కాళేశ్వరం కుస్తీ.... ఎవరికి లాభం?
అంతేతప్ప.. ప్రధాన ప్రాజెక్టే అవినీతి అంటే.. మాత్రం ప్రభుత్వానికి ఇబ్బంది. వాస్తవానికి ఇదే ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్‌కు కలిసి వస్తున్న అంశం.;
తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారం.. ఎవరికి మేలు చేస్తుంది? ఎవరికి మైనస్ అవుతుంది?. ఇదీ.. ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న చర్చ. అవినీతిని ఎవరూ సహించరు. పైగా నిజంగానే ప్రజాధనం వృథా అయితే.. ఎవరు మాత్రం చర్యలు తీసుకోకుండా ఉండమని చెబుతారు? సో.. ఈ కోణంలో ఆలోచన చేస్తే.. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న ప్రకారం..చర్యలు తీసుకోవాల్సిందే. కానీ, ఇక్కడే తటపటాయింపు చోటు చేసుకుంది. ఏ కార్యక్రమం చేపట్టినా.. కొంత నిధులు వృథా అవుతాయి. వాటికి కారణాలు కూడా ఉంటాయి.
అంతే తప్ప.. ప్రధాన ప్రాజెక్టే అవినీతి అంటే.. మాత్రం ప్రభుత్వానికి ఇబ్బంది. వాస్తవానికి ఇదే ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్‌కు కలిసి వస్తున్న అంశం. తమను ఉద్దేశ పూర్వకంగానే వేధిస్తున్నారని.. కేసీఆర్‌పై కక్షసాధింపు కోసమే ఇలా చేస్తున్నారన్న వాదన బలంగా ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నా రు. నిజానికి తెలంగాణ సాధన తర్వాత.. కట్టిన అతిపెద్ద ఏకైక ప్రాజెక్టు కాళేశ్వరం. దీని నుంచి 2 లక్షల ఎకరాలకు పైగానే సాగు భూమికి నీరు అందుతుంది. అలానే 132 గ్రామాలకు తాగునీరు కూడా అందుతుంది.
దీనిని ఎవరూ వ్యతిరేకించడం లేదు. ప్రభుత్వం కూడా.. దీనిపై ఆచితూచి వ్యవహరిస్తోంది. అసలు ప్రాజెక్టే తప్పని ప్రభుత్వం కూడా చెప్పడం లేదు. కానీ, అవినీతి జరిగిందని అంటున్నారు. ఈ అవినీతిని నిరూపించి.. కేసీఆర్ పై చర్యలు తీసుకునే విషయంలో అధికార పార్టీలోనే విబేదాలు పొడచూపుతుండడం ఇప్పుడు చర్చకు దారితీస్తోంది. కాటగారికల్‌గా.. కేసీఆర్ తప్పులు ఎత్తి చూపించినా.. ఆయనపై చర్యలు తీసుకునే విషయంలో కేసీఆర్ ఉన్న ఇమేజ్.. ప్రజల్లో నెలకొన్న సెంటిమెంటు వంటివి అడ్డువస్తున్నాయన్నది కీలక నాయకులు చెబుతున్న మాట.
ఒకవేళ.. ప్రభుత్వమే.. కనుక కాళేశ్వరం ప్రాజెక్టు కమిషన్ రిపోర్టును అడ్డు పెట్టుకుని కేసీఆర్‌ను అరెస్టు చేయదలిస్తే... దీనిని ఆయన మాత్రం ఎందుకు తేలికగా తీసుకుంటారు?. సీరియస్‌గానే వ్యవహరిస్తారు. ఈ క్రమంలోనే బిగ్ ప్లాన్ దిశగా కేసీఆర్ అడుగులు వేస్తున్నారు. ప్రజల మధ్య ఉండేందుకు ఆయన ప్రణాళికలు చేస్తున్నారు. తద్వారా తన అరెస్టే అనివార్యమైతే.. అది ఇంట్లో కాదు.. ప్రజల మధ్యే జరగాలన్నది ఆయన వ్యూహం. తద్వారా.. తెలంగాణ సాధకుడినే అరెస్టు చేశారన్న సెంటిమెంటును ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని ప్రయత్నిస్తున్నారు. సో.. ఈ నేపథ్యంలో కాళేశ్వరం కుస్తీ వ్యవహారం.. కాంగ్రెస్ కంటే కూడా.. బీఆర్ఎస్‌కు లాభించేలా చేసుకునే ప్రతిపాదన అయితే.. తెరమీదికి వస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.