యార్లగడ్డ మాస్ రియాక్షన్.. గన్నవరం అప్పుడే గరం.. గరం..
స్థానిక ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ప్రధానంగా కొన్ని కీలక నియోజకవర్గాల్లో ఈ వేడి మరింత ఎక్కువగా కనిపిస్తోంది.
స్థానిక ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ప్రధానంగా కొన్ని కీలక నియోజకవర్గాల్లో ఈ వేడి మరింత ఎక్కువగా కనిపిస్తోంది. రాష్ట్ర రాజకీయ రాజధాని విజయవాడ నగరంలో అంతర్భాగమైన గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రస్తుతం చోటుచేసుకుంటున్న రాజకీయాలు మరింత ఆసక్తిని కలిగిస్తున్నాయి. ఈ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే, వైసీపీ కీలక నేత వల్లభనేని వంశీ కొద్దిరోజులుగా హడావుడి చేస్తుండగా, ఆయనకు కౌంటరుగా ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావు రంగంలోకి దిగారు.
స్థానిక ఎన్నికలకు వైసీపీ క్యాడర్ ను సన్నద్ధం చేసేందుకు వరుస సమావేశాలు నిర్వహిస్తున్న మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తమ పార్టీ అధినేత జగన్మోహనరెడ్డికి హైప్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారని చెబుతున్నారు. గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్టు విషయాన్ని ఎత్తిచూపుతూ.. రెండు రోజుల క్రితం కీలక వ్యాఖ్యలు చేశారు. తనను లోపల వేసిన వారిని లోపలకు పంపిన వాడు తనతో ఉన్నాడంటూ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి అండదండలు ఉన్నాయని, తాను ఎవరికీ భయపడనని మాజీ ఎమ్మెల్యే వంశీ మాట్లాడిన వీడియో వైరల్ అయిన విషయం తెలిసిందే.
ఇక వంశీ వ్యాఖ్యలపై గన్నవరం సిట్టింగ్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకటరావు తీవ్రస్థాయిలో రియాక్ట్ అయ్యారు. వంశీ వెనక ఉన్నారని చెబుతున్న వ్యక్తే.. గతంలో అతడిపై తనను పోటీపెట్టాడని, వంశీ అరాచకాలను ఎదిరించాలని గన్నవరం టికెట్ ఇచ్చి పోటీకి పెట్టారని గుర్తు చేశారు. ‘‘నీ వెనుక ఉన్నవాడికి నీ గురించి తెలుసు.. నా గురించి తెలుసు. 2018లో బ్రహ్మలింగయ్య చెరువు ఒడ్డుమీద నీ వెనుక ఉన్నాయనే మట్టికాసుడు. రావణాసుడు, భూ బకాసురుడు అన్ని చెప్పిన వీడియో ఇప్పటికీ యూట్యూబ్ లో ఉంది. ఇప్పుడు అవన్నీ మరచిపోయి సుద్దపూస కబుర్లు చెబుతున్నావు’’ అంటూ ఎమ్మెల్యే యార్లగడ్డ మండిపడ్డారు.
మాజీ ఎమ్మెల్యే వంశీ అవినీతిపరుడు అని మాజీ సీఎం జగన్మోహనరెడ్డి తనను అమెరికా నుంచి తీసుకువచ్చి గన్నవరంలో పోటీ చేయమని కోరిన విషయం మరచిపోయావా? అంటూ ప్రశ్నించారు. బుద్ధి, జ్ఞానం లేకుండా నిర్లజ్జగా మాట్లాడుతున్నారని యార్లగడ్డ ఫైర్ అయ్యారు. ప్రస్తుతం యార్లగడ్డ రియాక్షన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కృష్ణా జిల్లాలో ఉన్న గన్నవరం నియోజకవర్గం తొలి నుంచి టీడీపీకి కంచుకోటగా ఉంది. ఇక్కడి నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వంశీ గత ప్రభుత్వంలో వైసీపీలో చేరగా, అప్పుడు ఆయనపై వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన యార్లగడ్డ వెంకటరావు 2024 అసెంబ్లీ ఎన్నికల ముందు టీడీపీలో చేరారు.
ఇక ఈ ఇద్దరు గత ఎన్నికల్లో మరోసారి ప్రత్యర్థులుగా తలపడగా, యార్లగడ్డ వెంకటరావు రికార్డు మెజార్టీతో గెలిచారు. అదేసమయంలో అంతకుముందు ఎన్నికల్లో ప్రత్యర్థులుగా తలపడిన ఈ ఇద్దరు ఇప్పుడు తమ పార్టీలను పార్టీ అధినేతలను పొగుడుతూ ప్రత్యర్థి పార్టీల నేతలను విమర్శిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అప్పట్లో ఆయా పార్టీల అధినేతల మన్ననల కోసం పనిచేసిన నాయకులు ఇప్పుడు పార్టీలు మారి వారిపైనే విమర్శలు చేయడం ఆసక్తి రేపుతోంది. ఈ క్రమంలోనే గతంలో టీడీపీలో పనిచేసిన వంశీ అప్పట్లో తనను నెంబర్ వన్ ఎమ్మెల్యే అంటూ పొగిడేవారని చెప్పుకోగా, అప్పట్లో ఆయనపై మాజీ సీఎం జగన్ చేసిన విమర్శలను కూడా గుర్తుచేస్తూ ఎమ్మెల్యే వెంకటరావు చేస్తున్న వ్యాఖ్యలు రాజకీయంగా చర్చకు దారితీస్తున్నాయని చెబుతున్నారు.