నేటి రాజకీయాలకు దూరంగా నాటి రాజవంశీకులు... కారణం ఇదే!?

వీరిలో ప్రధానంగా... విజయనగరం గజపతి రాజులు, బొబ్బిలి రావోస్ రాజులు, కురుపాం, మేరంగిలకు చెందిన గిరిజన రాజులు, ఇటు నర్సీపట్నం ప్రాంతానికి చెందిన తంగేడు రాజులు రాజకీయాల్లో యాక్టివ్ గా ఉంటుంటారు!

Update: 2024-05-16 08:22 GMT

రాజకీయాల్లోకి వచ్చిన కొత్తలో ఉత్తరాంధ్రలోని రాజ కుటుంబాల వారికి ప్రజలు బ్రహ్మరథం పట్టారనే చెప్పాలి. వీరిలో ప్రధానంగా... విజయనగరం గజపతి రాజులు, బొబ్బిలి రావోస్ రాజులు, కురుపాం, మేరంగిలకు చెందిన గిరిజన రాజులు, ఇటు నర్సీపట్నం ప్రాంతానికి చెందిన తంగేడు రాజులు రాజకీయాల్లో యాక్టివ్ గా ఉంటుంటారు! అయితే ఇటీవల కాలంలో రాజకీయాలకు వారు దూరంగా ఉంటున్నారనే చర్చ తెరపైకి వచ్చింది.

అవును... ఉత్తరాంధ్రలో ఒకప్పుడు రాజ కుటుంబాలు ఏపీలో రాజకీయాలను శాసించేవి. అయితే ఇప్పుడు వారి ప్రభావం అంతగా కనిపించడం లేదు. వాస్తవానికి ఇప్పుడు ఉత్తరాంధ్రగా పిలుస్తున్న ప్రాంతమే ఒకప్పటి కళింగాంధ్ర! 17వ శతాబ్ధంలో ఈ ప్రాంతం కుతుబ్ షాహీల పాలనలో ఉండేది. అయితే... ఆ సమయంలో కుతుబ్ షాహీలు ప్రజల నుంచి తిరుగుబాటు ఎదుర్కొన్నారు.

దీంతో... ఈ తిరుగుబాటుకు గల కారణాలు కనుక్కోమని సేనాని షేర్ మహ్మద్ ఖాన్ ను కుతుబ్ షాహీలు ఈ ప్రాంతానికి పంపించారు! అయితే... ఇక్కడ నీరు, మతం, పరిపాలన వంటి విషయాల్లో ప్రజలు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారనే విషయం తెలుసుకున్నారట. దీంతో ఈ ప్రాంతంలో ఉన్న కొన్ని పెద్ద కుటుంబాలకు అధికారాలు ఇచ్చి.. సుపరిపాలన అందిస్తే ప్రజల్లో తిరుగుబాటును తగ్గించవచ్చని వారు భావించారని చెబుతుంటారు.

ఇలా కుతుబ్ షాహీలు... బొబ్బిలి‌ రాజులు, పూసపాటి రాజవంశం, కాకర్లపూడి, గోడె జమీందార్లు, నర్సీపట్నం సమీపంలోని తంగేడు రాజులు, గిరిజన రాజులుగా పేరు పొందిన కురుపాం, వైరిచర్ల వంశస్తులకు కూడా జమీందారీలు అప్పగించారు.

తంగేడు రాజులు:

వాస్తవానికి... మధ్యయుగాల్లో త్యాగి రాజవంశం అని ఒకటి ఉండేది. అయితే కాలక్రమంలో... అది అంతరించి పోవడంతో ఆ రాజవంశ వారసులు ఉత్తరాంధ్ర ప్రాంతంలో వారి బంధువులున్న పాండ్రగి ప్రాంతానికి వచ్చారు. అక్కడ నుంచి తంగేడు ప్రాంతానికి వెళ్లి అక్కడ సంస్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ త్యాగి వంశీయులే ఇక్కడ సాగి వంశరాజులుగా కొనసాగుతున్నారని చెబుతారు!

