బీజేపీ వైపు చూస్తున్న మల్లారెడ్డి.. కమలం పెద్దలతో చర్చిస్తున్న మాజీ మంత్రి?

అపోజిషన్‌లోకి వచ్చినప్పటి నుంచి కన్‌ఫ్యూజన్‌లో ఉన్న మాజీ మంత్రి మల్లారెడ్డి ఎట్టకేలకు ఓ నిర్ణయానికి వచ్చారని ప్రచారం జరుగుతోంది.;

Update: 2025-07-27 19:18 GMT

అపోజిషన్‌లోకి వచ్చినప్పటి నుంచి కన్‌ఫ్యూజన్‌లో ఉన్న మాజీ మంత్రి మల్లారెడ్డి ఎట్టకేలకు ఓ నిర్ణయానికి వచ్చారని ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత కాంగ్రెస్ లో చేరాలని విశ్వప్రయత్నం చేసిన మల్లారెడ్డికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అడ్డుగా నిలిచారు. దీంతో మల్లారెడ్డి ప్లాన్ బి అమలులోకి తెచ్చారని అంటున్నారు. రాష్ట్రంలో అధికార పార్టీని కాదని ఇప్పుడు కేంద్రంలో అధికార పార్టీ బీజేపీతో టచ్ లోకి వెళ్లారని అంటున్నారు.

బండి సంజయ్‌తో మల్లారెడ్డి కోడలు భేటీ

మాజీ మంత్రి, బీఆర్ఎస్ మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి పక్కచూపులు చూస్తున్నారన్న ప్రచారానికి ఊతమిచ్చేలా ఇటీవల చోటుచేసుకున్న ఓ సంఘటనను పరిశీలకులు ఉదహరిస్తున్నారు. ప్రస్తుతానికి మల్లారెడ్డి గులాబీ పార్టీలో ఉన్నప్పటికీ, పార్టీ మారిపోవాలనే విషయమై కొన్ని నెలలుగా తర్జనభర్జన పడుతున్నారని చెబుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సత్సంబంధాలు ఏర్పరుచుకునేలా ప్రయత్నాలు చేసినా, అవి ఫలించకపోవడంతో తదుపరి ప్రత్యామ్నాయంగా బీజేపీ వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. అయితే మల్లారెడ్డి బీజేపీ పెద్దలతో టచ్లోకి వెళ్లారా? లేక బీజేపీ పెద్దలే ఈ దిశగా చొరవ చూపారా? అన్నది మాత్రం కచ్చితంగా తెలియడం లేదు. కానీ, ఇదే సమయంలో బీజేపీ నేత, కేంద్ర మంత్రి బండి సంజయ్ తో మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి భేటీ కావడం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. మల్లారెడ్డితోపాటు ఆయన అల్లుడు కూడా ప్రస్తుతం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా ఉండగా, ప్రీతిరెడ్డి బీజేపీ నేతలతో సమావేశమవడం రాజకీయ ప్రాధాన్యం ఉన్న విషయం అంటున్నారు. అంతేకాకుండా బీజేపీ జెండాలతో బండి సంజయ్, ప్రీతిరెడ్డి ప్లెక్సీలు ముద్రించడం కూడా చర్చకు దారితీస్తోంది. ప్రస్తుతానికి ప్రీతిరెడ్డికి ఏ పార్టీతో సంబంధం లేదు. కానీ, ఆమె బీజేపీ నాయకురాలిగా ఎలివేట్ అయ్యేలా ఆ ప్లెక్సీలు ముద్రించారని చెబుతున్నారు. ఇక మల్లారెడ్డి బీజేపీలోకి వెళ్లే క్రమంలోనే ముందుగా తన కోడలు ప్రీతిరెడ్డిని ఆ పార్టీకి దగ్గర చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది.

కాంగ్రెస్ అడ్డుకోవడంతోనే..

