మెగాస్టారే కాదు..మద్రాసు పుట్టిందీ ఈరోజే..హైదరాబాద్ కంటే చిన్నదే
ఆగస్టు 22ను టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజుగా అందరూ చూస్తారు... కానీ, ఈ రోజు మద్రాస్ పుట్టిన రోజు...! అఫ్ కోర్స్.. మెగాస్టార్ చిరంజీవి నటుడిగా పుట్టింది మద్రాస్ లోనే అనుకోండి.;
మదరాసీ.. ఈ పదం ఒకప్పుడు దక్షిణ భారతదేశానికి ప్రతీక..! తమిళనాడు, ఏపీ, తెలంగాణ, కర్ణాటక, కేరళ ఎక్కడివారైనా సరే.. ఢిల్లీ వెళ్తే మదరాసీ అనే అనేవారట..! అలాంటి నగరం కాలక్రమేణా చెన్నపట్టణం నుంచి చెన్నైగా మారింది... 30 ఏళ్ల కిందట మద్రాస్ పేరు చెన్నైగా మార్చినప్పుడు అందరూ కాస్త పలికేందుకు ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు మాత్రం అలవాటు పడ్డారు.
ఆగస్టు 22ను టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజుగా అందరూ చూస్తారు... కానీ, ఈ రోజు మద్రాస్ పుట్టిన రోజు...! అఫ్ కోర్స్.. మెగాస్టార్ చిరంజీవి నటుడిగా పుట్టింది మద్రాస్ లోనే అనుకోండి. అందుకే ఏటా ఈ రోజున మద్రాస్ డే వేడుకలు నిర్వహిస్తుంటారు. ఈ సంప్రదాయం కూడా ఎప్పటినుంచో రాలేదు.. 2004 నుంచి మొదలైంది.
ఇలా పుట్టింది మద్రాస్....
బ్రిటిషర్లు మన దేశానికి వచ్చి ఈస్ట్ ఇండియా కంపెనీ పేరిట వ్యాపార కార్యకలాపాలు నిర్వహించసాగారు. అలాంటి సమయంలో 1639 ఆగస్టు 22న అప్పటి రాజు నుంచి కొంత భూమిని కొని సెయింట్ జార్జ్ కోటను నిర్మించారు. అలా దానిచుట్టూ స్థానికులు, బ్రిటిషర్లూ నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. చివరకు అదే పెద్ద మద్రాస్ గా ఎదిగింది. ఆగస్టు 29న ఈస్ట్ ఇండియా కంపెనీ భూమిని కొనుగోలు చేసింది కాబట్టి.. ఆ రోజును మద్రాస్ డే అంటూ 1939లో నిర్ణయించారు. కానీ, తర్వాత ఎవరూ పట్టించుకోలేదు.
2004 నుంచి మొదలుపెట్టి...
మద్రాస్ చారిత్రక నేపథ్యం, కల్చర్ ను కాపాడే ఉద్దేశంతో మైలాపోర్ టైమ్స్ పేపర్ ఎడిటర్ విన్సెంట్ డిసౌజా, ప్రెస్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఎడిటర్ శశినాయర్, చరిత్రకారుడు ముత్తయ్య చొరవ చూపడంతో 2004 నుంచి క్రమం తప్పకుండా మద్రాస్ డేను నిర్వహిస్తున్నారు. అలా ఆగస్టు 22న నగరం చరిత్రను వివరిస్తూ, సదస్సులు, మారథాన్ పరుగు నిర్వహిస్తుంటారు. చారిత్ర కట్టడాలు, పర్యాటక ప్రదేశాల ప్రాముఖ్యతను వివరించేలా ఎగ్జిబిషన్లు, స్టాల్స్ ఏర్పాటు చేస్తుంటారు.
సినీ నగరి.. ఆటోమొబైల్ రాజధాని..
ఓ 25 ఏళ్ల కిందటి వరకు దేశంలోని నాలుగు ప్రధాన నగరాల్లో ఉష్ణోగ్రతలు అంటూ ఢిల్లీ, ముంబై, కోల్ కతాలతో పాటు చెన్నై పేరు చెప్పేవారు. అంటే, అప్పటికే చెన్నై దేశంలోని పెద్ద నగరాల్లో ఒకటిగా మారిందిన్నమాట. ఇక అమెరికాలో ఆటోమొబైల్ కు పేరుగాంచిన నిడెట్రాయిట్ తో చెన్నైను పోలుస్తారు. చెన్నై పారిశ్రామిక ప్రగతిని సూచించేలా ఇలా పిలుస్తారు. ఇక మరీ ఆసక్తికరం ఏమంటే.. 30 ఏళ్ల కిందటి వరకు చెన్నై (మద్రాస్) దక్షిణ భారత సినీ పరిశ్రమలు (తమిళ, కన్నడ, తెలుగు, మలయాళం) అన్నింటికీ కేంద్రం. ఆ తర్వాత ఒక్కోటి తమ సొంత రాష్ట్రాలకు వెళ్లిపోయాయి. అంటే.. ఒకప్పుడు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ నుంచి కన్నడ కంఠీరవ రాజ్ కుమార్, తమిళ తెరవేల్పు ఎంజీఆర్ అందరూ చెన్నైలోనే ఉండేవారన్నమాట.
మద్రాస్ కొరియర్... హైదరాబాద్ కంటే చిన్నదే..
1996లో డీఎంకే ప్రభుత్వం మద్రాస్ పేరును చెన్నైగా మార్చింది. ‘మద్రాస్ కొరియర్’ అనేది ప్రపంచంలోనే రెండో అతి ప్రాచీన ఆంగ్ల పత్రిక. దీన్ని 1785లో ప్రారంభించారు. ఇప్పటికీ నడుస్తోంది. ఇక మద్రాస్ పుట్టింది 1639లో అనుకుంటే దాని వయసు 386 ఏళ్లు. అంటే మన హైదరాబాద్ కంటే మద్రాస్ చిన్నదే అనుకోవాలి. ఎందుకంటే.. హైదరాబాద్ కు 1591లో మొహమ్మద్ కులీ కుతుబ్ సా చేతుల మీదుగా పునాదిరాయి పడింది. ఈ లెక్కన చూస్తే హైదరాబాద్ కంటే చెన్నై దాదాపు 50 ఏళ్లు చిన్నది. కానీ, హైదరాబాద్ కంటే ముందే పెద్ద నగరంగా ఎదిగింది. బహుశా సముద్రం తీరం ఉండడమే కారణం కావొచ్చేమో..?