ఆకలి చావుల అంచున గాజా బాలలు.. రెండ్రోజుల్లో 14వేల మంది చిన్నారులకు మృత్యుగండం

గాజాలో ఇజ్రాయెల్-హమాస్ మధ్య కొనసాగుతున్న భీకర ఘర్షణల కారణంగా అప్పటికే తీవ్రమైన మానవతా సంక్షోభం మరింత దిగజారుతోంది.;

Update: 2025-05-20 17:30 GMT

గాజాలో ఇజ్రాయెల్-హమాస్ మధ్య కొనసాగుతున్న భీకర ఘర్షణల కారణంగా అప్పటికే తీవ్రమైన మానవతా సంక్షోభం మరింత దిగజారుతోంది. ఇజ్రాయెల్ విధించిన దిగ్బంధనం, మానవతా సాయంపై కొనసాగుతున్న ఆంక్షలు అక్కడి ప్రజల, ముఖ్యంగా చిన్నారుల ప్రాణాలను హరించివేస్తున్నాయి. ఆహారం, నీరు, మందులు లేక లక్షలాది మంది ప్రజలు ఆకలి, వ్యాధులతో అల్లాడుతున్నారు. ఈ పరిస్థితిపై ఐక్యరాజ్యసమితి తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ, అత్యవసర మానవతా సాయం అందకపోతే రాబోయే 48 గంటల్లోనే 14 వేల మంది చిన్నారులు మరణించే ప్రమాదం ఉందని సంచలన హెచ్చరిక చేసింది.

గాజాలో ఆకలి కేకలు

గత 19 నెలలుగా కొనసాగుతున్న ఘర్షణల వల్ల గాజాలో పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. ముఖ్యంగా మార్చి 2, 2025 నుంచి ఇజ్రాయెల్ అధికారులు మానవతా సాయాన్ని గాజాలోకి అనుమతించకపోవడంతో పరిస్థితి మరింత విషమించింది. ఐక్యరాజ్యసమితి మానవతా విభాగం చీఫ్ టామ్ ఫ్లెచర్ మాట్లాడుతూ.. "సోమవారం కేవలం ఐదు ట్రక్కుల సహాయ సామాగ్రి, శిశువుల కోసం ఆహారంతో సహా గాజాలోకి ప్రవేశించాయి. ఇది సముద్రంలో ఒక చుక్క నీటితో సమానం. ఈ సహాయం ఇంకా అవసరమైన ప్రాంతాలకు చేరలేదు" అని ఆవేదన వ్యక్తం చేశారు. "రాబోయే 48 గంటల్లో 14,000 మంది శిశువులు మరణించే అవకాశం ఉంది. మేము వారికి సహాయం చేయకపోతే పోషకాహార లోపంతో బాధపడుతున్న తల్లులు తమ పిల్లలకు ఆహారం ఇవ్వలేకపోతున్నారు" అని ఆయన హెచ్చరించారు.

యునిసెఫ్ (UNICEF), ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వంటి ఐరాస అనుబంధ సంస్థలు కూడా గాజాలోని బాలల పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశాయి. ఐదేళ్ల లోపు వయస్సున్న సుమారు 71,000 మంది చిన్నారులు తీవ్రమైన పోషకాహార లోపంతో బాధపడుతున్నారని, వీరిలో 14,100 మంది పరిస్థితి అత్యంత ప్రమాదకరంగా ఉందని మే 12న విడుదలైన ఒక నివేదిక వెల్లడించింది. మొత్తం గాజా జనాభాలో సగం మందికి పైగా తీవ్రమైన ఆహార కొరతను ఎదుర్కొంటున్నారని, వారిలో 5 లక్షల మందికి పైగా ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారని తెలిపింది. తాగునీటి కొరత, వైద్య సేవలు లేకపోవడం కూడా ఈ సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేస్తున్నాయి. పోషకాహార లోపం, డీహైడ్రేషన్ కారణంగా ఇప్పటికే కనీసం 57 మంది చిన్నారులు మరణించారని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

గాజాకు మానవతా సాయాన్ని అడ్డుకుంటున్న ఇజ్రాయెల్ తీరుపై బ్రిటన్, ఫ్రాన్స్, కెనడా వంటి దేశాలు తీవ్రంగా ఖండించాయి. మానవతా సాయంపై ఆంక్షలను ఎత్తివేయకపోతే ఉమ్మడి చర్యలు తీసుకుంటామని ఈ దేశాలు హెచ్చరించాయి. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు కూడా తమ మిత్రదేశాల ఒత్తిడితోనే గాజాలోకి కనీస స్థాయిలో సహాయాన్ని అనుమతించడానికి అంగీకరించినట్లు తెలిపారు. పోషకాహారంతో కూడిన కనీసం 100 ట్రక్కుల మానవతా సాయాన్ని గాజాలోకి అనుమతించాలని ఇజ్రాయెల్‌ను కోరారు. అలాగే, 24 లక్షల మంది పాలస్తీనావాసులకు మానవీయ సాయం అందేలా రఫా సహా అన్ని సరిహద్దులను తెరిచి, తక్షణ చర్యలు తీసుకోవాలని అంతర్జాతీయ సమాజానికి ఐరాస విజ్ఞప్తి చేసింది. మానవతా సహాయం నిలిచిపోవడం వల్ల కరువు వచ్చే ప్రమాదం ఉందని ఆహార నిపుణులు హెచ్చరించారు.

Tags:    

Similar News