'15 ఏళ్ల'పై గ్రౌండ్ లెవిల్ టాకేంటి ..!
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం 15 సంవత్సరాలు పాటు ఉండాలి అన్నది జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెబుతున్న మాట.;
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం 15 సంవత్సరాలు పాటు ఉండాలి అన్నది జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెబుతున్న మాట. తాజాగా సీఎం చంద్రబాబు కూడా ఇదే మాట చెప్పారు. అయితే వాస్తవానికి పవన్ కళ్యాణ్ అయినా చంద్రబాబు అయినా గత కొన్నాళ్లుగా ఇదే మాట చెబుతున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చే 15 సంవత్సరాలు అధికారంలో ఉంటుందని, ఈ విషయంలో ఎటువంటి తేడా లేదని పవన్ కళ్యాణ్ ఇటీవల రాజోలు సభలో చెప్పుకొచ్చారు.
అయితే నాయకుల మాట ఎలా ఉన్నప్పటికీ క్షేత్ర స్థాయిలో ఈ విషయంపై కార్యకర్తలు నాయకుల మనోభావాలు, ఆలోచనలు, ప్రణాళికలు వంటివి ఎలా ఉన్నాయి అన్న విషయాన్ని పరిశీలిస్తే ఆశ్చర్యకరంగా ఉంటుంది. 15 ఏళ్లు అధికారంలో ఉండడం అనే దాని విషయంలో ఎవరికీ అభ్యంతరం లేకపోయినా.. క్షేత్రస్థాయిలో పదవులు, ఎమ్మెల్యే సీట్లు, అలాగే మంత్రివర్గం వంటి కీలక అంశాలపై విస్తృతమైన చర్చ నడుస్తోంది. ఎందుకంటే రాజకీయంగా ఎప్పటికప్పుడు పరిస్థితులు మారుతూ ఉంటాయి.
ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి పార్టీలు పుంజుకోవడం జరుగుతూనే ఉంటుంది. ఈ క్రమంలో జనసేన బీజేపీ వర్గాలు కూడా వచ్చే పదిహేను సంవత్సరాలు పాటు ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాప్పటికీ తమ ప్రాతినిధ్యం తన సీట్లు పెంపు విషయాలపై ఒక స్పష్టమైన వైఖరితో ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో తమకు సీట్లు పెంచాలని క్షేత్రస్థాయి నాయకులు చర్చిస్తున్నారు. ఇక బీజేపీ నాయకులు కూడా ఇదే విషయంపై పట్టుబడుతున్నారు. గత ఎన్నికల్లో ఈ రెండు పార్టీలకు 31 స్థానాలను టిడిపి ప్రకటించింది. పది బీజేపీకి 21 స్థానాలను జనసేనకు ఇవ్వగా మిగిలిన స్థానాల్లో టిడిపి పోటీ చేసింది.
అయితే, వచ్చే ఎన్నికల్లో తమకు మరిన్ని సీట్లు పెంచాలి అన్నది జనసేన నుంచి బలంగా వినిపిస్తోంది. బిజెపి నుంచి కూడా అటువంటి డిమాండ్ తెర మీదకు వస్తుంది. సో.. క్షేత్రస్థాయిలో ఈ తరహా పరిస్థితి ఉన్నప్పుడు దీనిని ముందుగానే పరిష్కరించుకుని అడుగులు వేయాల్సిన అవసరం పార్టీలకు ఉంటుంది. లేని పరిస్థితిలో టికెట్ల పంచాయతీలు పదవుల పంచాయితీలు మరింత ముదిరే అవకాశం స్పష్టంగా కనిపిస్తుందని పరిశీలకులు భావిస్తున్నారు. 15 ఏళ్ల అధికారం విషయంలో ఎలాంటి తేడా లేకపోయినా.. అనుసరించే విధానమే కీలకమని అంటున్నారు పరిశీలకులు.