మద్రాసు హైకోర్టు జడ్జిపై అభిశంసన.. అసలీ వివాదమేంటి?
కీలక పరిణామం ఒకటి మంగళవారం చోటు చేసుకుంది. దీనికి లోక్ సభ వేదికైంది.;
కీలక పరిణామం ఒకటి మంగళవారం చోటు చేసుకుంది. దీనికి లోక్ సభ వేదికైంది. రాబోయే రోజుల్లో ఇదో పెద్ద ఇష్యూగా మారటమే కాదు.. పలు రాజకీయ.. సామాజిక పరిణామాలకు కారణంగా మారుతుందని చెప్పకతప్పుదు. ఇప్పటికే పలు అంశాల్లో తమకు ద్రోహం జరుగుతుందని.. సెక్యులరిజం పేరుతో సూడో సెక్యులరిజాన్నిప్రోత్సహిస్తున్న రాజకీయ పార్టీల తీరుపై మెజార్టీ ప్రజలు ఆగ్రహంగా ఉన్న సమయంలోనే చోటు చేసుకున్న ఈ పరిణామం రాబోయే రోజుల్లో మరింత పెద్ద వివాదంగా మారుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
రాజకీయ పార్టీల ద్వంద వైఖరికి నిదర్శనంగా ఈ అంశాన్నిచెబుతున్నారు. మద్రాసు హైకోర్టు జడ్జి జస్టిస్ జీఆర్ స్వామినాథన్ ను తొలగించాలనికోరుతు ఇండియా బ్లాక్ ఎంపీలు (కాంగ్రెస్ పార్టీ దాని మిత్రపక్షాలు) అభిశంసన నోటీసులు లోక్ సభ స్పీకర్ కు అందజేశారు. డీఎంకే ఎంపీ కనిమొళి ఆధ్వర్యంలోని ఎంపీల టీం లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసి నోటీసులు ఇవ్వటం ఇప్పుడు సంచలనంగా మారింది. ఇంతకూ ఒక హైకోర్టు జడ్జి మీద విపక్ష ఎంపీలు పలువురు అభిశంసన నోటీసులు ఇవ్వటానికి కారణమేంటి? అన్న విషయంలోకి వెళితే.. తాజాగా ఆయన ఇచ్చిన తీర్పును ప్రస్తావిస్తున్నారు.
ఆ కేసు ఉదంతంలోకి వెళ్లినప్పుడు.. సదరు న్యాయమూర్తి ఇచ్చిన తీర్పుకు ఇంత చేయాలా? అన్న విస్మయం వ్యక్తం కాక మానదు. అదే సమయంలో సెక్యూలరిజం పేరుతో జరుగుతున్న హడావుడి.. ఆ పేరుతో మెజార్టీల గొంతును నులిమే రాజకీయ పార్టీల ఓట్ల రాజకీయం కళ్లకు కట్టినట్లుగా కనిపించకమానదు. అసలు ఈ వివాదం ఎందుకు షురూ అయ్యిందన్న విషయంలోకి వెళితే.. తమిళనాడులోని ముధురై సమీపంలో తిరుపరంకుండ్రం కొండ సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో కార్తీక దీపం వెలిగించటానికి అనుమతి ఇస్తూ మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జీఆర్ స్వామినాథన్ తీర్పు ఇవ్వటమే.
ఎందుకిలా అంటే.. ఆ స్థలం సమీపంలో 14వ శతాబ్దపు దర్గా ఉండటంతో.. సామాజిక ఉద్రిక్తతలకు దారి తీస్తుందన్న సందేహాల్ని వ్యక్తం చేస్తున్న డీఎంకే దాని మిత్రపక్షాలు చివరకు హైకోర్టు జడ్జి మీద అభిశంసనకునోటీసులు ఇవ్వటం వరకు వెళ్లటం గమనార్హం. గతంలో దీపం కొండ అడుగున ఉన్న స్తంభం వద్ద వెలిగించేవారు. కానీ.. జస్టిస్ స్వామినాథన్ తీర్పు ప్రకారం దీపం కొండ మధ్యలో ఉన్న స్తంభం వద్ద వెలిగించాలని ఆదేశించటాన్ని తప్పు పడుతున్నారు.
ఈ తీర్పు సెక్యులర్ విలువలకు విరుద్ధంగా ఉందంటూ మద్రాసు హైకోర్టు లాయర్లు కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేయటం.. అందుకు అనుగుణంగా లోక్ సభలో 120 మంది ఎంపీలు సంతకాలతో కూడిన అభిశంసన పిటిషన్ ను సమర్పించటంతో ఇష్యూ మరో స్థాయికి వెళ్లింది. ఒకవేళ హైకోర్టు న్యాయమూర్తి ఇచ్చిన తీర్పుపై అభ్యంతరం ఉంటే సుప్రీంకోర్టులో సవాలు చేయొచ్చు కదా? అందుకు భిన్నంగా అభిశంసన నోటీసులు ఇవ్వటం ద్వారా ఎవరికి ఎలాంటి హెచ్చరికలు జారీ చేస్తున్నారు? అన్నదిప్పుడు చర్చగా మారింది. సెక్యులర్ మాటల్ని వల్లె వేసే రాజకీయ పార్టీల డబుల్ టోన్ ఎలా ఉంటుందనటానికి ఇదో ఉదాహరణగా చెప్పక తప్పదు.