పవన్ పై పేర్ని పంచులు.. పవర్ స్టార్ సినిమాలపై సెటైర్లు
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పై మాజీ మంత్రి పేర్ని నాని పంచు డైలాగులు పేల్చుతున్నారు.;
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పై మాజీ మంత్రి పేర్ని నాని పంచు డైలాగులు పేల్చుతున్నారు. పవర్ స్టార్ సినిమాలు బాక్సాఫీసు ముందు ఢమాల్ అంటూ సెటైర్లు వేస్తున్నారు. డిప్యూటీ సీఎం వర్సెస్ తెలంగాణ మధ్య మొదలైన లొల్లిలోకి తాజాగా పేర్ని ఎంటర్ అయ్యారు. మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడిన పేర్ని.. రాజోలు పర్యటనలో పవన్ చేసిన దిష్టి వ్యాఖ్యలపై తనదైన స్టైల్ లో విమర్శలు చేశారు. అంతేకాకుండా తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలను ఉటంకిస్తూ పవన్ సినిమాలపైనా హేళనగా మాట్లాడి.. ఉప ముఖ్యమంత్రి సినిమాలకు పెద్ద సీను లేదని తేల్చేశారు పేర్ని.
రాజోలు పర్యటనలో ఉప ముఖ్యమంత్రి పవన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఉభయ రాష్ట్రాల్లో దుమారం రేపుతున్నాయి. పవన్ మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారని జనసేన నేతలు వివరణ ఇస్తున్నా.. తెలంగాణలోని కాంగ్రెస్ నేతలు.. ఏపీలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలో వైసీపీ నేత పేర్ని చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన పేర్ని.. కోనసీమలో కొబ్బరి చెట్లు తలలు వాల్చేయడంపై ఉప ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలను తప్పుబట్టారు.
పవన్ ఉప ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడారా? లేదా? అన్న విషయంపై క్లారిటీ కావాలని డిమాండ్ చేశారు. మంత్రగాడిలా వేషాలు వేసుకుని మాట్లాడితే తానేమీ చేయలేనని వ్యాఖ్యానించిన పేర్ని.. పవన్ ఉప ముఖ్యమంత్రిగా అలా మాట్లాడకూడదని వ్యాఖ్యానించారు. కొబ్బరి చెట్లు తలలు ఎందుకు వాల్చేసేయో తెలుసుకోవాలంటే నిపుణులతో పరీక్షలు జరిపించాలి కదా? అంటూ ప్రశ్నించారు. అంతేకాని ఎవరో దిష్టి పెట్టడం ఏంటి? అంటూ వ్యాఖ్యానించారు. ఇక పవన్ సినిమాలు ఆడనిచ్చేది లేదన్న తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యలపైనా పేర్ని స్పందించారు.
‘‘నేను ఇందాకే ఒక స్టేట్మెంట్ చూశాను. ఆయనెవరయ్యా బాబూ సినిమాటోగ్రఫీ మంత్రి అంట. ఆయన సినిమాలను రెండు మూడు రోజులు కూడా ఆడనివ్వం అంటున్నారు. మీ పిచ్చిగాని ఆయన సినిమాలు మ్యాట్నీకే ఎత్తేశారు. ఉదయం షోతోనే సరి.. మ్యాట్నీ పడటమే కష్టం కదా? మీరు ఎందుకు కష్టపడతారు. మీరు ఎందుకు ఆపడం? ఆయన సినిమాలను జనమే చూడటం మానేశారు’’ అంటూ సెటైర్లు పేల్చారు పేర్ని.
ఇక పవన్ సినిమాను కొన్న ఎగ్జిబిటర్లు, డిస్టిబ్యూటర్లు బికారులైపోయారని పేర్ని వ్యాఖ్యానించారు. పవన్ సినిమాలను నిర్మించిన వారు ప్రభుత్వానికి జీఎస్టీ కూడా కట్టలేదని ఆరోపించారు. ప్రభుత్వం కూడా జీఎస్టీ కట్టమని అడగలేదని చెప్పారు. వేరే ఎవరైనా ఊరు కుంటారా? అంటూ నిలదీశారు. సినిమాలు కొనుక్కున్న వారంతా పాపరైపోయారు? అలాంటి వాళ్ల సినిమాలను మంత్రి వచ్చి ఆపాలా? అంటూ పేర్ని తనదైన స్టైలులో సెటైర్లు వేశారు.