సామాన్యులే గెలుపు గుర్రాలు: పనిమనిషి నుంచి ఎమ్మెల్యే వరకు.. ప్రజాస్వామ్య పండుగలో నవశకం!

భారత ప్రజాస్వామ్య చరిత్రలో అప్పుడప్పుడు కొన్ని ఎన్నికలు ప్రజల నాడిని.. మారుతున్న రాజకీయ ముఖచిత్రాన్ని స్పష్టంగా ఆవిష్కరిస్తాయి.;

Update: 2026-05-06 00:30 GMT

భారత ప్రజాస్వామ్య చరిత్రలో అప్పుడప్పుడు కొన్ని ఎన్నికలు ప్రజల నాడిని.. మారుతున్న రాజకీయ ముఖచిత్రాన్ని స్పష్టంగా ఆవిష్కరిస్తాయి. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు సరిగ్గా ఇదే విషయాన్ని నిరూపించాయి. "రాజకీయం అంటే కోట్లు ఖర్చు చేసేవారికి, వారసత్వ బలం ఉన్నవారికి మాత్రమే సొంతం" అనే పాతకాలపు అభిప్రాయాన్ని ఓటర్లు బద్దలు కొట్టారు. సామాన్యుడి కష్టానికి, నిజాయితీకి పట్టం కడుతూ.. ఈసారి అసెంబ్లీ మెట్లెక్కించిన తీరు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

బెంగాల్ గడ్డపై కవితా మాఝీ సంచలనం

పశ్చిమ బెంగాల్‌లోని ఔస్ గ్రామ్ నియోజకవర్గం నుంచి గెలుపొందిన కవితా మాఝీ ప్రయాణం సినిమా కథను తలపిస్తుంది. 2021 వరకు ఆమె ఒక సాధారణ ఇళ్లలో పనిచేసే పనిమనిషి. పూట గడవడమే కష్టమైన స్థితిలో ఉన్న ఆమె.. ఒక రాజకీయ చర్చ సందర్భంగా వెలిబుచ్చిన అభిప్రాయాలు ఆమె జీవితాన్ని మార్చేశాయి. 2021లో తొలిసారి పోటీ చేసి ఓడిపోయినా పట్టు వదలని విక్రమార్కుడిలా ప్రజల మధ్యే ఉన్నారు. ఈ ఎన్నికల్లో టీఎంసీ వంటి బలమైన ప్రత్యర్థిని 12,535 ఓట్ల తేడాతో ఓడించి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆమె సాధించిన విజయం కేవలం ఒక వ్యక్తి గెలుపు కాదు, కష్టపడే ప్రతి సామాన్యుడి నమ్మకానికి నిదర్శనం. ప్రస్తుతం ఆమెకు మంత్రి పదవి దక్కుతుందన్న ప్రచారం సాగుతుండటం విశేషం.

ఆటో నడుపుతూ అసెంబ్లీ మెట్ల వరకు..

తమిళనాడులో ఈసారి ఎన్నికల ఫలితాలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. ముఖ్యంగా టీవీకే అధినేత విజయ్ అనుసరించిన వ్యూహం సామాన్యులకు పెద్దపీట వేసింది. రోయపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన విజయ్ ధాము ఒక సాధారణ ఆటో డ్రైవర్. పార్టీ అధినేత ఆయనలోని నిబద్ధతను గుర్తించి టికెట్ ఇవ్వడమే కాకుండా ఎన్నికల ఖర్చులను కూడా పార్టీయే భరించింది. రోజూ ప్రయాణికులను చేరవేసే ఆటో డ్రైవర్, నేడు తన నియోజకవర్గ ప్రజల ఆకాంక్షలను అసెంబ్లీకి చేరవేసే స్థాయికి ఎదిగారు.

డ్రైవర్ కుమారుడి ధీరత్వం

అదే పార్టీకి చెందిన శబరి నాథన్ విజయం కూడా ఎంతో స్ఫూర్తిదాయకం. ఆయన తండ్రి రాజేంద్రన్ ఒక సాధారణ కారు డ్రైవర్. విరుగంబాక్కం వంటి కీలక నియోజకవర్గంలో ఒక డ్రైవర్ కుమారుడికి టికెట్ ఇవ్వడంపై మొదట్లో ప్రత్యర్థులు విమర్శలు గుప్పించారు. అయితే ఆ విమర్శలనే మెట్లుగా మార్చుకున్న శబరి నాథన్.. క్షేత్రస్థాయిలో యువతను, శ్రామిక వర్గాలను ఏకం చేసి భారీ విజయాన్ని అందుకున్నారు. సామాన్య నేపథ్యం ఉన్న యువకులు చట్టసభల్లోకి వస్తేనే ప్రజల నిజమైన సమస్యలు పరిష్కారమవుతాయని ఆయన విజయం చాటిచెప్పింది.

ప్రజాస్వామ్యంలో కొత్త మలుపు

మహారాష్ట్రలో ఏకనాథ్ షిండే ఆటో డ్రైవర్ నుంచి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన చరిత్ర మన ముందున్నా, ఈ 2026 ఎన్నికలు సామాన్యుల ప్రాతినిధ్యాన్ని మరో మెట్టు ఎక్కించాయి. డబ్బు, అంగబలం కంటే ప్రజాబలమే మిన్న అని ఈ ఫలితాలు స్పష్టం చేశాయి.

ఓటు ఆయుధమైతే.. సామాన్యుడు సైనికుడవుతాడు

ఈ ఎన్నికల్లో గెలిచిన సామాన్యులు కేవలం ప్రతినిధులు మాత్రమే కాదు, మార్పుకు చిహ్నాలు. పనిమనిషిగా ఇల్లు ఊడ్చిన చేతులు ఇప్పుడు చట్టాలు చేసే స్థాయికి రావడం, ఆటో నడిపిన చేతులు అసెంబ్లీలో ప్రజా సమస్యలపై గళం విప్పడం ప్రజాస్వామ్యానికి లభించిన గొప్ప గౌరవం. దేశ రాజకీయాల్లోకి రావాలనుకునే సామాన్యులకు, యువతకు వీరి ప్రయాణం ఒక దిక్సూచిలా నిలుస్తుంది.

Tags:    

Similar News