మోదీ చైనా టూర్.. మ‌ళ్లీ హిందీ-చీనీ భాయి భాయి

మోదీ శ‌నివారం చైనాలో కాలుపెట్టారు. షాంఘై కోఆప‌రేటివ్ కార్పొరేష‌న్ (ఎస్ఈవో) స‌ద‌స్సుకు హాజ‌ర‌య్యారు.;

Update: 2025-08-31 12:30 GMT

హిందీ-చీనీ భాయి భాయి.. భార‌త తొలి ప్ర‌ధాని నెహ్రూ హ‌యాంలో 1950వ ద‌శకంలో మార్మోగిన నినాదం ఇది..! అప్ప‌టికి ఇంకా చైనా విస్త‌ర‌ణ వాదంలో లేదు.. ఆర్థిక సంస్క‌ర‌ణ‌ల‌నూ ఒంట‌బ‌ట్టించుకోలేదు.. భార‌త్ స్వాతంత్ర్యం పొందిన తొలినాళ్ల‌వి.. అటు చైనాలో క‌మ్యూనిస్టు పాల‌న మొగ్గ‌తొడిగింది..! కానీ, భార‌త్ పై యుద్ధానికి దిగిన చైనా హిందీ-చీనీ భాయిభాయి నినాదానికి తూట్లు పొడిచింది. ఆ త‌ర్వాత రెండు దేశాల సంబంధాలు త‌ర‌చూ ఆటుపోట్ల‌కు గుర‌య్యాయి. ఐదేళ్ల కింద‌ట గాల్వాన్ లో జ‌రిగిన ఘ‌ర్ష‌ణ‌తో చాలా దిగ‌జారాయి. అయితే, నువ్వా ద‌రిని.. నేనీ ద‌రిని.. ట్రంపు క‌లిపాడు ఇద్ద‌రినీ అన్న‌ట్లు.. అమెరికా అధ్య‌క్షుడు ఎడాపెడా విధించిన సుంకాలు భార‌త్-చైనాను ద‌గ్గ‌ర చేశాయి. ఇటీవ‌లి కాంలో ఎన్న‌డూ లేని విధంగా భార‌త్ -చైనా ద‌గ్గ‌ర‌య్యాయి.

మోదీ శ‌నివారం చైనాలో కాలుపెట్టారు. షాంఘై కోఆప‌రేటివ్ కార్పొరేష‌న్ (ఎస్ఈవో) స‌ద‌స్సుకు హాజ‌ర‌య్యారు. ఆదివారం చైనా అధ్య‌క్షుడు జిన్ పింగ్ తో స‌మావేశ‌మ‌య్యారు. ప‌ర‌స్ప‌ర న‌మ్మ‌కం, గౌర‌వం, సున్నిత‌త్వం ఆధారంగా ద్వైపాక్షిక సంబంధాల‌ను ముందుకుతీసుకెళ్ల‌డానికి తాము క‌ట్టుబ‌డి ఉన్న‌ట్లు మోదీ పేర్కొన్నారు. ప్ర‌జ‌ల సంక్షేమం ద్వైపాక్షిక స‌హ‌కారంతో ముడిప‌డి ఉంద‌ని.. స‌రిహ‌ద్దుల్లో శాంతి, స్థిర‌త్వం కొన‌సాగుతుంద‌ని తెలిపారు.

ఏడేళ్ల త‌ర్వాత కాలిడి..

2018లో చివ‌రిసారిగా మోదీ చైనాలో ప‌ర్య‌టించారు. తాజాగా మ‌ళ్లీ వెళ్లారు. గాల్వాన్ ఘ‌ర్ష‌ణ‌ల వాతావ‌ర‌ణం నుంచి, అమెరికా విధిస్తున్న సుంకాల ఎఫెక్ట్ నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు ఈ స‌మావేశం పునాది అని చెప్పొచ్చు. మ‌రోవైపు మోదీ.. ర‌ష్యా అధ్య‌క్షుడు పుతిన్ తోనూ స‌మావేశం కానున్నారు. షాంఘై కో ఆప‌రేష‌న్ ఆర్గ‌నైజేష‌న్ (ఎస్‌సీవో) స‌ద‌స్సు చైనాలోని తియాంజిన్ న‌గ‌రంలో జ‌రుగుతోంది. గ‌త ఏడాది బ్రిక్స్ స‌ద‌స్సు సంద‌ర్భంగా మోదీ-జిన్ పింగ్ క‌లుసుకున్నారు. కానీ, అప్ప‌టికి ట్రంప్ సుంకాల బాదుడు లేదు.

55 నిమిషాల సుదీర్ఘ భేటీ..

మోదీ-జిన్ పింగ్ భేటీ 55 నిమిషాల పాటు సాగింది. ఈ సంద‌ర్భంగా కైలాస మాన‌స స‌రోవ‌ర్ యాత్ర తిరిగి ప్రారంభం కావ‌డం, ఇరు దేశాల మ‌ధ్య నేరుగా విమాన‌ స‌ర్వీసుల పునఃప్రారంభం వంటి కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్నారు. పొరుగు దేశంతో సానుకూల సంబంధాలు కొన‌సాగిస్తామ‌ని మోదీ చెప్పారు. నిరుడు బ్రిక్స్ స‌మావేశం (ర‌ష్యాలోని క‌జ‌న్ వేదిక‌) భార‌త్-చైనా సంబంధాల పున‌రుద్ధ‌ర‌ణ‌కు బాట వేసింద‌ని తెలిపారు.

బ‌లంగా, స్థిరంగా...

భార‌త్ పై అమెరికా విధించిన సుంకాలను ఇప్ప‌టికే చైనా ఖండించింది. త‌మ‌ది భార‌త్ ప‌క్ష‌మేన‌ని కూడా ప్ర‌క‌టించింది. తాజాగా మోదీతో భేటీ అనంత‌రం జిన్ పింగ్ మ‌రింత అండ‌గా ఉంటామ‌న్న‌ట్లు భ‌రోసా ఇచ్చారు. అత్య‌ధిక జ‌నాభా క‌లిగిన ఈ రెండు దేశాలు గ్లోబ‌ల్ సౌత్ లో ముఖ్య‌మైన‌వ‌ని పేర్కొన్నారు. రెండే దేశాల విజ‌యాల‌కు దోహ‌దప‌డే అంశాల్లో డ్రాగ‌న్-ఏనుగు క‌లిసిరావ‌డం స‌రైన ఎంపిక‌గా జిన్ పింగ్ తెలిపారు. ద్వైపాక్షికంగా స్థిర‌, బ‌ల‌మైన సంబంధాలు దీర్ఘ‌కాలం నిల‌వాల‌ని, భార‌త్-చైనా ప్ర‌పంచ శాంత‌, శ్రేయ‌స్సు బాధ్య‌త తీసుకోవాల‌ని పిలుపునిచ్చారు.

Tags:    

Similar News