జకీర్ నాయక్ కు ఆ దేశంలో నో ఎంట్రీ.. కారణం ఏంటి..?

మతం ఏదైనా అది మనిషిని మనిషే కాదు.. ప్రతీ జీవిని ప్రేమించేదిగా ఉండాలి. వీలైతే మంచి చెయ్ లేదంటే ఎలాంటి పని చేయకుండా కూర్చిండిపో కానీ ఇతరులను ఇబ్బంది మాత్రం పెట్టద్దు.;

Update: 2025-11-05 06:48 GMT

మతం ఏదైనా అది మనిషిని మనిషే కాదు.. ప్రతీ జీవిని ప్రేమించేదిగా ఉండాలి. వీలైతే మంచి చెయ్ లేదంటే ఎలాంటి పని చేయకుండా కూర్చిండిపో కానీ ఇతరులను ఇబ్బంది మాత్రం పెట్టద్దు. కానీ కొందరు ఒక మతం పేరు చెప్పి రెచ్చగొడుతూ తీవ్రవాదం, ఉగ్రవాదాన్ని చాపకింద నీరులా విస్తరిస్తారు. అలాంటి వ్యక్తే జకీర్ నాయక్. ఆయన అంతర్జాతీయ ఉగ్రవాదం, విద్వేష బోధనలతో సంబంధం ఉన్న మత ప్రవచన కారుడు. అందుకే భారత్ ఆయనకు ఎప్పుడో అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. అప్పటి నుంచి ఆయన తప్పించుకొని తిరుగుతున్నాడు. భారత్ పొరుగు దేశంలో ఉంటూ భారత్ లో కల్లోలం సృష్టించాలని చూస్తున్నాడు.

ఈయన మరోసారి వార్తల్లో నిలిచాడు. ఈ సారి ఆయన పర్యటన కాదు. ఆ పర్యటనకు నిరాకరణే ఒక వార్తగా మారింది. బంగ్లాదేశ్‌లోకి జకీర్‌ ప్రవేశాన్ని తాత్కాలిక ప్రభుత్వం నిషేధించింది. ఇటీవల అంతర్జాతీయ మీడియా వర్గాలు ఆయన బంగ్లాదేశ్‌ పర్యటనపై కథనాలు ప్రచురించగా.. ఢాకా ప్రభుత్వం ‘అతనికి నో ఎంట్రీ’ నిర్ణయాన్ని తీసుకుంది.

తాత్కాలిక ప్రభుత్వ కఠిన నిర్ణయం

బంగ్లాదేశ్‌లో మంగళవారం జరిగిన లా అండ్‌ ఆర్డర్‌ కోర్‌ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అక్కడి మీడియా పేర్కొంది.

హోం మంత్రిత్వశాఖ నేతృత్వంలో జరిగిన ఆ సమావేశంలో, జకీర్‌ నాయక్‌ దేశంలోకి వస్తే ఆయన సమావేశాలకు భారీగా జన సమీకరణ జరుగుతుందని, పరిస్థితి నియంత్రణకు పెద్ద బలగాలు అవసరమవుతాయని అధికారులు అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం అంతటి భద్రతా ఏర్పాట్లు చేయడం సాధ్యం కాదని, అందువల్ల ఆయన పర్యటనకు అనుమతి ఇవ్వడం అసాధ్యం అని తేల్చారు. ఈ నిర్ణయంతో బంగ్లాదేశ్‌ మరోసారి ఉగ్రవాద ప్రచారాలపై తన కఠిన వైఖరిని స్పష్టంచేసింది.

భారత్‌ సూచనను పట్టించుకుందా..?

జకీర్‌ నాయక్‌ బంగ్లాదేశ్‌ పర్యటనపై భారత విదేశాంగ మంత్రిత్వశాఖ చేసిన వ్యాఖ్యలను బంగ్లా విదేశాంగ ప్రతినిధి ఎస్‌ఎం మహబూబుల్‌ ఆలం గుర్తు చేశారు. ‘భారత్‌తో సహా ఏ దేశం పారిపోయిన నిందితులకు లేదా ఉగ్రవాద ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులకు ఆశ్రయం ఇవ్వకూడదు.’ అని వ్యాఖ్యానించారు. ఇది 2 దేశాల మధ్య ఉగ్రవాదంపై ఉన్న పరస్పర అవగాహన, భద్రతా భాగస్వామ్యానికి సూచికగా మారింది.

ఢాకా బేకరీ దాడి తర్వాత జకీర్‌పై ఉగ్రవాద ముద్ర

జకీర్‌ నాయక్‌ పేరు 2016, జులైలో జరిగిన ఢాకా హోలీ ఆర్టిజన్‌ బేకరీ ఉగ్రదాడి తర్వాత అంతర్జాతీయ దృష్టిలో పడింది. ఆ దాడిలో ఒక ఉగ్రవాది, తనను ‘జకీర్‌ నాయక్‌ యూట్యూబ్‌ బోధనలతో ప్రభావితుడినని’ ఒప్పుకున్నాడు. అందుతోనే భారత్‌లో ఆయనపై విద్వేష ప్రసంగాలు, మనీలాండరింగ్‌, ఉగ్రవాద ప్రేరేపణ కేసులు నమోదయ్యాయి. అరెస్టు భయంతో జకీర్‌ మలేసియాకు పారిపోయి తలదాచుకున్నాడు. భారత్‌ ఆయనను వాంటెడ్‌గా ప్రకటించి, రెడ్‌ కార్నర్‌ నోటీసు జారీ చేసింది.

వివాదాస్పద పర్యటన వార్తలపై అప్రమత్తత

ఇటీవల అంతర్జాతీయ మీడియా వర్గాలు జకీర్‌ నవంబర్‌ 28 నుంచి డిసెంబర్‌ 20 వరకు బంగ్లాదేశ్‌ పర్యటనలో ఉంటారని వార్తలు ప్రచురించాయి. అయితే బంగ్లాదేశ్‌ ప్రభుత్వం వాటిని ఖండిస్తూ, ‘అతనికి ఎలాంటి అధికారిక అనుమతీ లేదు’ అని స్పష్టం చేసింది. తమ దేశంలో సామాజిక శాంతి, మత సామరస్యాన్ని భంగం చేసే వ్యక్తులకు స్థానం ఉండదని హోం మంత్రిత్వశాఖ స్పష్టంగా ప్రకటించింది.

బంగ్లాదేశ్‌ తీసుకున్న ఈ నిర్ణయం కేవలం ఒక వ్యక్తిపై నిరాకరణ కాదు.

అది ఒక సిద్ధాంతానికి వ్యతిరేకమైన ప్రకటన. విద్వేషాన్ని మతం పేరుతో వ్యాపింపజేసే వ్యక్తులు ఎక్కడ ఉన్నా.. వారు ప్రజాస్వామ్యానికి ప్రమాదమనే సందేశం బంగ్లాదేశ్ కూడా ఇచ్చినట్లయ్యింది.

Tags:    

Similar News