దిష్టి తగిలింది పవన్ పదవికే సుమా !
దిష్టి అన్నది మూఢ నమ్మకం అని అంటున్నారు. సనాతన ధర్మం అని అంటున్నారు.;
దిష్టి అన్నది మూఢ నమ్మకం అని అంటున్నారు. సనాతన ధర్మం అని అంటున్నారు. ఇవన్నీ పక్కన పెడితే దిష్టి అన్నది నమ్మే జనాలు ఉన్నారు. దాని వెనక సిద్ధాంతం ఏమిటి అన్నది పక్కన పెడితే రాజకీయ రాద్ధాంతానికి మాత్రం ఈ దిష్టి బాగా ఉపయోగపడుతుంది అని అంటున్నారు. పవన్ జనసేన అధినేతగా ఉన్నారు. ఆయన వెండి తెర మీద హీరో కూడా. ఆయనకు పవర్ స్టార్ అన్న బిరుదు కూడా ఉంది. పవన్ రాజకీయాల్లోకి వచ్చినపుడు చాలా మంది లైట్ తీసుకున్నారు. ఆయన ఎన్నాళ్ళు ఉంటారు అని కూడా భావించారు.
అక్కడే గట్టిగా :
అయితే 2014 ఎన్నికల ముందు ఒక విధంగా పార్టీ పెట్టిన పవన్ తొలి అయిదేళ్ళూ ఎన్నికల రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఆయన పార్టీని నడుపుతారా అన్న సందేహాలను అందరూ వ్యక్తం చేశారు. అయితే తన కమిట్ మెంట్ ఏంటో పవన్ చూపించారు. 2019 దాకా పార్టీ బండి లాగి పోటీ చేసారు. అది కూడా ఆరేడు శాతం ఓటు షేర్ సాధించే విధంగా. అయితే పవన్ పోటీ చేసిన రెండు చోట్లా ఓటమి పాలు అయ్యారు. దాంతో అక్కడితో ఆయన రాజకీయానికి ఫుల్ స్టాప్ పడుతుందని కూడా సందేహకారులు అంతా భావించారు. కానీ అది రివర్స్ అయింది. పవన్ 2024 దాకా పార్టీని ఇంకా పవర్ ఫుల్ గా నడిపారు. అది ఎంతదాకా అంటే కేంద్రంలో బలమైన బీజేపీ ఏపీలో స్ట్రాంగ్ గా ఉన్న టీడీపీతో కలిపి పొత్తులు పెట్టుకుని కూటమి కట్టేదాకా. అది సూపర్ డూపర్ హిట్ అయి 2024లో ఏపీలో ప్రభుత్వం వచ్చింది. ఆ వెంటనే పవన్ ఉప ముఖ్యమంత్రి అయిపోయారు. ఏణ్ణర్థం కాలంగా ఆయన ఆ హోదాలో కొనసాగుతున్నారు.
ఆడిపోసుకునేది అలా :
ఇక పవన్ కి ప్రత్యర్ధులు చాలా మందే ఉన్నారు. వారంతా గతంలో రెండు చోట్ల ఓడిపోయారు అని అంటూ వచ్చారు. ఇపుడు ఒంటరిగా గెలవలేక పొత్తులతో అధికారంలోకి వచ్చారు అని అంటున్నారు. అదే సమయంలో మాటకు ముందూ వెనకా డిప్యూటీ సీఎం పదవిని అందుకున్నారని అక్కసుతో కూడిన అసూయతో మాట్లాడుతున్నారని జనసేన వర్గాల భావనగా ఉంది. ఒక నాయకుడు అయితే పరోక్షంగా ఏమీ తెలియకుండా కొందరు ఉప ముఖ్యమంత్రులు అయిపోతున్నారని సెటైర్లు వేశారు. మరి కొందరు అయితే ఇంకా సినీ నటుడే అన్నట్లుగా మాట్లాడుతున్నారు. ఒక పెద్దాయన అయితే ఆయన్ని ఉప ముఖ్యమంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
అసలు సమస్య అదేనా :
చూడబోతే పవన్ పదవికే దిష్టి వచ్చిందా అన్న చర్చ కూడా సాగుతోంది. ఆయన ఉప ముఖ్యమంత్రిగా కాదు రాజకీయాలకు పనికిరాడని అనడం వెనక ఆంతర్యమేంటి అన్న మాట ఉంది. ఏది ఏమైనా ఒక్కోసారి పదవులకు కూడా దిష్టి తగులుతూ ఉంటుంది. 1983లో బంపర్ విక్టరీ కొట్టిన అన్న గారికి ఆ దిష్టి తగిలే ఏణ్ణర్థం వ్యవధిలో వెన్నుపోటుకు గురి అయ్యారు అని చెబుతారు. పవన్ కూడా సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన వారు. ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. అంటే మా హీరో సీఎం అవుతారని కూడా అభిమానులు ఆశపడడమూ ఉంది. ఈ నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రిగా ప్రభుత్వ ప్రోటోకాల్ తో అధికార దర్జాతో సాగుతున్న పవన్ మీద దిష్టి కన్ను పడిందా అంటే ఆలోచించాల్సిందే అన్న మాట వినిపిస్తోంది.