భజన భజన... పాక్ పెద్దలపై ట్రంప్ పొగడ్తల వర్షం!

గతం మరిచిపోయో ఏమో తెలియదు కానీ గత కొంతకాలంగా పాకిస్థాన్ తో తెగ రాసుకు పూసుకు తిరిగేస్తున్నారు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్.;

Update: 2025-10-26 09:30 GMT

గతం మరిచిపోయో ఏమో తెలియదు కానీ గత కొంతకాలంగా పాకిస్థాన్ తో తెగ రాసుకు పూసుకు తిరిగేస్తున్నారు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్. ఈ క్రమంలో పాక్ ఆర్మీ చీఫ్ కు ప్రత్యేక విందు ఇస్తున్నారు.. పాక్ ప్రధానితో కలిసి తిరుగుతున్నారు.. అంతర్జాతీయ వేదికలమీద అడిగిమరీ పొగిడించుకుంటున్నారు. ఈ క్రమంలో ట్రంప్ కూడా భజన మొదలుపెట్టడం గమనార్హం!

అవును... ఇజ్రాయెల్‌ - హమాస్‌ ల యుద్ధం ముగింపునకు సంబంధించి ఈజిప్టులో శాంతి ఒప్పందం జరిగిన సందర్భంగా ట్రంప్ ని ఉద్దేశించి ప్రసంగించిన పాకిస్థాన్ ప్రధాని షరీఫ్... తన ఐదు నిమిషాల ప్రసంగంలో ట్రంప్ పై పొగడ్తల వర్షం కురిపించారు. ఇందులో భాగంగా... అధ్యక్షుడు ట్రంప్‌ నేతృత్వంలో అవిశ్రాంత ప్రయత్నాల తర్వాత గాజాలో శాంతి సాధన అయ్యిందని అన్నారు.

ఇదే సమయంలో.. ట్రంప్‌ ఈ ప్రపంచాన్ని శాంతి, శ్రేయస్సుతో జీవించేలా చేసేందుకు అవిశ్రాంతంగా కృషి చేశారని కొనియాడుతూ... శాంతిని పెంపొందించడానికి ట్రంప్ చేసిన అద్భుతమైన, అసాధారణ కృషికి గుర్తింపుగా.. పాకిస్తాన్ ఆయనను నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేసింది. ఆయన ప్రేమకు మనం చేయగలిగినది ఇదేనని నేను భావిస్తున్నాను అని అన్నారు.

ఇప్పుడు ట్రంప్ వంతు..!:

ఓ పక్క అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై పాక్ ప్రధాని, ఆర్మీ చీఫ్ మునీర్ లు పొగడ్తల వర్షాలు కురిపిస్తోన్న వేళ.. ఆదివారం పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, సైన్యాధిపతి అసిమ్ మునీర్‌ లను డొనాల్డ్ ట్రంప్ ప్రశంచించారు. ఇందులో భాగంగా వారిరువురూ గొప్ప వ్యక్తులు అని అన్నారు. ఇదే సమయంలో.. పాకిస్తాన్ - ఆఫ్గనిస్తాన్ వివాదాన్ని త్వరగా పరిష్కరిస్తానని ప్రతిజ్ఞ చేశారు.

మలేషియాలోని కౌలాలంపూర్‌ లో జరిగిన ఆసియాన్ శిఖరాగ్ర సమావేశానికి హాజరైన సందర్భంగా థాయిలాండ్ - కంబోడియా శాంతి ఒప్పందంపై సంతకం చేసిన సమయంలో ట్రంప్ మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడిన ట్రంప్.. తన పరిపాలనలోని ఎనిమిది నెలల్లో ముగించిన ఎనిమిది యుద్ధాలలో ఇది (థాయ్ - కంబోడియా మధ్య ఘర్షణ) ఒకటి అని అన్నారు.

ఈ నేపథ్యంలోనే... 'పాకిస్తాన్ – ఆఫ్గనిస్తాన్ మధ్య ఘర్షణలు ప్రారంభమయ్యాయని విన్నప్పటి నుంచి దాన్ని ఆపడం మిగిలి ఉందని భావిస్తున్నాను.. నేను దానిని చాలా త్వరగా పరిష్కరిస్తాను.. నాకు వారిద్దరూ తెలుసు.. పాకిస్తాన్ ఫీల్డ్ మార్షల్, ప్రధాన మంత్రి గొప్ప వ్యక్తులు, మేము దానిని త్వరగా పూర్తి చేయబోతున్నాం అనడంలో నాకు ఎటువంటి సందేహం లేదు' అని ట్రంప్ అన్నారు.

ఇదే ఫస్ట్ టైమ్ కాదు..!:

పాకిస్థాన్ ప్రధాని, ఆర్మీ చీఫ్ లపై పొగడ్తల వర్షం కురిపించడం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు ఇదే తొలిసారి కాదు. ఈ ఏడాది సెప్టెంబర్‌ లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ కోసం అమెరికాలో ఉన్నప్పుడు పాకిస్తాన్ ప్రధాని.. ట్రంప్‌ ను వైట్‌ హౌస్‌ లో కలిశారు. వారి సమావేశానికి ముందు ట్రంప్ విలేకరులతో మాట్లాడుతూ వారిని తెగ ప్రశంసించారు.

ఇందులో భాగంగా.. "వాస్తవానికి, మనకు ఒక గొప్ప నాయకుడు వస్తున్నారు.. పాకిస్తాన్ ప్రధాన మంత్రి వస్తున్నారు.. పాకిస్తాన్ ఫీల్డ్ మార్షల్ వస్తున్నారు.. ఫీల్డ్ మార్షల్ చాలా గొప్ప వ్యక్తి.. ప్రధాన మంత్రి కూడా అంతే.. వారు వస్తున్నారు.." అని చెప్పుకొచ్చారు. మరోవైపు, అసిమ్ మునీర్ ఈ సంవత్సరం రెండుసార్లు వాషింగ్టన్ కు వెళ్లారు.

Tags:    

Similar News