కర్ణాటక కొత్త ఐటీ పాలసీ.. తెలుగు రాష్ట్రాల సీఎంలు బీఅలర్ట్!

అంటే.. బెంగళూరు నుంచి మైసూరు.. మంగళూరు.. హుబ్లీ-ధార్వాడ్.. కలబురగి.. శివమొగ్గ లాంటి నగరాలకు ఉద్యోగుల్ని తరలించే సంస్థలకు ప్రోత్సహాకం ఇస్తామని ప్రకటించింది.;

Update: 2025-11-23 06:17 GMT

భవిష్యత్తును ఎవరైతే సరిగ్గా అంచనా వేస్తారో వారికి తిరుగు ఉండదు. అసాధారణ విజయాల్ని సొంతం చేసుకుంటారు. అసాధ్యాల్ని సుసాధ్యాలు చేస్తారు. ఈ సూత్రం వ్యక్తులకే కాదు వ్యవస్థలకు ఉండాల్సిందే. దేశంలో ఐటీ నగరిగా బెంగళూరు దూసుకెళ్లటానికి కారణం.. దేశంలోని మహానగరాలు ఐటీ భవితను గుర్తించే నాటికే అక్కడి పాలకులు అక్కడ పునాదులు వేయటమే కాదు.. భవనాలు కట్టేశారు. అదే.. బెంగళూరు ఫ్యూచర్ ను మార్చేయటమే కాదు.. ప్రపంచ పటంలో గార్డెన్ సిటీకి సరికొత్త ఇమేజ్ ను తెచ్చి పెట్టింది.

ఐటీ విషయంలో నాటి కర్ణాటక పాలకులు ఎంత ముందుచూపుతో వ్యవహరించారో.. నాటి తమిళ ప్రభుత్వాలు ఐటీని.. దాని సత్తాను గుర్తించటంలో వెనుకపడ్డారు. అదే ఈ రోజున చెన్నై మహానగరం ఐటీ విషయంలో ఎంతలా వెనుకబడిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఫార్చ్యూన్ 500 కంపెనీల్లో 400 కంటే ఎక్కువ సంస్థలు బెంగళూరులో కార్యకలాపాలు నిర్వహించటం చూస్తే.. నాటి కర్ణాటక పాలకుల విజన్ ఎంతలా పని చేసిందో ఇట్టే చెప్పేయొచ్చు. ఈ విషయంలో తెలుగు రాష్ట్రాలు మధ్యస్తంగా ఉన్నాయని చెప్పాలి. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న వేళలో కర్ణాటక పాలకులంత స్పీడ్ లేకున్నా.. తమిళ ప్రభుత్వాల మాదిరిగానూ లేరు. కాస్త ఆలస్యంగా ఐటీ రేంజ్ ను గుర్తించిన తెలుగు పాలకులు.. ఆ తర్వాత ఆ ఆలస్యాన్ని భర్తీ చేసే ప్రయత్నం చేశారని చెప్పాలి.

ఉమ్మడి ఏపీ కాస్తా రెండు తెలుగు రాష్ట్రాలుగా ముక్కలైన వేళ.. హైదరాబాద్ మహానగరి తెలంగాణ రాష్ట్ర పరిధిలో ఉండటంతో ఐటీకి హైదరాబాద్ మహానగరం కేరాఫ్ అడ్రస్ గా మారింది. ఉమ్మడి రాష్ట్రంలో నాటి పాలకులు హైదరాబాద్ మీద పెట్టిన ఫోకస్ మరే నగరం మీదా పెట్టకపోవటంతో.. హైదరాబాద్ లేని ఏపీ ఐటీ విషయంలో అత్యంత వెనుకబడిన రాష్ట్రంగా మారింది. అయితే.. విశాఖపట్నంలో ఐటీకి అవకాశాలు అంతకంతకూ పెంచుతున్న వైనం.. రానున్న రోజుల్లో ఉక్కునగరంగా పేరున్న వైజాగ్ కు అంతో ఇంతో ఇమేజ్ వస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఇందుకు గూగుల్ డేటా సెంటర్ వైజాగ్ కు వచ్చేందుకు చంద్రబాబు ప్రభుత్వం ప్రదర్శించిన చొరవ ఒక ఉదాహరణగా చెప్పాలి. ఇప్పటివరకు జరిగింది ఒక ఎత్తు.. ఇకపై జరగాల్సింది మరో ఎత్తుగా చెప్పాలి. ఈ విషయంలో మరోసారి కర్ణాటక ఒక చక్కటి ఉదాహరణగా మారింది. ఐటీ నగరిగా మారిన బెంగళూరు.. ఇటీవల కాలంలో మెరుపుల కంటే మరకలే ఎక్కువగా నమోదవుతున్న పరిస్థితి. దీనికి కారణం.. కొన్ని దశాబ్దాలుగా అక్కడి ప్రభుత్వాలు బెంగళూరు మహానగరంలో మౌలిక వసతుల కల్పన విషయంలో ప్రదర్శించిన అలసత్వం.. ఇప్పుడు గార్డెన్ సిటీకి శాపంగా మారింది.

