అగ్రరాజ్యంలో ఐఫోన్ పై వ్యతిరేకత.. ఎందుకంటే?
ప్రపంచ దేశాలలో అగ్రరాజ్యంగా పేరు సొంతం చేసుకున్న అమెరికాలో ఇప్పుడు ఐఫోన్ పై వ్యతిరేకత తీవ్రస్థాయిలో నెలకొంది.;
ఐఫోన్.. ప్రతి సామాన్యుడు కల.. నిజానికి ఆండ్రాయిడ్ ఫోన్ లలో ఎన్నో అధునాతన ఫీచర్లు అందుబాటులోకి వచ్చినా.. చాలామంది మాత్రం ఐఫోన్ ను ఒక అందనంత ద్రాక్ష లాగే చూస్తూ ఉంటారు. ఐఫోన్ ని సొంతం చేసుకోవాలని ఎన్నో ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. సాధారణంగా పల్లెటూర్లలో ఎవరి దగ్గరైనా ఐఫోన్ ఉందంటే వామ్మో అని వింతగా చూసిన సందర్భాలు కూడా ఇప్పటికీ తారస పడుతూనే ఉంటాయి. అంత డిమాండ్ తెచ్చుకున్న ఐఫోన్ కి ఇప్పుడు అగ్రరాజ్యంలో వ్యతిరేకత ఏర్పడుతుండడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ప్రపంచ దేశాలలో అగ్రరాజ్యంగా పేరు సొంతం చేసుకున్న అమెరికాలో ఇప్పుడు ఐఫోన్ పై వ్యతిరేకత తీవ్రస్థాయిలో నెలకొంది. ఉన్నట్టుండి ఇలా వ్యతిరేకత ఏర్పడడానికి గల కారణం ఏమిటి అనే విషయానికి వస్తే.. ఏ దేశంలో అయినా సరే ఐఫోన్ కొత్త సిరీస్ వస్తుందంటే.. ఆ హడావిడి మామూలుగా ఉండదు. ఫోన్ ను దక్కించుకునేందుకు కస్టమర్లు ముందు రోజు రాత్రి నుంచే షాపుల ముందు పడిగాపులు కాసిన దృశ్యాలు కూడా ఎన్నో ఉన్నాయి. అందులో భాగంగానే ఎప్పటిలాగే ఇప్పుడు ఐఫోన్ 17 సిరీస్ ఘనంగా లాంచ్ అయ్యింది. దీంతోఆపిల్ పార్కులో ఒకటే హంగామా.. మరికొన్ని రోజుల్లో బుకింగ్స్ కూడా మొదలవుతున్నాయి. అలా సెప్టెంబర్ 19 నుంచి మార్కెట్లోకి అందుబాటులోకి రాబోతున్న ఈ ఐఫోన్ 17 సిరీస్ ధరలు కూడా భారీగానే ఉండనున్నాయి.
ఇకపోతే ఇదంతా బాగానే ఉన్నా.. ఇప్పుడు మాత్రం అమెరికా నుంచి ఎక్కువగా ఈ ఐఫోన్ 17 సిరీస్ ఫోన్లపై ఆసక్తి చూపించడం లేదు అనే వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి కారణం కూడా లేకపోలేదు.. విషయంలోకి వెళ్తే.. ఆపిల్ చరిత్రలోనే తొలిసారి నాజూకైనా ఫోన్ ను రిలీజ్ చేస్తున్నట్టు ఐఫోన్ ప్రకటించింది. దీనికి 'ఐఫోన్ ఎయిర్' అని పేరు కూడా పెట్టారు. ఇది చూడడానికి స్లిమ్ గానే ఉన్నప్పటికీ బ్యాటరీ లైఫ్ మాత్రం కంపెనీ చెబుతున్న రేంజ్ లో లేదు అనేదే ప్రధాన ఆరోపణ. ఆల్ డే బ్యాటరీ లైఫ్ అని ఆపిల్ చెబుతోంది. కానీ గట్టిగా వాడితే నాలుగు గంటలకు మించి చార్జింగ్ రావడం లేదు అని వాషింగ్టన్ పోస్ట్ తన రివ్యూ లో చెప్పుకొచ్చింది. దీనికి తోడు చరిత్రలోనే తొలి నాజూకైనా ఫోన్ అని ప్రకటించడంతో.. ఇప్పటికే ఎన్నో కంపెనీలు ఈ సైజు కంటే అతి సన్నని రేంజ్ లోనే ఫోన్లను అందుబాటులోకి తీసుకొచ్చాయని దీనిపై సెటైర్లు కూడా వేస్తున్నాయి.
నిజానికి ఈ ఐఫోన్ 17 సిరీస్ నుండి ఫోల్డబుల్ మోడల్ వస్తుందని అందరూ భావించారు. కానీ స్లిమ్ మోడల్ వస్తుందని ఎవరు ఊహించలేకపోయారు. పైగా శాంసంగ్ కి పోటీగా ఫోల్డ్ చేసుకునే ఐఫోన్ వస్తుందని ఎంతో మంది ఎదురు చూసినా.. అది జరగకపోయేసరికి యూఎస్ యూజర్ లందరూ అసంతృప్తి వ్యక్తం చేశారు.దీనిపై శాంసంగ్ కూడా పరోక్షంగా సెటైర్లు వేసింది.
ఇకపోతే అమెరికాలో ఈ ఆపిల్ ఐఫోన్ లపై వ్యతిరేకత ఏర్పడడానికి మరో కారణం కూడా ఉంది. అదేంటంటే ఐఫోన్ 17 సిరీస్ లో ప్రో మాక్స్ ను తమ ఫ్లాగ్ షిప్ మోడల్ గా ప్రకటించింది. కానీ ఈ మోడల్ వెనుక భాగం చూస్తే మాత్రం గూగుల్ పిక్సెల్ ఫోన్ ను తలపిస్తోంది. దీంతో విమర్శలు చెలరేగుతున్నాయి. ధరల శ్రేణి పై ఎప్పటిలాగే విమర్శలు వస్తున్నా.. ఏఐ ఆధారిత ఫీచర్స్ చూపించి ధరలు ఇంకాస్త పెంచారనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. మొత్తానికైతే ఐఫోన్ మోడల్స్ పై ఈసారి అమెరికాలో ప్రశంసల కంటే విమర్శలు ఎక్కువ వినిపిస్తున్నాయి. మరి ఇప్పటికైనా ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకొని.. ఆపిల్ వినూత్నంగా ఆలోచనలు చేస్తుందేమో చూడాలి. ఏది ఏమైనా టెక్ చరిత్రలో ఇలా తొలిసారి ఐఫోన్లపై వ్యతిరేకత నెలకొనడం నిజంగా ఆశ్చర్యకరమని చెప్పవచ్చు.