చిన్న శ్రీనుకు హైకమాండ్ హై ప్రయారిటీ !

కాంగ్రెస్ వైసీపీలలో జీవితంలో సగానికి పైగా కాలాన్ని వెచ్చించిన విజయనగరం జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అలియాస్ చిన్న శ్రీను అనూహ్యంగా టీడీపీలోకి వెళ్ళారు.

Update: 2026-10-03 04:03 GMT

కాంగ్రెస్ వైసీపీలలో జీవితంలో సగానికి పైగా కాలాన్ని వెచ్చించిన విజయనగరం జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అలియాస్ చిన్న శ్రీను అనూహ్యంగా టీడీపీలోకి వెళ్ళారు. ఇది ఎవరూ అసలు కలలో కూడా అనుకోనిది. ఎందుకంటే చిన్న శ్రీను రాజకీయ జీవితం అంతా టీడీపీతో పోరాటంగానే సాగింది. అలాంటిది పసుపు కండువా ఆయన కప్పుకున్నారు. అయితే టీడీపీలో చేరిన చిన్న శ్రీనుని జిల్లాలో అతి ముఖ్య నాయకుడిగా ఆ పార్టీ అధినాయకత్వం భావిస్తూ అన్ని విధాలుగా ప్రోత్సహించడమే విశేషం. చిన్న శ్రీనుకు హైకమాండ్ తో డైరెక్ట్ యాక్సెస్ ఉందని అంటున్నారు. ఆయన చంద్రబాబు సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. అతి కొద్ది మందికి మాత్రమే ఆ అవకాశం ఉంటుంది. అంతే కాదు ఆయన తరువాత కాలంలో లోకేష్ ని కూడా కలసి వచ్చారు. తాజాగా మరోసారి తన కుమార్తె సిరి సహస్రను వెంటబెట్టుకుని చంద్రబాబుని లోకేష్ ని ఆయన కలవడం గమనార్హం.

ఆ స్థాయిలోనే :

విజయనగరం జిల్లాకు ఏకైక మంత్రిగా కొండపల్లి శ్రీనివాస్ ఉన్నారు. అలాగే కొందరు సీనియర్ నేతలు ఉన్నారు. వారికి హైకమాండ్ తో అనుకున్నపుడు అపాయింట్మెంట్ దొరుకుంది. ఇపుడు టీడీపీలో చిన్న శ్రీనుకు ఆ మర్యాద లభించడం పట్ల టీడీపీ వర్గాలలోనే పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. జిల్లాలో చిన్న శ్రీనుకు ఉన్న రాజకీయ బలం అంచనా వేసుకున్న మీదటనే టీడీపీ ఆయనను చేర్చుకుందని అంటున్నారు. మొత్తం తొమ్మిది అసెంబ్లీ సీట్లు ఉంటే అందులో సగానికి పైగా చిన్న శ్రీను రాజకీయ ప్రాబల్యం చలాయించే స్థాయిలో ఉన్నాయని అంటున్నారు. ఇక స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో కూడా చిన్న శ్రీను బలాన్ని వాడుకోవాలని అధినాయకత్వం చూస్తోంది అని అంటున్నారు.

సీటు కోసమేనా :

ఇక తాజాగా చిన్న శ్రీను తన కుమార్తెతో హైకమాండ్ ని కలిసిన నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో తన కుమార్తె సీటు కోసమేనా అన్న చర్చ సాగుతోంది. సిరి సహస్ర మేయర్ గా పోటీ చేస్తారా లేక జిల్లా పరిషత్ చైర్మన్ గా బరిలోకి దిగుతారా అన్నది అయితే ఇంకా తేలలేదు, ప్రచారంలో ఉన్న దానిని బట్టి చూస్తే కనుక సిరి సహస్త్ర జిల్లా పరిషత్ చైర్మన్ గా పోటీ చేస్తుంది అని అంటున్నారు. ఆమెకు టికెట్ ఇస్తే ఒంటి చేత్తో గెలిపించుకుని వస్తామని కూడా చిన్న శ్రీను వర్గీయులు చెబుతున్నారు. వరసగా వైసీపీ నుంచి మాజీ జెడ్పీటీసీలు రాజీనామా చేసి చిన్న శ్రీను వెంట టీడీపీలో చేరడం వెనక జిల్లా పరిషత్ చైర్మన్ పీఠం టార్గెట్ ఉందని అంటున్నారు.

రేసులో ఎందరో :

ఇక చూస్తే జెడ్పీ పీఠం కోసం టీడీపీలోనే పోటీ ఉంది. రేసులో చాలా మంది నేతలు ఉన్నారని అంటున్నారు. చీపురుపల్లి ఎమ్మెల్యే, మాజీ మంత్రి కిమిడి కళా వెంకట్రావు కుమారుడు ఈ సీటు మీద ఫోకస్ పెట్టారని కూడా టాక్ నడుస్తోంది. అయితే హైకమాండ్ నిర్ణయమే శిరోధార్యం అని అంటున్నారు. టీడీపీ కూడా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుందని చెబుతున్నారు. చిన్న శ్రీను కుమార్తెకు టికెట్ ఇస్తే వైసీపీ నుంచి పరోక్ష మద్దతు కూడా దండీగా దక్కుతుందని లెక్కలు కూడా ఉన్నాయని చెబుతున్నారు. మొత్తం మీద చిన్న శ్రీను టీడీపీ జిల్లా రాజకీయాల్లో కీలకంగా మారిపోయారు అని అంటున్నారు.

Tags:    

Similar News