నర్సీపట్నానికి ఆనుకొని ఉన్న కోటవురట్ల మండలంలోని తంగేడు అనే గ్రామంలోని తంగేడు రాజుల కనుసన్నల్లోనే సుమారు మూడు, నాలుగు దశాబ్ధాల పాటు విశాఖ జిల్లా రాజకీయాలు సాగాయని చెబుతారు. ఇందులో భాగంగా... తంగేడుకు చెందిన రాజు సాగి సూర్యనారాయణ రాజు, ఆయన సోదరుడు రాజా సాగి సీతారామరాజు దాదాపు మూడు దశాబ్దాలపాటు జిల్లా పరిషత్ చైర్మన్లుగా పని చేశారు.

ఈ క్రమంలో 1967-1977 మధ్య సూర్యనారాయణ రాజు రాష్ట్ర అటవీశాఖ మంత్రిగా, దేవాదాయ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించగా.. ఆ తర్వాత 1989 ఎన్నికలలో రాజా సాగి కృష్ణమూర్తి రాజు నర్సీపట్నం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే... సామాజిక సమీకరణాల నేపథ్యంలో వీరు రాజకీయాలకు కేంద్రమైన కోటవురట్ల మండలం.. పాయకరావు పేట ఎస్సీ నియోజకవర్గంలో కలిసిపోవడంతో వీళ్లకి సొంత నియోజకవర్గం అంటూ లేకుండా పోయింది!

పూసపాటి రాజ వంశీయులు:

జైపూర్ సంస్థానం నుంచి విడిపోయి విజయనగరం జిల్లా వద్ద కుమిలిని ప్రధాన కేంద్రంగా చేసుకున్న పూసపాటి రాజ వంశీయులు... అనంతర కాలంలో స్వాతంత్య్ర జమీందారిగా ప్రకటించుకుని పాలన మొదలు పెట్టారు. ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఈ రాజ వంశీయులు కళలు, విద్యాపరంగా చేసిన సేవలు చాలా గొప్పవని చెబుతుంటారు. రాజకీయాల్లో కూడా ఈ వంశం తమదైన ముద్ర వేసుకుంది.

ఇందులో భాగంగా... 1952లో మొట్ట మొదటిసారి జరిగిన ఎన్నికల్లో విజయనగరం నియోజవర్గ ప్రజలు పూసపాటి రాజ వంశీయుడైన పూసపాటి విజయ గజపతి రాజును గెలిపించారు. ఇదే సమయంలో... జాతీయ కాంగ్రెస్‌ హవాలో కూడా ఈయన సోషలిస్టు పార్టీ అభ్యర్ధిగా బరిలోకి దిగి భారీ మెజార్టీతో ఘన విజయం సాధించారు.

ఆ తర్వాత 1956లో జరిగిన ఎన్నికల్లో మళ్లీ ప్రజా సోషలిస్టు పార్టీ తరఫున విజయం సాధించారు. ఈ క్రమల్మో 1960, 1971లలో ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికై, మంత్రిగా పని చేశారు. ఈ నేపథ్యంలోనే విశాఖ పార్లమెంట్ స్థానం నుంచి రెండు సార్లు, బొబ్బిలి పార్లమెంట్ స్థానం నుంచి రెండు సార్లు ఎంపీగా కూడా గెలిచారు.

అనంతరం 1978లో రాజకీయ అరంగేట్రం చేసిన పూసపాటి విజయ గజపతి రాజు కుమారుడు పూసపాటి అశోక్ గజపతి రాజు ను విజయనగరం ఓటర్లు వరుసగా ఆరు సార్లు గెలిపించారు. అనంతరం ఆయన కుమార్తె అదితి గజపతి రాజు 2019 ఎన్నికల్లో తొలిసారి విజయనగరం అసెంబ్లీ స్థానానికి పోటీ చేసి ఓడిపోయారు. 2024 ఎన్నికల్లోనూ అదే స్థానం నుంచి అదితి బరిలోకి దిగారు.

బొబ్బిలి రాజులు:

బొబ్బిలి పేరు చెప్పగానే తెలుగు వారందరికి గుర్తొచ్చేది బొబ్బిలి యుద్దమే. తెలుగు నేలపై ఎన్ని యుద్దాలు జరిగినా బొబ్బిలి యుద్ధానిది ప్రత్యేక స్థానమని చరిత్రకారులు చెబుతుంటారు. ఈ బొబ్బిలి వంశానికి చెందిన రావు శ్వేతా చలపతి రామకృష్ణ రంగారావు 1932లో జస్టిస్ పార్టీ నుంచి మద్రాస్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి ఎన్నికై 1937 వరకు మద్రాస్ ప్రెసిడెన్సీకి సీఎంగా పనిచేశారు.