రాష్ట్రంలో విద్యాసంస్థలు, ఇతర వ్యాపారాలు ఉన్న మల్లారెడ్డి ముందుగా కాంగ్రెస్ పార్టీలో చేరాలని భావించారు. అయితే గతంలో సీఎం రేవంత్ రెడ్డిపై ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో మల్లారెడ్డి చేరికకు సీఎం రేవంత్ రెడ్డి క్లియరెన్స్ ఇవ్వలేదని అంటున్నారు. నిజానికి రేవంత్ రెడ్డి, మల్లారెడ్డి టీడీపీలోనే రాజకీయాలు ప్రారంభించారు. అప్పటి నుంచే ఇద్దరి మధ్య గ్యాప్ ఉందని చెబుతారు. రాష్ట్ర విభజన తర్వాత రేవంత్ కాంగ్రెస్ లోకి వెళ్లగా మల్లారెడ్డి బీఆర్ఎస్ లో చేరారు. గులాబీ పార్టీలో మంత్రిగా పనిచేసిన మల్లారెడ్డి అప్పట్లో పీసీసీ చీఫ్ గా ఉన్న రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడేవారు. కొన్నిసార్లు వ్యక్తిగత విమర్శలకు వెళ్లడంతో ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చిందని చెబుతున్నారు. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చెడిపోయిన సంబంధాలను తిరిగి పునరుద్ధరించేందుకు మల్లారెడ్డి విశ్వప్రయత్నాలు చేశారు. కానీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం చల్లారలేదని అంటున్నారు. దీంతో మల్లారెడ్డి రాజకీయ భవిష్యత్తు కోసం బీజేపీ వైపు చూస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఈటలతో వివాదం.. మల్లారెడ్డికి అనుకూలమా?

2024 లోక్‌సభ ఎన్నికల్లో మల్లారెడ్డి తనయుడు భద్రారెడ్డిని బరిలో దింపాలని అనుకున్నారు. అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడంతో వెనక్కి తగ్గారు. అప్పటి నుంచే మల్లారెడ్డి బీఆర్ఎస్ పార్టీపై కొంత అసంతృప్తితో ఉంటూ వస్తున్నారని చెబుతున్నారు. ఆ కారణంగానే ఆయన కోడలు ప్రీతిరెడ్డి బీజేపీవైపు అడుగులేస్తున్నారా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్, కేంద్ర మంత్రి బండి సంజయ్‌ మధ్య కోల్డ్ వార్ జరుగుతుండటంతో మల్లారెడ్డి ఎంట్రీ ఆసక్తి రేపుతోంది. ఈటలకు చెక్ చెప్పేలా బండి సంజయ్ బీజేపీలోకి మల్లారెడ్డిని తీసుకువస్తున్నారని అంటున్నారు. మల్కాజ్‌గిరి నియోజకవర్గంలో మల్లారెడ్డి కుటుంబానికి ఉన్న రాజకీయ పలుకుబడిని ఉపయోగించుకుని ఈటల రాజేందర్‌కు చెక్ పెట్టొచ్చని కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్లాన్ చేస్తున్నారా? అన్న చర్చ మొదలైంది.

మల్లారెడ్డిపై బీఆర్ఎస్ లోనూ చర్చ

ఈ రాజకీయ సమీకరణల్లో భాగంగానే కేంద్ర మంత్రి బండి సంజయ్‌తో మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి భేటీ అయ్యారనే టాక్ వినిపిస్తోంది. బండి, ప్రీతిరెడ్డి లంచ్ మీటింగ్‌పై బీఆర్ఎస్ పార్టీలోనూ చర్చ జరుగుతోంది. టైమ్‌ చూసి మల్లారెడ్డి బీఆర్ఎస్‌ను వదిలి జంప్ అయ్యేందుకు రెడీ అవుతున్నారనే టాక్ వినిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో తనతో పాటు కొడుకు భద్రారెడ్డి లేదంటే కోడలు ప్రీతిరెడ్డిని పోటీ చేయించే యోచనలో మల్లారెడ్డి ఉన్నట్లు చెబుతున్నారు. సేమ్‌టైమ్‌ బీజేపీలోకి వెళ్తే తన విద్యాసంస్థలకు, బిజినెస్‌కు ఎలాంటి ఇబ్బంది ఉండదని భావిస్తున్నారట. కారులోనే ఉంటారా.? కమలం గూటికి వెళ్తారా.? అనేది మల్లారెడ్డి చెప్తే గానీ క్లారిటీ వచ్చేలా లేదు. కారు గుర్తుపై మేడ్చల్‌, మల్కాజిగిరి నుండి గెలిచిన మామా, అల్లుల్లు మల్లారెడ్డి, రాజశేఖర్‌ రెడ్డి లు వచ్చే ఎన్నికల దాకా బిఆర్‌ ఎస్‌ లోనే కొనసాగినా... కోడలును మాత్రం కమల దళంలో చేర్చడం ఖాయమనే టాక్‌ నడుస్తోంది.

Tags:    

Similar News