బాబు జగన్ పవన్ ఒక్కటిగా ధర్మాగ్రహం
ఏపీలో అరుదైన రాజకీయ సన్నివేశం బాహాటంగా కనిపించింది. ఇంతకాలం ఏపీలోని ఎన్డీయే పార్టీలు ఒక వైపు వైసీపీ ఒక వైపు అన్నట్లుగా ఉండేది.;
ఏపీలో అరుదైన రాజకీయ సన్నివేశం బాహాటంగా కనిపించింది. ఇంతకాలం ఏపీలోని ఎన్డీయే పార్టీలు ఒక వైపు వైసీపీ ఒక వైపు అన్నట్లుగా ఉండేది. అయితే కేంద్రం పెట్టే బిల్లులకు వైసీపీ కూడా సమయానుకూలంగా మద్దతు ఇస్తూ వస్తోంది. అదే విధంగా మహిళా రిజర్వేషన్ బిల్లు విషయంలో కూడా వైసీపీ ఫుల్ సపోర్టు ఇచ్చింది. కానీ లోక్ సభలో బిల్లు వీగిపోయింది. దాంతో ఎన్డీయే పక్షాలు అన్నీ ప్రతిపక్షాల మీద విరుచుకుపడుతున్నాయి. అయితే ఎన్డీయేకు ఏపీలో విపక్షం అయిన వైసీపీ కూడా జాతీయ స్థాయిలో విపక్షాలను విమర్శించడం రాజకీయ విశేషంగా చెబుతున్నారు.
మహిళలకు ద్రోహమన్న బాబు :
దేశంలోని చట్టసభలలో మహిళలకు రిజర్వేషన్లు కల్పించే కీలక బిల్లును అడ్డుకోవడం ద్వారా కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్షాలు చారిత్రక తప్పిదానికి పాల్పడ్డాయని చంద్రబాబు తీవ్రంగా విమర్శించారు. దీని వెనక రాజకీయ దురుద్దేశం మాత్రమే లేదని, చట్ట సభలలో అవకాశాల కోసం చూస్తున్న లక్షలాది మంది మహిళలకు చేసిన అతి పెద్ద ద్రోహమని ఆయన అన్నారు. ఈ ద్రోహాన్ని దేశం మొత్తం ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని బాబు హెచ్చరించారు. ఈ మేరకు బాబు సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ నాయకత్వంలోని ఇండియా కూటమి మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. విపక్షాల చర్యల వల్ల దేశం ఒక చారిత్రక అవకాశాన్ని కోల్పోయిందని బాబు ఆవేదన వ్యక్తం చేశారు.
సదవకాశాన్ని దూరం చేశారన్న పవన్ :
ఇక ఎన్డీయేలో మరో కీలక భాగస్వామి అయిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఈ విషయం మీద తీవ్రంగా స్పందించారు. చట్ట సభల్లో మహిళా శక్తిని పెంపొందించే సదవకాశాన్ని ప్రతిపక్ష పార్టీలు దూరం చేశాయని ఆయన అన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రతిపక్షాలు కూడా ఆమోదించి ఉంటే వారికీ గౌరవం దక్కేదని గుర్తు చేశారు. అయితే రానున్న రోజుల్లోనైనా మహిళా శక్తికి చట్ట సభల్లో సముచిత స్థానం దక్కుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈ బిల్లును లోక్ సభ ముందుకు తీసుకువచ్చిన ప్రక్రియను ఎన్డీయే భాగస్వామ్య పక్షంగా జనసేన పార్టీ స్వాగతించిందని ఈ బిల్లు ఆమోదం పొంది ఉంటే యావత్ భారత మహిళలు ఎంతో సంతోషించి ఉండేవారని పవన్ కళ్యాణ్ అన్నారు.
అన్యాయం అన్న జగన్ :
ఇక మహిళా బిల్లు పార్లమెంట్ లో ఆమోదానికి నోచుకోకపోవడం పట్ల వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. జాతీయ విపక్షం మీద ఆయన మండిపడ్డారు. ఈ పరిణామంతో మహిళలకు మాత్రమే కాదని దక్షిణ రాష్ట్రాలకు న్యాయం జరగలేదని జగన్ వ్యాఖ్యానించడం విశేషం. అంతే కాదు 2026 జనాభా లెక్కలతో డీలిమిటేషన్ చేస్తే దక్షిణాదికి అతి పెద్ద నష్టమని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మహిళా రిజర్వేషన్ చట్ట సవరణ బిల్లును పార్లమెంటులో వ్యతిరేకించిన పార్టీలు తాము ఏం సాధించాయో ఆత్మపరిశీలన చేసుకోవాలని ఆయన కోరారు. మొత్తం మీద బాబు జగన్ పవన్ ఒక అంశంలో ఇంత ఏకాభిప్రాయంతో ముందుకు రావడం ఇంతకు ముందు ఎప్పుడూ లేదు. దాంతో అంతా ఈ ముగ్గురు ట్వీట్లను ఆసక్తిగా చూస్తున్నారు.