బాబు పొలిటికల్ వ్యూహాలు అవే - సీపీఐ నారాయణ

ఇక ఎన్టీఆర్ గురించి చెబుతూ ఆయన టీడీపీని పెట్టడం వల్ల 1983లో వామపక్షాలు అధికారంలోకి వచ్చే చాన్స్ తప్పిపోయింది అన్నారు.;

Update: 2026-01-17 03:42 GMT

సీపీఐ నారాయణ ఎనిమిది పదులు దాటిన సీనియర్ రాజకీయ నాయకుడు, అర్ధ శతాబ్ద కాలంగా వామపక్ష భావజాలంతో కూడిన రాజకీయ జీవితాన్ని గడుపుతూ వస్తున్నారు. ఎమ్మెల్యే ఎంపీగా ఏనాడూ పోటీ చేయలేదు, వామపక్షాన్నే నమ్ముకుని ప్రజా జీవితంలో కొనసాగుతున్న నారాయణ తాజాగా ఒక యూట్యూబ్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన రాజకీయ జీవితంతో పాటు ఉమ్మడి తెలుగు నాట రాజకీయం చంద్రబాబు వైఎస్సార్ ఇలా చాలా మంది గురించి ఎన్నో విషయాలను ఆసక్తిగా చెప్పుకొచ్చారు.

బాబుతో అప్పటి నుంచి :

చంద్రబాబు తిరుపతి ఎస్వీ యూనివర్శిటీలో స్టూడెంట్ లీడర్ గా ఉన్నప్పటి నుంచి తనకు తెలుసు అని నారాయణ చెప్పారు. వైసీపీ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రబాబుల మధ్య విద్యార్ధి రాజకీయాలు పోటాపోటీగా సాగేవని నారాయణ చెప్పారు. ఆ సమయంలో వామపక్ష విద్యార్థి సంఘాన్ని తాము స్థాపించామని తమ సత్తా చాటామని చెప్పారు. ఇదిలా ఉంటే బాబు తాను అనుకున్న దానిని సాధించడం కోసం ఎంతైనా కష్టపడతారు అని చెప్పారు. బాబుకు రాజకీయ గురువుగా చిత్తూరు జిల్లాలో రాజగోపాలనాయుడు ఉండేవారు అని చెప్పారు. 1978లో చంద్రబాబు కాంగ్రెస్ ఐ నుంచి తొలిసారిగా టికెట్ సాధించారని, చంద్రగిరి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు అని చెప్పారు. ఇక బాబుకు మంత్రి పదవి దక్కడం వెనక ఆయన కృషితో పాటు ఇతర రాజకీయ పరిణామాలు కూడా కలిసి వచ్చాయని చెప్పారు. అలా అంజయ్య కేబినెట్ లో సినిమాటోగ్రఫీ మంత్రిగా బాబు చేరారు అన్నారు.

బాబుకు వైఎస్సార్ కి తేడా :

ఇక రెడ్డి కాంగ్రెస్ నుంచి వైఎస్సార్ అదే 1978లో ఎమ్మెల్యేగా ఫస్ట్ టైం గెలిచారని ఇద్దరూ మంత్రులుగా ఒకేసారి అయ్యారని చెప్పారు. ఇక ఇద్దరికీ నేర చరిత్ర లేదని కానీ ఎవరైనా తప్పు చేసినా తన వారు అయితే మాత్రం వారిని కాపాడేందుకు వైఎస్సార్ ముందుంటారని బాబు మాత్రం ఆ విషయంలో పెద్దగా జోక్యం చేసుకోరని చెప్పారు. ఇక బాబు తన ఎదుగుదలకు కృషి చేసిన వారు ఎవరైనా తన రాజకీయమే ముఖ్యం అనుకుని ముందుకు సాగుతారని కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మిగిలిన విషయాల గురించి పెద్దగా ఆలోచించరని అన్నారు. వైఎస్సార్ వరకూ చూస్తే మంచి మాస్ లీడర్ గా చిన్ననాటి నుంచే ఎదిగారని చెప్పారు.

బాబు వ్యూహాత్మకంగా :

తెలుగుదేశం పార్టీని ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు తన చేతుల్లోకి తీసుకోవడం మీద వెన్ను పోటు అని చాలామంది అంటారని కానీ ఆనాడు బాబు టీడీపీలో అంతర్గతంగా ఉన్న పరిస్థితులను అర్ధం చేసుకుని పార్టీ పూర్తిగా పోకుండా ఆ పని చేయాల్సి వచ్చిందని అన్నారు. అందుకే తాము బాబుకు అప్పట్లో మద్దతు ఇచ్చామని చెప్పారు. టీడీపీలో ఎన్టీఆర్ అంతర్గతంగా జరిగే పరిణామాలను గుర్తించలేకపోయారు అన్నారు. అయితే ఎన్టీఆర్ మండల వ్యవస్థను ఏర్పాటు చేయడం కరణాలు మునసబుల వ్యవస్థను రద్దు చేయడం వంటి మంచి నిర్ణయాలు తీసుకున్నారు అని అన్నారు.

కమ్యూనిస్టులకు చాన్స్ మిస్ :

ఇక ఎన్టీఆర్ గురించి చెబుతూ ఆయన టీడీపీని పెట్టడం వల్ల 1983లో వామపక్షాలు అధికారంలోకి వచ్చే చాన్స్ తప్పిపోయింది అన్నారు. అప్పట్లో ఉభయ వామపక్షాలు సంఘటితంగా పోరాడుతూ నాటి కాంగ్రెస్ ని గద్దె దించాలని చూశాయని చెప్పారు. ఎన్నో ప్రజా ఉద్యమాలను నిర్మించామని ఫలితంగా కాంగ్రెస్ వ్యతిరేక రాజకీయ వాతావరణం ఏర్పడింది అని నారాయణ చెప్పారు. అయితే కరెక్ట్ సమయంలో ఎన్టీఆర్ టీడీపీని అనౌన్స్ చేసి కొత్త పార్టీగా జనం ముందుకు రావడంతో ప్రజలు ఆ ఆకర్షణలో పడి టీడీపీని నెగ్గించారు అన్నారు. దాంతో కమ్యూనిస్టులకు తొలిసారిగా ఏపీలో అధికారం దక్కే చాన్స్ పోయింది అని అన్నారు. ఇక 1983లో టీడీపీతో కమ్యూనిస్టులు పొత్తు పెట్టుకోలేదని గుర్తు చేశారు 1984 లో జరిగిన నాదెండ్ల ఇష్యూ తరువాతనే తాము టీడీపీతో మిత్ర పక్షంగా కలిసామని చెప్పారు.

Tags:    

Similar News