 30 ఏళ్లు నుంచి మాత్రమే భారత్ తో అమెరికా సన్నిహితంగా ఉంటోంది. దాని మొగ్గు ఎప్పుడూ పాక్ వైపే. రష్యా మాత్రం అలా కాదు. భారత్ ను అత్యంత దగ్గరి స్నేహితుడిగా చూస్తుంది. ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో అమెరికా-రష్యా పోటాపోటీగా తలపడినప్పుడు భారత్ ఎక్కువ శాతం రష్యాతోనే సన్నిహిత సంబంధాలు కొనసాగించింది. చమురు మాత్రమే కాదు రష్యా ఆయుధాలను ఎక్కువగా కొనే దేశం భారత్ కావడం గమనార్హం.
క్రిమినల్ కోర్టు వారెంట్ ఉన్నా..
ఉక్రెయిన్ పై యుద్ధ నేరాల నేపథ్యంలో పుతిన్ పై అంతర్జాతీయ క్రిమినల్ కోర్డు (ఐసీసీ) గతంలో అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. దాని సభ్య దేశాల్లో పర్యటిస్తే పుతిన్ ను అరెస్టు చేయాలి. కానీ, మంగోలియా ఈ నియమాన్ని పాటించలేదు. భారత్ ఐసీసీ సభ్య దేశం కాదు. మరోవైపు తనపై అరెస్ట్ వారెంట్ ఉన్నా.. పర్యటనలు చేయగలనని పుతిన్ నిరూపించినట్లు అవుతోంది.
-పుతిన్ భారత్ టూర్ పట్ల అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారనేది చూడాలి. ఆయన వరకు అయితే ఇది కడుపు మంటే. రష్యాను దెబ్బకొట్టాలని ఆ దేశం నుంచి భారత్ చమురు కొనకుండా చూస్తే, ఇప్పుడు పుతినే భారత్ లో పర్యటిస్తూ ట్రంప్ ను ఎద్దేవా చేస్తున్నారు.