ఓటు వేయలేదు.. పైసలు తిరిగి ఇచ్చేయండి బాస్
ప్రతిష్ఠాత్మకంగా సాగిన జూబ్లీహిల్స్ ఉపపోరులో కీలక అంకమైన పోలింగ్ ముగియటం.. ఫలితం కోసం ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే.;
ప్రతిష్ఠాత్మకంగా సాగిన జూబ్లీహిల్స్ ఉపపోరులో కీలక అంకమైన పోలింగ్ ముగియటం.. ఫలితం కోసం ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. రేపు (శుక్రవారం’ ఈ ఉపపోరు ఫలితం వెలువడనుంది. ఉదయం తొమ్మిది గంటల సమయానికి ట్రెండ్ ఎలా ఉందన్నది అర్థమయ్యే పరిస్థితి. మరి పోటాపోటీగా సాగితే తప్పించి.. మామూలుగా అయితే 11.30 గంటల సమయానికి గెలుపు ఎవరిదన్న విషయంపై క్లారిటీ వచ్చేసే పరిస్థితి.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో విజయం కోసం ప్రధాన రాజకీయ పార్టీలు పడిన శ్రమ అంతా ఇంతా కాదు. డబ్బులకు వెనుకాడకుండా భారీగా ఖర్చుపెట్టేయటం తెలిసిందే. ఓటరుకు రూ.2500 చొప్పున పంచేయటమే కాదు.. పట్టుచీరను కూడా నజరానాగా ఇవ్వటం తెలిసిందే. భారీగా సాగిన ఓట్ల కొనుగోలు నేపథ్యంలో గతానికి భిన్నంగా భారీ ఎత్తున పోలింగ్ జరుగుతుందని ఆశించారు.
అందుకు భిన్నంగా ఎప్పటిలానే పోలింగ్ శాతాలు నమోదయ్యాయి. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల వేళ నమోదైన ఓట్లతో పోలిస్తే.. సుమారు ఒక శాతం పోలింగ్ పెరిగినట్లు చెబుతున్నా.. పెరిగిన ఓట్ల సరాసరితో పోలిస్తే.. అదేమంత పెద్ద పెరుగుదల కాదన్న మాట వినిపిస్తోంది. హోరాహోరీగా సాగిన ఉప ఎన్నికల్లో గెలుపు కోసం భారీగా ఖర్చు పెట్టిన పార్టీలు.. ఇప్పుడు పోలింగ్ సరిగా కాని నేపథ్యంలో.. తాము డబ్బులు పంచిన వాళ్లలో ఎవరు ఓటు వేయలేదన్న విషయాన్ని గుర్తించే పనిలో పడ్డారు.
బూత్ ఇంఛార్జులుగా వ్యవహరిస్తున్న వారు.. ఓటు వేయాలంటూ డబ్బులు పంచిన వారు కలిసి.. ఏ కాలనీలో.. ఏ అపార్టుమెంట్ లో ఓటు పడింది? ఎవరు ఓటు వేయలేదన్న విషయంపై ఆరా తీయటం షురూ చేశారు. ఎవరైతే ఓటు వేయలేదో.. వారంతా తాము ఇచ్చిన డబ్బులు తిరిగి ఇచ్చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇలా వసూలు చేసిన డబ్బుల్ని ఆయా పార్టీల అభ్యర్థుల కోసం కాకున్నా..డబ్బులు తీసుకొని మరీ బాధ్యత లేకుండా వ్యవహరించిన వారు డబ్బులు ఎలా తీసుకుంటారని ప్రశ్నిస్తున్నారు.
ఇంతకూ డబ్బులు తీసుకొని ఓటు వేయలేదన్న విషయాన్ని ఎలా గుర్తిస్తారు? అన్న విషయంలోకి వెళితే.. పోలింగ్ వేళ అభ్యర్థి తరఫున ఏజెంట్ గా కూర్చున్న వ్యక్తి ఓటేసేందుకు వచ్చిన వారిని గురతించి.. ఓటరు లిస్టులో పేరును రౌండ్ చేసుకుంటారు. ఇలా ఏజెంట్ వద్ద ఉన్న ఓటేసిన వారి జాబితా.. పోలింగ్ కు ముందు ఓటరు లిస్టు ఆధారంగా డబ్బులు పంచిన లిస్టును సరి చూసుకోవటం ద్వారా.. పైసలు తీసుకొని ఓటు వేయని వారిని గుర్తించారు.
ఉదాహరణకు ఎస్పీఆర్ హిల్స్ లోని ఒక ఇంట్లో 18 ఓట్లకు రూ.45 వేలు తీసుకోగా.. అందులో నాలుగు ఓట్లు మాత్రమే పోలైనట్లుగా గుర్తించారు. దీంతో.. మిగిలిన 14 ఓట్లకు తామిచ్చిన డబ్బుల్ని తిరిగి ఇవ్వాలంటూ ఆ ప్రాంతానికి పైసలు పంచిన పార్టీ ఇంఛార్జికి సమాచారం ఇచ్చారు. వారు.. వెళ్లి ఆ ఇంట్లోని వారిని ప్రశ్నించి.. డబ్బులు తిరిగి ఇచ్చేస్తే.. అపార్టెమంట్ అసోసియేషన్ కు చందా కింద రాసి ఇస్తామని పేర్కొంటున్నారు.
బస్తీల్లో అయితే.. స్థానిక ఇంఛార్జిగా ఉన్న వ్యక్తిని ఆ డబ్బులు వసూలు చేసుకొని తీసుకోవాలని చెప్పినట్లుగా తెలుస్తోంది. ఇలా ఓటు వేయని వారిని గుర్తించే వైనం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఒక రకంగా చూస్తే.. డబ్బులు తీసుకొని మరీ ఓటు వేయని వారు ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోవటమే మంచిదన్న మాట వినిపిస్తోంది. అలా అని డబ్బులు తీసుకొని ఓటు వేసే విధానానికి మేం వ్యతిరేకమన్న విషయాన్ని మర్చిపోవద్దు.