అమెరికా వృద్ధి రేటు -0.5%.. చైనాది కేవలం 5.2%.. ఇండియా 7.8%.. ఇప్పుడు చెప్పు ట్రంప్?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశాన్ని "డెడ్ ఎకానమీ" అంటూ చులకనగా మాట్లాడిన వ్యాఖ్యలకు భారత ఆర్థిక వ్యవస్థ దిమ్మతిరిగే సమాధానం ఇచ్చింది.;
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశాన్ని "డెడ్ ఎకానమీ" అంటూ చులకనగా మాట్లాడిన వ్యాఖ్యలకు భారత ఆర్థిక వ్యవస్థ దిమ్మతిరిగే సమాధానం ఇచ్చింది. ఇటీవల విడుదలైన గణాంకాల ప్రకారం.. 2025-26 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో (Q1) భారతదేశ GDP ఏకంగా 7.8% వృద్ధిని నమోదు చేసి ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించింది. ఇదే సమయంలో అమెరికా వృద్ధి రేటు -0.5%గా పడిపోగా.. చైనా కేవలం 5.2% వృద్ధిని సాధించింది. ఈ అసాధారణ వృద్ధి భారత్ ఆర్థిక సత్తాను మరోసారి నిరూపించింది.
- వృద్ధికి కారణాలు
భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధికి ప్రధానంగా మూడు రంగాలు దోహదపడ్డాయి. వ్యవసాయ రంగం మొదటిది. గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ పెరగడం, వ్యవసాయ ఉత్పత్తులకు మంచి ధరలు లభించడం ఈ రంగానికి ఊతమిచ్చింది. ఇక రెడో రంగం ఫైనాన్షియల్ సర్వీసెస్. డిజిటల్ ఫైనాన్స్ విస్తరణ, రుణాలు సులభంగా లభించడం, బీమా రంగం వృద్ధి ఈ రంగాన్ని బలపరిచాయి. ఇక మూడోది రియల్ ఎస్టేట్.. పట్టణీకరణ వేగవంతం కావడం, ఇళ్ల నిర్మాణాలకు పెరుగుతున్న డిమాండ్ రియల్ ఎస్టేట్ రంగానికి ఊపునిచ్చింది. ఈ రంగాలన్నీ అంతర్గత వినియోగాన్ని పెంచి, ఆర్థిక వ్యవస్థకు స్థిరత్వాన్ని అందించాయి.
- టారిఫ్‌ల ప్రభావం తక్కువే
సాధారణంగా ప్రపంచ వాణిజ్య వివాదాలు, టారిఫ్‌లు దేశాల ఆర్థిక వ్యవస్థలపై తీవ్ర ప్రభావం చూపుతాయి. కానీ భారతదేశం విషయంలో ఇది భిన్నం. భారత ఆర్థిక వ్యవస్థ ఎగుమతులపై పూర్తిగా ఆధారపడదు. దేశీయ డిమాండ్ బలంగా ఉండటం, సేవల రంగం (సర్వీస్ సెక్టార్) వేగంగా విస్తరించడం వల్ల అంతర్జాతీయ అనిశ్చితులు భారత్‌పై పెద్దగా ప్రభావం చూపలేవు. ట్రంప్ వంటి నాయకులు భారత్‌పై ఎంత టారిఫ్‌లు విధించినా.. దేశ ఆర్థిక స్థిరత్వంపై పెద్దగా ప్రభావం ఉండదని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
- భవిష్యత్తు అంచనాలు
భారతదేశం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా నిలిచింది. బలమైన దేశీయ వినియోగ మార్కెట్, పెరుగుతున్న స్టార్టప్‌ల సంఖ్య, టెక్నాలజీ రంగంలో పురోగతి కారణంగా భారత్ భవిష్యత్తులో మరింత స్థిరంగా ముందుకు సాగుతుందని అంచనా. రాబోయే దశాబ్దంలో ప్రపంచ ఆర్థిక వేదికపై భారత్ ఒక నాయకుడిగా అవతరించే దిశగా అడుగులు వేస్తోంది.
మొత్తంగా ట్రంప్ "డెడ్ ఎకానమీ" అన్న వ్యాఖ్యలు పూర్తిగా వాస్తవానికి విరుద్ధమని.. భారతదేశం "గుడ్ ఎకానమీ" అని నిరూపించింది. ఇది కేవలం గణాంకాల విజయం మాత్రమే కాదు, భారత ఆర్థిక వ్యవస్థ యొక్క అంతర్గత బలం, స్థిరత్వానికి నిదర్శనం.