నీ 'బిగ్ బాస్' ప్రేమ పాడుగానూ... ప్రయాణికుల ప్రాణాల పరిస్థితి ఏమిటి?

ఇటీవల వరుసగా జరుగుతున్న బస్సు ప్రమాదాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్న సంగతి తెలిసిందే.;

Update: 2025-11-07 15:27 GMT

ఇటీవల వరుసగా జరుగుతున్న బస్సు ప్రమాదాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్న సంగతి తెలిసిందే. ప్రధానంగా ఫోన్ మాట్లాడుతూ, మద్యం సేవించి, అతివేగంగా వాహనాలు నడపడం వల్లే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని చెబుతుంటారు. ఈ క్రమంలో ఏకంగా ఫోన్ లో వీడియో చూస్తూ అర్ధరాత్రి వేగంగా బస్సు నడుపుతున్న డ్రైవర్ వ్యవహారం తాజాగా తెరపైకి వచ్చింది.

అవును... జాతీయ రహదారిపై అతివేగంగా వాహనం నడుపుతూ ఒక ప్రైవేట్ బస్సు డ్రైవర్ తన మొబైల్ ఫోన్‌ లో బిగ్ బాస్ షో చూస్తున్నట్లు చూపించే ఓ షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది! బస్సు వేగంగా ప్రయాణిస్తున్నప్పుడు, రాత్రి సమయంలో, ప్రయాణికులు ఎక్కువ మంది మంచి నిద్రలో ఉన్న సమయంలో ఈ సంఘటన జరిగిందని తెలుస్తోంది!

సరిగ్గా ఆ సమయంలో బస్సులో ఉన్న ఒక ప్రయాణీకుడు డ్రైవర్ ప్రవర్తనను గమనించి వెంటనే వీడియోను రికార్డ్ చేశాడు. అనంతరం ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇలాంటి నిర్లక్ష్యపు డ్రైవింగ్ కాదా రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణం అంటూ నెటిజన్లు ఫైరవుతున్నారు. ఇలాంటి డ్రైవర్లను అరెస్ట్ చేయాలని కోరుతున్నారు.

ఇటీవల జరిగిన కొన్ని ఘోర ఘటనలు చూసైనా డ్రైవర్లకు జ్ఞానం రావాలని.. ప్రధానంగా రాత్రిపూట బస్సులో ప్రయాణికులు నిద్రలో ఉన్న సమయంలో మరింత అప్రమత్తంగా వాహనం నడపాలని సూచిస్తున్నారు. ఇలాంటివారిని ఏమాత్రం ఉపేక్షించకూడదని.. కఠినచర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.

కాగా.. మూడు రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్‌ లోని శ్రీ సత్యసాయి జిల్లాలోని హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారిపై ఒక ప్రైవేట్ బస్సు బోల్తా పడిన ఘటనలో ఒకరు మృతి చెందగా, ఐదుగురు గాయపడిన సంగతి తెలిసిందే. 25 మంది ప్రయాణికులతో వెళ్తున్న జబ్బార్ ట్రావెల్స్ కు చెందిన బస్సు, ముందున్న ఐషర్ వాహనాన్ని ఢీకొట్టి, హైవేపై బోల్తా పడింది.

అయితే... అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా గుర్తించినట్లు కథనాలొచ్చాయి! మరోవైపు ఏలూరు జిల్లా లింగపాలెం మండలం జూబ్లీ నగర్ సమీపంలో ఏలూరు నుండి హైదరాబాద్ వెళ్తున్న మరో ప్రైవేట్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషయంలోనూ అతివేగమే కారణం అనే చర్చ తెరపైకి వచ్చింది!

ఇలా అతి వేగం, నిర్లక్ష్యం వల్ల ప్రతి రోజూ ఏదో ఒక మూల ప్రమాదాలు జరుగుతున్న వేళ.. ఇలా ఏకంగా సెల్ ఫోన్ లో వీడియో చూస్తూ వాహనం నడపడం ఏమాత్రం క్షమించరాని చర్య అనే చెప్పాలి!

Tags:    

Similar News