పెరప్లెక్సిటీ సంచలనం: గూగుల్ క్రోమ్ కోసం భారీ ఆఫర్!

ప్రపంచ సాంకేతిక రంగంలో ఇటీవల కాలంలో అత్యంత ఆసక్తికరమైన చర్చకు తెరలేపింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) స్టార్టప్ పెరప్లెక్సిటీ (Perplexity).;

Update: 2025-08-14 06:38 GMT

ప్రపంచ సాంకేతిక రంగంలో ఇటీవల కాలంలో అత్యంత ఆసక్తికరమైన చర్చకు తెరలేపింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) స్టార్టప్ పెరప్లెక్సిటీ (Perplexity). ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ఉపయోగించే వెబ్ బ్రౌజర్ అయిన గూగుల్ క్రోమ్ ను కొనుగోలు చేసేందుకు పెరప్లెక్సిటీ ఏకంగా $34.5 బిలియన్లు (సుమారు ₹2.88 లక్షల కోట్లు) ఆఫర్ చేసింది. ఈ మొత్తం పెరప్లెక్సిటీ ప్రస్తుత మార్కెట్ విలువ కంటే ఎక్కువ కావడం విశేషం.

పెరప్లెక్సిటీకి పెట్టుబడిదారుల మద్దతు

బ్లూమ్‌బర్గ్ కథనం ప్రకారం.. ఈ బంపర్ డీల్‌ను పూర్తి చేయడానికి పెరప్లెక్సిటీ బయట పెట్టుబడిదారుల నుంచి ఆర్థిక సహాయం పొందనుంది. ఇప్పటికే కొంతమంది పెట్టుబడిదారులు ఫైనాన్స్ చేయడానికి అంగీకరించినట్లు కంపెనీ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ దిమిత్రి షెవెలెంకో తెలిపారు. ఇటీవల జూలైలో $100 మిలియన్లను సమీకరించిన పెరప్లెక్సిటీ, తన కంపెనీ విలువను ₹1.57 లక్షల కోట్లుగా అంచనా వేసింది. అయితే, క్రోమ్ కొనుగోలు కోసం ప్రతిపాదించిన మొత్తం ఈ విలువను మించి ఉంది.

- క్రోమ్ భవిష్యత్తుపై పెరప్లెక్సిటీ హామీలు

ఈ ఒప్పందం విజయవంతమైతే క్రోమ్ యొక్క ప్రధాన ఇంజిన్ అయిన క్రోమియం (Chromium) ను ఓపెన్ సోర్స్‌గా కొనసాగిస్తామని పెరప్లెక్సిటీ హామీ ఇచ్చింది. అంతేకాకుండా, క్రోమ్‌పై సంవత్సరానికి సుమారు $3 బిలియన్ల పెట్టుబడులు పెడతామని కూడా ప్రకటించింది. క్రోమ్‌ను దాని అసలు పేరుతోనే కొనసాగిస్తామని, బ్రాండ్‌ను మార్చబోమని స్పష్టం చేసింది. అయితే, డిఫాల్ట్ సెర్చ్ ఇంజిన్గా పెరప్లెక్సిటీని ఉపయోగిస్తామని మాత్రం పేర్కొనలేదు.

- గూగుల్‌పై గుత్తాధిపత్య ఆరోపణలు

గూగుల్ తన గుత్తాధిపత్యాన్ని కాపాడుకోవడానికి యాపిల్, శామ్‌సంగ్ వంటి కంపెనీలకు భారీ మొత్తాలు చెల్లిస్తూ తమ డివైజ్‌లలో గూగుల్ సెర్చ్‌ను డిఫాల్ట్‌గా ఉంచేలా ఒప్పందాలు చేసుకుందని ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఈ ఆరోపణల నేపథ్యంలో అమెరికా జస్టిస్ డిపార్ట్‌మెంట్‌తో పాటు పలు రాష్ట్ర ప్రభుత్వాలు కోర్టును ఆశ్రయించాయి. దీని ఫలితంగా, అమెరికా ప్రభుత్వం గూగుల్ క్రోమ్‌ను విక్రయించాలన్న సిఫార్సులతో పాటు సెర్చ్ డేటాను పోటీదారులకు లైసెన్స్ ఇవ్వాలని, ప్రచార చెల్లింపులు ఆపాలని ఆదేశించింది.

-పెరప్లెక్సిటీ ఓనర్ భారతీయ మూలాలున్న అరవింద్ శ్రీనివాస్

పెరప్లెక్సిటీ అనేది AI ఆధారిత సెర్చ్ ఇంజిన్. ఇది చాట్‌జీపీటీ తరహా యాప్‌గా ఇప్పటికే 10 కోట్లకు పైగా యూజర్లను కలిగి ఉంది. 2026 నాటికి వందల కోట్ల యూజర్లను చేరుకోవడమే ఈ కంపెనీ లక్ష్యం. ఈ కంపెనీ వ్యవస్థాపకుల్లో ఒకరైన అరవింద్ శ్రీనివాస్ భారతదేశంలోని చెన్నైకి చెందినవారు. 31 ఏళ్ల అరవింద్ ప్రస్తుతం పెరప్లెక్సిటీకి CEOగా కూడా వ్యవహరిస్తున్నారు. భారతీయ మూలాలున్న ఒక యువకుడు ప్రపంచ సాంకేతిక రంగంలో ఇంతటి సంచలనం సృష్టించడం గర్వకారణం.

ఈ భారీ ఒప్పందం వాస్తవరూపం దాలుస్తుందో లేదో తెలియదు, కానీ పెరప్లెక్సిటీ పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతోంది.

Tags:    

Similar News