పుంగనూరులో పెద్దిరెడ్డికి షాక్.. మున్సిపల్ పోరులో అభ్యర్థులే కరువా?
వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డికి రాజకీయంగా తొలిసారి గట్టి ఎదురుదెబ్బ తగిలిందనే ప్రచారం హీట్ పుట్టిస్తోంది.
వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డికి రాజకీయంగా తొలిసారి గట్టి ఎదురుదెబ్బ తగిలిందనే ప్రచారం హీట్ పుట్టిస్తోంది. పెద్దిరెడ్డి సొంత నియోజకవర్గ కేంద్రమైన పుంగనూరులో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిని పోటీకి పెట్టలేకపోయారనే వార్తలు రాజకీయంగా ఆసక్తి రేపుతున్నాయి. పెద్దిరెడ్డి కుమారుడు, వైసీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు మిథున్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగినా పార్టీ అభ్యర్థితో నామినేషన్ వేయించ లేకపోయారని చెబుతున్నారు. తమ కంచుకోట లాంటి పుంగనూరులో పెద్దిరెడ్డి కుటుంబానికి ఈ పరిస్థితి రావడాన్ని ఎవరూ ఎన్నడూ ఊహించలేదని అంటున్నారు. రాయలసీమ రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న పెద్దిరెడ్డికి పుంగనూరులో ఎదురు లేదన్నట్లుగా రాజకీయాలు చేశారు. అయితే మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థులను నిలపలేక చేతులెత్తేయాల్సిన పరిస్థితులను తెచ్చుకున్నారని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.
పుంగనూరు పెద్దిరెడ్డి సొంత నియోజకవర్గం. 2009 నుంచి ఆయన ఇక్కడ వరుసగా గెలుస్తూ వస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతికూల పరిస్థితుల్లోనూ తట్టుకుని విజయం సాధించారు. పుంగనూరుతోపాటు పక్కనే ఉన్న తంబళ్లపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలోనూ పెద్దరెడ్డి కుటుంబానిదే హవా. ఈ రెండు నియోజకవర్గాలలో పట్టుతో రాజంపేట పార్లమెంటు నియోజకవర్గంపైనా పెద్దిరెడ్డి కుటుంబం ఆధిపత్యం చెలాయిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో పుంగనూరు మున్సిపాలిటీలో అభ్యర్థులను పోటీకి పెట్టలేని పరిస్థితులు తెచ్చుకోవడమే హాట్ టాపిక్ అవుతోంది. నిజానికి మున్సిపల్ ఎన్నికల్లో తాము పోటీ చేయమని పెద్దిరెడ్డి ముందుగా ప్రకటించారు. అయితే అధిష్టానం జోక్యంతో ఆ ప్రకటన వెనక్కి త తీసుకుని పోటీకి సిద్ధమైనా అధికార కూటమి నాయకులు, కార్యకర్తల ప్రతిఘటనతో చేతులు ఎత్తేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని అంటున్నారు.
తీవ్ర ప్రతిఘటన మధ్య ఈ నెల 16న పెద్దిరెడ్డి కుమారుడు, ఎంపీ మిథున్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ అభ్యర్థులు నామినేషన్ వేసేందుకు సిద్ధమయ్యారు. అయితే మిథున్ రెడ్డి కాన్వాయ్ లో ఇతర ప్రాంతాలవారు ఉన్నారని ఆరోపించడమే కాకుండా, ముందుగా తాము నామినేషన్ వేస్తామని టీడీపీ శ్రేణులు పట్టుబడటంతో ఘర్షణలు చోటుచేసుకున్నట్లు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఇరుపార్టీల మధ్య ఉద్రిక్తతలు పెరిగిపోవడంతో వైసీపీ అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా వెనుదిరగాల్సి వచ్చిందని అంటున్నారు. అయితే ఆ తర్వాత రెండు రోజుల సమయం ఉన్నప్పటికీ వైసీపీ తరఫున నామినేషన్ వేయలేకపోవడమే చర్చనీయాంశంగా మారింది. నిజానికి పుంగనూరులో వైసీపీకి ముఖ్యంగా పెద్దిరెడ్డికి ఇటువంటి పరిస్థితి ఎదురవడమే రాజకీయంగా హీట్ పుట్టిస్తోందని అంటున్నారు. ఇదంతా పెద్దిరెడ్డి స్వయంకృతాపరాధంగా పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.
వైసీపీలో నెంబర్ టుగా చెలామణీ అయిన పెద్దిరెడ్డి రాయలసీమ రాజకీయాల్లో తిరుగులేని నాయకునిగా చక్రం తిప్పారు. గత ప్రభుత్వంలో పూర్తి స్వేచ్ఛ ఇవ్వడంతో రాయలసీమ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ లేకుండా చేయాలని పెద్దిరెడ్డి పావులు కదిపారని అంటున్నారు. అప్పట్లో ఆయన ఎత్తుగడలతో టీడీపీ ఉక్కిరిబిక్కిరి అయింది. పెద్దిరెడ్డి నియోజకవర్గంలో పసుపు జెండా పట్టుకోవడానికే కార్యకర్తలు భయపడాల్సివచ్చిందని గుర్తు చేస్తున్నారు. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పం, ఆయన వియ్యంకుడు, సినీనటుడు బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురంల్లో టీడీపీని లేకుండా చేయాలని పెద్దిరెడ్డి వ్యూహాలు రచించారు. అధికారం అండతో అప్పట్లో ఆయన చూపిన తెగువ ఇప్పుడు ఎదురుదెబ్బకు కారణమైందని విశ్లేషిస్తున్నారు. పెద్దిరెడ్డి చూపిన రాజకీయాన్నే ఇప్పుడు టీడీపీ అనుసరిస్తోందని అంటున్నారు. ఈ పరిస్థితులను ఊహించే ఆయన ముందుగా పోటీకి వెనక్కి తగ్గారని చెబుతున్నారు. అయినప్పటికీ పోటీ పెట్టాల్సిందేనని అధిష్టానం పట్టుబట్టడంతో నామినేషన్లు వేయించేందుకు సిద్ధమయ్యారని అంటున్నారు. కానీ, అధికార కూటమి బలంగా ప్రతిఘటించడంతో పెద్దిరెడ్డి అనుచరలు చేతులెత్తేయాల్సిన పరిస్థితి వచ్చిందని అంటున్నారు.