కాక్రోచ్ టు కార్పొరేట్ మజ్దూర్.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న డిజిటల్ పార్టీలు

ఇప్పుడు సంభాషణలు, ఆందోళనలు, హాస్యం.. అన్నీ డిజిటలైజ్ అయ్యాయి. ఒకప్పుడు రాజకీయ పార్టీలంటే జెండాలు, మైకులు, రోడ్ షోలు గుర్తొచ్చేవి.

Update: 2026-05-27 09:30 GMT

ఇప్పుడు సంభాషణలు, ఆందోళనలు, హాస్యం.. అన్నీ డిజిటలైజ్ అయ్యాయి. ఒకప్పుడు రాజకీయ పార్టీలంటే జెండాలు, మైకులు, రోడ్ షోలు గుర్తొచ్చేవి. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. అంతా డిజిటల్ మయం. మన బాధలు, ఆందోళనలు, ఆఫీస్ ఫ్రస్ట్రేషన్లు వంటివి అన్నీ మీమ్స్ రూపంలోకి మారిపోయాయి. ఇంటర్నెట్‌లో కొత్త ట్రెండ్ సెట్ చేస్తున్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్న కాక్రోచ్ పార్టీ మరికొందరికి ప్రేరణగా మారిపోయింది. నిరుద్యోగ యువతను కాక్రోచ్ పార్టీ విపరీతంగా ఆకర్షించగా, కార్పొరేట్ ఉద్యోగాలు చేస్తున్న యువత తమకు కూడా అలాంటి పార్టీ ఒకటి ఉంటే బాగుణ్ణు అని భావించారేమో.. కార్పొరేట్ ఉద్యోగుల గుండె చప్పుడుగా చెబుతూ నెట్టింట ‘కార్పొరేట్ మజ్దూర్ జనతా పార్టీ’ (Corporate Majdoor Janta Party - CMJP) పేరుతో సరికొత్త వేదికను ప్రారంభించారు.

లింక్డ్‌ఇన్ (LinkedIn) లో ఒక సాధారణ వ్యంగ్య పోస్ట్‌గా మొదలైన ఈ వ్యవహారం.. ఇప్పుడు కార్పొరేట్ ఉద్యోగుల అలసట, పని ఒత్తిడి, కార్యాలయ సంస్కృతిపై ఉన్న అసంతృప్తిని హాస్య రూపంలో బయట పెడుతోంది. ఈ పేజీలో పోస్టులు విశేషంగా వైరల్ అవుతూ సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి. ఆశ్చర్యకరంగా దీనికోసం ఒక వెబ్‌సైట్ కూడా పుట్టుకొచ్చింది. అందులో 'జాయిన్ ద మూమెంట్‌' అంటూ పిలుపునిస్తుండటం విశేషంగా చెబుతున్నారు. ఇది పెరుగుతున్న డిజిటలైజేషన్‌కు అసలైన అద్దం పడుతోందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.

కార్పొరేట్ మజ్దూర్ జనతా పార్టీ డిమాండ్లు ఇవేనట!

ప్రముఖ కమెడియన్ అన్మోల్ గర్గ్ కూడా ఇదే థీమ్‌పై వీడియోలు చేస్తూ ఈ ట్రెండ్‌కు మరింత హైప్ తీసుకొచ్చారు. కార్పొరేట్ ఉద్యోగులు రోజువారీ లైఫ్‌లో ఎదుర్కొనే లేఆఫ్‌లు, వేధింపులు, తక్కువ హైక్‌లు, టాక్సిక్ వర్క్ కల్చర్‌పై నిరసనగా ఈ క్యాంపెయిన్‌ సాగుతోంది. ఈ 'కార్పొరేట్ జనతా పార్టీ' మేనిఫెస్టోలో కొన్ని క్రేజీ డిమాండ్లు కూడా ఉన్నాయి. సడన్‌గా ఉద్యోగం నుంచి తీసేస్తే కంపెనీలు భద్రత కల్పించాలనేది ప్రధాన డిమాండ్ కాగా, ఒకేసారి ఒకటి కంటే ఎక్కువ కంపెనీల్లో పనిచేసుకునే స్వేచ్ఛ కల్పించాలని కోరడం విశేషం. అదేవిధంగా ఆఫీస్ వేళలు అయిపోయాక క్విక్ కాల్స్, మేనేజర్ల మెయిల్స్‌కు ఫుల్‌స్టాప్ పెట్టాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇక యథావిధిగా జీతాల పెంపుపైనా ఒక లైన్ యాడ్ చేశారు.

వర్క్‌ఫోర్స్ ఉద్యమంగా..

ఇక కార్పొరేట్ మజ్దూర్ పార్టీని కొందరు కేవలం టైమ్‌పాస్ మీమ్ పేజీలా కాకుండా, ప్రైవేట్ రంగ ఉద్యోగుల హక్కుల కోసం ఏర్పాటయిన ఒక డిజిటల్ సైన్యంగా అభివర్ణిస్తున్నారు. కొన్ని ప్లాట్‌ఫారమ్‌లలో ఈ ఖాతాలను బ్యాన్ చేసినప్పటికీ, నెటిజన్లు, కార్పొరేట్ 'మజ్దూర్లు' అందిస్తున్న సంఘీభావంతో ఈ డిజిటల్ విప్లవం మరింత చర్చనీయాంశంగా మారింది. ఏదేమైనా, ఆఫీసులో బాస్ ఇచ్చే ప్రెజర్‌ను తట్టుకోవడానికి, లాప్‌టాప్ ముందు కూర్చుని విసిగిపోయిన ఐటీ బాబులకు ఈ 'కార్పొరేట్ మజ్దూర్ జనతా పార్టీ' మీమ్స్ ఒక పెద్ద రిలాక్సేషన్ అని అంటున్నారు.

Tags:    

Similar News