పోల‌వ‌రంలో.... పైస‌ల‌ గోల‌.. !

పోలవరం ప్రాజెక్టు ద్వారా ఇటు ఉత్తరాంధ్రను, అటు రాయలసీమను కూడా సస్యశ్యామలం చేస్తామని సీఎం చంద్రబాబు పదేపదే చెబుతున్నారు.;

Update: 2025-10-08 05:30 GMT

పోలవరం ప్రాజెక్టు ద్వారా ఇటు ఉత్తరాంధ్రను, అటు రాయలసీమను కూడా సస్యశ్యామలం చేస్తామని సీఎం చంద్రబాబు పదేపదే చెబుతున్నారు. పోలవరం ప్రాజెక్టు రాష్ట్రానికి జీవనాడిగా మారుతుందని కూడా ఆయన వ్యాఖ్యానిస్తున్నారు. అంతేకాదు 2027 నాటికి ఈ ప్రాజెక్టు ప్రధాన ఎడమ కాలువను పూర్తి చేసి నీటిని అందిస్తామని కూడా ఇటీవల అసెంబ్లీలో ప్రకటించారు. ఆ తర్వాత మీడియాకు కూడా సమాచారం ఇచ్చారు. అనేక అంశాలను ప్రస్తావిస్తూ చేసిన పోలవరం ప్రకటన ఆసక్తిగానే ఉంది.

కానీ తాజాగా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన తాకీదు రాష్ట్ర ప్రభుత్వాన్ని కలవరపాటుకు గురిచేస్తోంది. దీనికి కారణం గత 2024-25 మధ్య కాలంలో కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో 2000 కోట్ల రూపాయలను పోలవరానికి ఇచ్చారు. అప్పట్లో కొత్తగా ఏర్పడిన రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం వద్దకు వెళ్లి ప్రధానమంత్రిని, అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రిని కలిసి విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో ఈ సొమ్మును బడ్జెట్లో కేటాయించారు. దీనిలో నుంచి 1850 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వానికి అందించారు.

అయితే ఈ సొమ్మును నిర్దేశిత ఖాతాలో ఉంచి ఖర్చు చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం.. ఈ నిధుల విషయంలో లెక్కలు ఇప్పటివరకు చెప్పలేదు అనేది కేంద్ర ప్రభుత్వం చెబుతున్న మాట. దీనికి సంబంధించి ఇటీవల రాష్ట్ర జల వనరుల శాఖకు పెద్ద లేఖ‌ కూడా వచ్చింది, 1850 కోట్ల రూపాయల ఖర్చుకు సంబంధించి లెక్కలు ఏవి అని అడిగింది. అయితే, దీనిపై నేరుగా సమాధానం చెప్పని రాష్ట్ర ప్రభుత్వం మౌనంగా ఉండిపోవడం విశేషం. అయితే దీనివల్ల నష్టం ఏంటి అనే సందేహం వస్తుంది.

ఈ ఏడాది అంటే 2025 -26 వార్షిక బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం 5000 కోట్ల రూపాయల పైచిలుకు మొత్తాన్ని పోలవరం ప్రాజెక్టుకు కేటాయించింది. ఈ నిధుల నుంచి పోలవరం పునరావాసం అదేవిధంగా భూములు ఇచ్చిన వారికి నష్టపరిహారం చెల్లించాల్సి ఉంది. ఈ మొత్తంలో నాలుగు వేల కోట్ల రూపాయలు పైగా పునరావాసానికి, నష్టపరిహారానికి కేటాయించగా.. మిగిలిన సొమ్మును పోలవరం ప్రాజెక్టుకు తిరిగి ఖర్చు చేయాలి. అయితే గతంలో ఇచ్చిన పద్దెనిమిది వందల యాభై కోట్ల రూపాయలకు లెక్కలు చెప్పని కారణంగా ఈ 5000 కోట్ల పైచిలుకు మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం స్టాల్ చేసింది. అంటే నిలిపివేసింది.

దీంతో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి ఊపిరాడని పరిస్థితి ఏర్పడింది. ఆ 1850 కోట్ల రూపాయల లెక్క పక్కనపెట్టి ఇప్పుడు కేటాయించిన 5000 కోట్ల రూపాయలను ఇవ్వాలని ఇటీవల ఢిల్లీ పర్యటన‌లో చంద్రబాబు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి కి విజ్ఞప్తి చేసినట్టు సమాచారం. అయితే ఈ విషయం తన పరిధిలో లేదని జల శక్తి శాఖ పరిధిలో ఉంది కాబట్టి అక్కడ చర్చించాలని ఆర్థికమంత్రి త‌ప్పుకున్నారు. కానీ జల శక్తి మంత్రిత్వ శాఖ మాత్రం లెక్కలు చెప్పాల్సిందేనని ఇది మీ రాష్ట్రానికి ఒక రకంగా.. వేరే రాష్ట్రానికి మరోరకంగా చేసే పరిస్థితి లేదని తాజాగా పంపిన లేఖలో స్పష్టం చేశారు.

`థిస్ ఈజ్‌ మాండేటరీ` అని పేర్కొనడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టారనే చెప్పాలి. మరోవైపు పోలవరం నిధులపై గత వారం రోజులుగా చర్చ అయితే నడుస్తోంది. 1850 కోట్ల రూపాయలను ఏం చేశారన్నది ప్రభుత్వానికి తెలిసినప్పటికీ.. బయటికి చెప్పడానికి మాత్రం ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టుకు నిధుల వివాదం తారస్థాయికి చేరింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది చూడాలి.

Tags:    

Similar News