పలు సంస్థలు అక్కడి ట్రాఫిక్ దెబ్బకు దడిచి.. వేరే నగరాలకు వెళ్లిపోతున్న పరిస్థితి. ఇలాంటి వేళ..పూర్తిగా అదుపు తప్పిన బెంగళూరును మళ్లీ గాడిలో పెట్టటం అంత తేలికైన విషయం కాదు. ఈ సందర్భంగా కర్ణాటక పాలకలు కొత్త ఎత్తుగడకు తెర తీశారు. ఇందుకు నిదర్శనంగా కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కొత్త ఐటీ పాలసీ 2025-2030ను ప్రకటించింది. బెంగళూరు టెక్ సమ్మిట్ 28వ ఎడిషన్ ప్రారంభోత్సవంలో ఈ పాలసీని ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా అక్కడి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఆసక్తికరంగానే కాదు.. ఆ రాష్ట్ర సరిహద్దుల్ని పంచుకునే తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు వెంటనే అలెర్టు కావాల్సిన అవసరం ఉంది. కొత్త ఐటీ పాలసీలో భాగంగా ప్రకటించిన ప్రోత్సహకాలు సగటు జీవి మొదలు సంస్థల వరకు అందరిని ఆకర్షించేలా ఉండటం దీని ప్రత్యేకతగా చెప్పాలి. ఉదాహరణకు కంపెనీలు నియమించే ప్రతి ఉద్యోగికి రూ.50 వేల వరకు వన్ టైమ్ రీలొకేషన్ ప్రోత్సాహకాన్ని అందిస్తామని ప్రకటించటం.

అంటే.. బెంగళూరు నుంచి మైసూరు.. మంగళూరు.. హుబ్లీ-ధార్వాడ్.. కలబురగి.. శివమొగ్గ లాంటి నగరాలకు ఉద్యోగుల్ని తరలించే సంస్థలకు ప్రోత్సహాకం ఇస్తామని ప్రకటించింది. ఈ ఆర్థిక ప్రోత్సాహకాల కోసం కర్ణాటక ప్రభుత్వం ఐదేళ్ల వ్యవధిలో రూ.960 కోట్లు ఖర్చు చేయనుండటం గమనార్హం. బియాండ్ బెంగళూరుఅన్న కర్ణాటక సర్కారు వ్యూహంలో ‘లీవ్ బెంగళూరు’ అన్నది అత్యంత కీలకం. ఈ విషయాన్ని గుర్తించిన కర్ణాటక పాలకులు కొత్త తాయిలాలతో అందరిని ఆకర్షించే ప్యాకేజీని సిద్ధం చేశారు. ఇందులో ముఖ్యాంశాల్ని చూస్తే..

- స్టార్టప్ లు.. టెక్ కంపెనీలు రాష్ట్రంలోని టైర్ 2 నగరాలకు మారితే కోట్ల రూపాయిల సబ్సిడీలు.. పన్ను రాయితీలు లభిస్తాయి.

- అద్దె రాయితీ 50 శాతం. గరిష్ఠ రాయితీ రూ.2 కోట్లు.

- మూడేళ్లు 30 శాతం ఆస్తిపన్ను మినహాయింపు

- ఐదేళ్లు విద్యుత్ ఛార్జీలపై 100 శాతం మినహాయింపు

- కంపెనీలకు ఫోన్. .ఇంటర్నెట్ ఖర్చుల్లో 25 శాతం రాయితీ

- ఏఐ.. బ్లాక్ చెయిన్.. క్వాంటం కంప్యూటింగ్ లాంటి రంగాల్లో పరిశోధనలపై పెట్టే ఖర్చులో 40 శాతం రీఫండ్

- ఉద్యోగంలో భాగంగా బెంగళూరు నుంచి రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలు (మైసూరు.. మంగళూరు.. కలబురగి)కు మారేందుకు ఉద్యోగులు మొగ్గు చూపితే.. వారికి రూ.50 వేల ప్రోత్సహాకాన్ని అందవేత.

ఈ కొత్త ఐటీ పాలసీ ఐటీ కంపెనీలు ఎలా స్పందిస్తాయి? అన్నది ఒకటైతే.. రెండు తెలుగు రాష్ట్రాలు సైతం కర్ణాటక ఆలోచనల్లోని మర్మాన్ని గుర్తించి.. ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ రాష్ట్రాల్లోనూ ఈ తరహా ప్రోత్సాహాకాల్ని అందించే దిశగా ఐటీ పాలసీల్ని సిద్ధం చేయాల్సిన అవసరం ఉందన్నది మర్చిపోకూడదు. అదే భవిష్యత్తులో తెలుగు రాష్ట్రాలు మిగిలిన రాష్ట్రాల కంటే ముందుండేలా చేస్తాయని చెప్పక తప్పదు.

Tags:    

Similar News