ఆ తర్వాత చలపతి రామకృష్ణ రంగారావు కుమారుడు ఎస్.ఆర్.కే. రంగారావు కూడా 1967లో శాసనసభకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత బొబ్బిలి వంశీయులు రాజకీయాల్లో పెద్దగా ఆసక్తి చూపలేదు. అయితే... సుజ‌య్ కృష్ణ రంగారావు ఎంట్రీ ఇచ్చి 2004, 2009లో కాంగ్రెస్ నుంచి 2014లో వైసీపీ నుంచి గెలిచారు. అనంతరం అధికార టీడీపీలో చేరి 2019 ఎన్నికల్లో పరాజయం పాలయ్యారు.

ప్రస్తుతం సుజయకృష్ణ రంగారావు సోదరుడు రాజా కృష్ణ రంగారావు (బేబీనాయన) టీడీపీ తరపున బొబ్బిలి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎన్నికల బరిలో ఉన్నారు.

గిరిజన రాజులు:

ఇక.. విజయనగరం జిల్లాలోని గిరిజన ప్రాంతాలైన కురుపాం, మేరంగి సంస్థానాలు కురుపాం నియోజకవర్గం పరిధిలోకే వస్తాయి. ఇక్కడ రాజులుగా, జమిందార్లుగా ఉన్న వంశీయులు ఇప్పుడు రాజకీయాల్లో కూడా కొనసాగుతున్నారు. ఇందులో భాగంగా... కురుపాం రాజవంశానికి చెందిన వైరిచర్ల కిశోర్ చంద్రదేవ్.. సుమారు రెండు దశాబ్దాలకు పైగా పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నారు.

అనంతరం కిశోర్ చంద్రదేవ్ 2014, 2019 ఎన్నికల్లో వరుసగా కాంగ్రెస్, టీడీపీల నుంచి అరకు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి పరాజయం పాలయ్యారు. ప్రస్తుతం రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం కురుపాం సంస్థాన వారసుడిగా వైరిచర్ల వీరేష్ చంద్ర దేవ్ టీడీపీ‌లో ఉన్నారు.

ఇదే సమయంలో మరో సంస్థానం చినమేరంగిలో శత్రుచర్ల కుటుంబం కూడా కురుపాం నియోజకవర్గం రాజకీయాల్లో యాక్టివ్‌ గా ఉంటోంది. ఇందులో భాగంగా... శత్రుచర్ల విజయ రామరాజు కాంగ్రెస్ పార్టీలో మూడుసార్లు ఎంపీగా, రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై... మంత్రి పదవులను చేపట్టారు. ఆ తర్వాత శత్రుచర్ల వంశానికి కోడలిగా వచ్చిన పాముల పుష్ప శ్రీవాణి గత ఎన్నికల్లో కురుపాం నుంచి గెలిచి, డిప్యూటీ సీఎంగా పదవి చేపట్టారు.

వాస్తవానికి ఒకప్పుడు రాజకీయాల్లో చాలా యాక్టివ్ గా ఉన్న ఈ రాజవంశీయులంతా ఇప్పుడు అతి తక్కువ ప్రాధాన్యతను, ఆసక్తిని కలిగి ఉన్నట్లు కనిపించడానికి పలు కారణాలు ఉన్నాయని చెబుతున్నారు పరిశీలకులు. ఇందులో భాగంగా.. వారసత్వ రాజకీయాల్లో ఆ కుటుంబాల మధ్య ఉన్నటువంటి భేదాభిప్రాయాలు ఒక కారణం అని అంటున్నారు.

ఇదే సమయంలో... మరోకటి ఆయా రాజకుటుంబాలు పోటీ చేస్తున్న నియోజకవర్గాలు ఇతర కులాలకు కేటాయించడంతో వారికి అవకాశం ఉండటం లేదని చెబుతున్నారు. అదేవిధంగా... రాజ కుటుంబాల నుంచి వచ్చిన వీరు రాజకీయాల్లో మాస్ లీడర్లుగా ఎదగలేకపోవడం కూడా మరో కారణమని అభిప్రాయపడుతున్నారు.

Tags:    

Similar News